ప్రేమానురాగాలకు ప్రతీక

ABN , First Publish Date - 2022-08-12T06:15:18+05:30 IST

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను తెలిపే పండుగ రక్షాబంధన్‌. ఒకప్పుడు రాఖీ పండుగ ను ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే వారు. క్రమేనా రాఖీ పండుగ సోదరీసోదరుల అనురాగానికి ప్రతీకగా మారింది.

ప్రేమానురాగాలకు ప్రతీక
సిరిసిల్ల మార్కెట్‌ల్లో. రాఖీ కొనుగోళ్లు

- నేడు రక్షాబంధన్‌, నూలు పౌర్ణమి 

- ఆప్యాయతను చాటుకోనున్న సోదరీసోదరులు

- యజ్ఞోపవీతం పరమ పవిత్రం 

 (ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) 

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను తెలిపే పండుగ రక్షాబంధన్‌.  ఒకప్పుడు రాఖీ పండుగ ను ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే వారు. క్రమేనా రాఖీ పండుగ సోదరీసోదరుల అనురాగానికి ప్రతీకగా మారింది. జాతీయ పండుగలా దేశవ్యాప్తంగా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు.  సోదరులు క్షేమంగా ఉండాలని అక్కాచెళ్లెళ్లు రాఖీ కట్టి ప్రేమ, ఆప్యాయ తలను చాటుకుంటారు. ఇదే సందర్భంలో సోదరీ మణులకు అండగా ఉంటామని అన్నాదమ్ములు భరోసా ఇస్తారు. శ్రావణమాసంలో వచ్చే  రక్షాబంధన్‌  ను శుక్రవారం జిల్లాలో నిర్వహించుకోనున్నారు. 

సిరిసిల్ల మార్కెట్లో రాఖీల సందడి

 కష్టా సుఖాల్లో తోడుండే అన్నదమ్ములతోపాటు నేస్తాలను సోదరులుగా భావిస్తూ ఆడపడుచులు రాఖీలు కంటే వేళైంది. శుక్రవారం రాఖీ పండుగ కావడంతో మూడు, నాలుగు రోజుల ముందునుంచే దూర ప్రాంతాల్లో ఉండే సోదరుల ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమై న ఆడపడుచులు రాఖీల కొనుగోలు చేశారు. ఈసారి పండుగ కోసం విభిన్నమైన డిజైన్లలో రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. రాఖీల  కొనుగోళ్లతో  సిరిసిల్ల మార్కెట్లో సందడి నెలకొంది. ఈ సారి మార్కెట్లో చిన్నారులకు స్సైడర్‌మ్యాన్‌, చోటా బీమ్‌, బెన్‌టెన్‌, డోరెమాన్‌, జెర్రీ, హనుమాన్‌ వంటి వెరైటీ  కార్టూన్ల రాఖీలు,, యువత కోసం ఫ్యాన్సీ స్టోన్స్‌ రాఖీలు లభిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  రాఖీల కోసం ప్రత్యేకమైన దుకాణాలు  వెలిశాయి. పశ్చిమ బెంగల్‌, గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి వివిధ రకాల రాఖీలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.  చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై రాఖీలను పెట్టుకొని కార్మిక వాడల్లో అమ్మకాలు సాగించారు. ఈ సారి  రుద్రాక్ష, స్టోన్‌ రాఖీలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కుందన్‌ల మెరుపులు, జరీతోపాటు స్పంజ్‌తో తయారు చేసిన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. పాత కాలంలో అతిపెద్దగా ఉండే రాఖీలు కట్టుకునే వారు. మళ్లీ ఆ ట్రెండ్‌ వచ్చింది. మార్కెట్లో రూ.50 నుంచి రూ.100   పెద్ద రాఖీలు విక్రయిస్తున్నారు. చిన్నపిల్లల రాఖీలు 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు, స్టోన్‌ రాఖీలు రూ.25 నుంచి రూ.300 వరకు లభిస్తున్నాయి. ఒక గ్రాము వెండితో తయారు చేసిన రాఖీలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. 

వివిధ రాష్ట్రాల్లో... 

తెలంగాణ, ఆంధ్రాలో రాఖీగా పిలిస్తే  మహారాష్ట్ర, గోవా, గుజారాత్‌లో నార్యల్‌ పూర్ణిమ, ఒరిస్సాలో బ్రహ్మ పూర్ణిమ, ఉత్తరాఖండ్‌లో జనోపున్య, మధ్యద్రేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, బిహార్‌లో ఖజరీ పూర్ణిమగా పిలుస్తూ పండుగ జరుపుకుంటారు. 

జంధ్యాల పూర్ణిమ 

శ్రావణ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ (నూలు పౌర్ణమి)గా జరుపుకుంటారు. యజ్ఞోపవీతాన్ని  శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకుంటారు. సంవత్సరం మధ్యలో మార్చుకోవల్సిన అవసరం ఉన్నా శ్రావణ పూర్ణిమ నాడు విధిగా నూతన ధారణ చేస్తారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా  శుక్రవారం అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములకు వారి క్షేమాన్ని కోరుతూ రక్షగా రాఖీ కట్టే పండుగను జరుపుకోవడానికి సిద్దమవుతున్నారు. శ్రావణ పూర్ణిమ రోజు రక్ష కట్టి వారు కోరిన వరాలను పొందే పవిత్ర దినంగా కూడా జరుపుకుంటారు. ఇదే సందర్భంలో ఉపనయం అయిన బ్రాహ్మణ, వైశ్య, పద్మశాలీ ఇతర కులాల వారు యజ్ఞోపవీతాలను మార్చుకుంటారు.  నూలు పౌర్ణమి సందర్భంగా పద్మశాలీలు మార్కండేయ స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 

Updated Date - 2022-08-12T06:15:18+05:30 IST