నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

ABN , First Publish Date - 2022-05-18T05:35:40+05:30 IST

రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆజయకుమార్‌ హెచ్చరించారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఓపీ రికార్డును పరిశీలిస్తున్న కమిషనర్‌

- ఆరోగ్యశాఖ కమిషనర్‌ అజయ్‌కుమార్‌

- జిల్లా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

- రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా

గద్వాల క్రైం, మే 17 : రోగులకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆజయకుమార్‌ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అన్ని వార్డులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కొన్ని వార్డుల్లో ఓపీ వైద్యులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జిల్లా ఆసుపత్రిలో ఆకస్మికంగా తనిఖీ చేపట్టిందుకు వచ్చినట్లు తెలిపారు. వైద్యుల పనితీరు అస్తవ్యస్తంగా ఉందని, వారి మధ్య సమన్వయం లేకపోవడంతో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉందన్నారు. జిల్లా ఆసుపత్రిలో ఉన్న వైద్యులు, సిబ్బంది కొరతను త్వరలోనే తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతుల లోపం లేకుండా చూసేందుకు త్వరలోనే చర్యలు చేపడుతామన్నారు. జిల్లా ఆసుపత్రి వైద్యుల్లో ఎక్కువ మందికి ప్రైవేట్‌ ఆసుపత్రులు ఉన్నాయని, అందుకే వారు సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఇకపై ప్రతి వైద్యుడు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహించకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.  డాక్టర్‌ డ్యూటీ టైంలో ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉన్నట్లు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు 75శాతం, సెజీరియన్‌లు 25 శాతం జరుగుతున్నాయని, 100 శాతం సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.  ప్రస్తుతం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వారిని మార్చే ఉద్దేశం లేదని తెలిపారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ చందూనాయక్‌ తదితరులు ఉన్నారు. అనంతరం వైద్యులతో సమావేశాన్ని నిర్వహించారు.

Updated Date - 2022-05-18T05:35:40+05:30 IST