దూసుకొచ్చిన మృత్యువు

ABN , First Publish Date - 2022-08-17T05:57:19+05:30 IST

బైక్‌ను ఎదురు నుంచి వేగంగా వచ్చిన వ్యాన్‌ ఢీకొట్టి బోల్తాపడటంతో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

దూసుకొచ్చిన మృత్యువు

బైక్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టిన వ్యాన్‌

డ్రైవర్‌తోపాటు భార్యాభర్తలు మృతి 

నలుగురికి తీవ్రగాయాలు

ఎర్రగొండపాలెం, ఆగస్టు 16 : బైక్‌ను ఎదురు నుంచి వేగంగా వచ్చిన వ్యాన్‌ ఢీకొట్టి బోల్తాపడటంతో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఎర్రగొండపాలెం సమీపంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ఎదుట మంగళవారం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. త్రిపురాంతకం మండలం కంకణాలపల్లి ఎస్సీ కాలనీ-2కు చెందిన భార్యాభర్తలు దొరెడ్ల రంగయ్య (40), మరియమ్మ(38) వైద్యచికిత్స కోసం వైపాలెం ఆసుపత్రికి  వచ్చారు. చికిత్స అనంతరం తమ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. వారు వైపాలెం-త్రిపురాంతకం రహదారిలో కస్తూర్బా బాలికల పాఠశాల సమీపంలోకి  చేరుకునే సరికి ఎదురుగా వేగంగా వచ్చిన వ్యాన్‌ ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రంగయ్య, మరియమ్మలతోపాటు, వ్యాన్‌డ్రైవర్‌ పి.భాగ్యరాజ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. వ్యాన్‌లో ఉన్న మరో నలుగురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న సీఐ కె.మారుతీకృష్ణ, ఎస్‌ఐ జి.కోటయ్య ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులైన సూరగాని నవీన్‌, కిశోర్‌, మహహ్మద్‌ ఆసిఫ్‌, మున్నాసుధలను అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించారు. మృతదేహాలను వైపాలెం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. ప్రమాదంలో గాయపడిన నలుగురు కూలీలది గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామం. బేల్దారి పనులకోసం వైపాలెం వచ్చారు. స్థానికంగా ఉన్న మేస్త్రి ఆధ్వర్యంలో పనులు చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం పార్శిల్‌ కోసం పనిప్రదేశం నుంచి వ్యాన్‌లో వైపాలెం వస్తుండగా ఈ ప్రమా దం చోటుచేసుకుంది. వాహనాన్ని భాగ్యరాజ్‌ నడుపుతుండగా, కూలీలు నవీన్‌, కిశోర్‌, ఆసిఫ్‌, మున్నాసుధ వ్యాన్‌లో ఉన్నారు. వ్యాన్‌డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై రంగయ్య కుమారుడు తిరుమలేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


 తల్లిదండ్రుల మృతితో అనాథలుగా పిల్లలు

రంగయ్య, మరియమ్మలది రెక్కాడితేగాని డొక్కాడని పేదకుటుంబం. భార్యభర్తలు ఇద్దరూ మృతిచెందడంతో  కుమారుడు తిరుమలేష్‌తోపాటు, ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ ఘటనతో కంకణాలపల్లి ఎస్సీ కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. తిరుమలేష్‌ ప్రస్తుతం బేల్దారి పనులు చేస్తుండగా బాలికలు ఇద్దరూ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు.






Updated Date - 2022-08-17T05:57:19+05:30 IST