భయం.. భయంగా...

ABN , First Publish Date - 2020-12-06T05:26:26+05:30 IST

మండలంలోని ఎగువగొట్టివీడు జడ్పీ ఉన్నత పాఠశాలను 1986వ సంవత్సరంలో ప్రారంభించారు. ఆనాడు 5 పక్కా భవనాలు, రెండు పెంకుల షెడ్లను నిర్మించారు. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు 175 మంది విద్యార్థులు చదువుతున్నారు.

భయం.. భయంగా...
తరగతి గదిలో నిలిచిన వర్షం నీరు

వర్షం వస్తే నరకమే...

పెచ్చులూడుతున్న పైకప్పు... ఉరుస్తున్న గోడలు

కూలడానికి సిద్ధంగా గొట్టివీడు ఉన్నత పాఠశాల

భయాందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు

రెండో విడతలో కూడా నాడు- నేడుకు నోచుకోని వైనం


వర్షం వస్తే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాలి. పెచ్చులు ఊడిపడడంతో పాటు గోడలన్నీ నీటితో ఉరుస్తూ కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. తరగతి గదుల్లో నీరు వచ్చి చేరుతోంది. నీటిలో నిలబడే ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారు. భవనాలు ఎప్పుడు కూలుతాయోనని ఆ పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు భయం భయంగా... కాలం వెల్లదీస్తున్నారు. ఇంత అధ్వాన్న స్థితిలో ఉన్నా నాడు-నేడు రెండో విడతలోనూ ఈ పాఠశాల ఎంపిక కాకపోవడం గమనార్హం. మండలంలోని ఎగువగొట్టివీడు జడ్పీ ఉన్నత పాఠశాల దుస్థితి 


గాలివీడు, డిసెంబరు 5:  మండలంలోని ఎగువగొట్టివీడు జడ్పీ ఉన్నత పాఠశాలను 1986వ సంవత్సరంలో ప్రారంభించారు. ఆనాడు 5 పక్కా భవనాలు, రెండు పెంకుల షెడ్లను నిర్మించారు. ఇందులో 6 నుంచి 10వ తరగతి వరకు 175 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం 8, 9, 10వ తరగతులకు చెందిన 100 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనాలు జల్లెడ మాదిరి కారుతున్నాయి. పాఠశాల పెచ్చులు ఊడి విద్యార్థులపై పడుతున్నాయి. గోడలన్నీ తడిసి ఉరుస్తున్నాయి. తరగతి గదుల్లో నీటితో నిండి ఉన్నాయి. ఎప్పుడైనా పాఠశాల భవనాలు కుప్పకూలే ప్రమాదం ఉందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.  ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. స్థానిక రాజకీయ నాయకులతో పాటు జిల్లా అధికారులకు కూడా పాఠశాల దుస్థితి గురించి తెలియచేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. తరగతి గదిలో నీటిలో నిలబడి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నామని, తరగతి గదులన్నీ నీటి నిలయ కేంద్రంగా మారాయని ఉపాధ్యాయులు వాపోయారు. నాడు- నేడుకు కూడా ఈ పాఠశాల నోచుకోలేదని, ఇదే దుస్థితి కొనసాగితే విద్యార్థులు పాఠశాలకు రావడం మానేస్తారని చెబుతున్నారు. పాఠశాల దుస్థితి గురించి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పాఠశాల కనీసం రెండో విడత నాడు-నేడుకు కూడా ఎంపిక కాకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్త పాఠశాల భవనాలను కట్టించి విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలు కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 


భయానక పరిస్థితిలో విద్యను అభ్యసిస్తున్నాం

- పాఠశాల విద్యార్థులు

వర్షం వస్తే పాఠశాల పైకప్పు నుంచి పెచ్చులు ఊడి మీద పడుతున్నాయి. పైకప్పు నుంచి బొట్టు బొట్లు మాదిరి వర్షపు నీరు కిందకు పడుతోంది. గోడలన్నీ తడిసి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మేమందరం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని  భయంతో విద్యను అభ్యసిస్తున్నాం. 



Updated Date - 2020-12-06T05:26:26+05:30 IST