అన్నమయ్య, పింఛా.. ఖాళీ..!

ABN , First Publish Date - 2020-11-28T05:30:00+05:30 IST

వరుణుని ఉగ్రరూపం ఒకవైపు, పాలకులు అధికారుల నిర్లక్ష్యం మరోవైపు.. వెరసి రెండు ప్రాజెక్టులు నీటితో కళకళలాడాల్సిందిపోయి వెలవెలబోతున్నాయి. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రాణవాయువులాంటి అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు పూర్తిగా ఖాళీఅయిపోయాయి.

అన్నమయ్య, పింఛా.. ఖాళీ..!
చుక్కనీరు లేక బోసిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు

రెండు ప్రాజెక్టులకింద 30వేల ఎకరాల ఆయకట్టు నీరు ఏటిపాలు

నాలుగు మండలాల ప్రజలకు తాగునీటికి తిప్పలు 

రాజంపేట, నవంబరు28 : వరుణుని ఉగ్రరూపం ఒకవైపు, పాలకులు అధికారుల నిర్లక్ష్యం మరోవైపు.. వెరసి రెండు ప్రాజెక్టులు నీటితో కళకళలాడాల్సిందిపోయి వెలవెలబోతున్నాయి. రాజంపేట నియోజకవర్గ ప్రజలకు ప్రాణవాయువులాంటి అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు పూర్తిగా ఖాళీఅయిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజీకి నీరు చేరిపోగా పింఛా ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిపోయింది. భారీగా వరద పోటెత్తడంతో సామర్థ్యం సరిపోక పింఛా డ్యామ్‌ మట్టికట్ట కోసుకుపోయి నీళ్లన్నీ వెళ్లిపోయాయి. అన్నమయ్యప్రాజెక్టులో గేటు పడకపోవడంతో ఇక్కడి నీళ్లన్నీ వృథాగా వెళ్లిపోయి ఈ ప్రాంత ప్రజలకు కన్నీళ్లు మిగిల్చాయి.. వివరాలిలా..

సుదీర్ఘపోరాటాల ఫలితంగా 1998వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అన్నమయ్య ప్రాజెక్టును రాజంపేట మండలం చెయ్యేరులో ఏర్పాటు చేశారు. ఖరీఫ్‌, రబీ సీజనలకు కలుపుకొని సుమారు 22,500ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం దీని ప్రధాన లక్ష్యం. ప్రాజెక్టు ఏర్పాటు చేసిన తరువాత ఆదిలోనే సాంకేతిక కారణాలున్నాయని, ప్రాజెక్టు పక్కనున్న కొండల్లో అగాధాలు ఉన్నాయన్న నెపంతో ఏడాదిపాటు పూర్తిస్థాయిలో నీటిని నింపలేకపోయారు. పరిశీలన పేరిట మరో నాలుగేళ్లు గడిపారు. 2003లో ఏకంగా గేటు తెగిపోయి నీరు ఏటిపాలైంది. తిరిగి ఏడాదికి గేటు అమర్చినా అప్పటి నుంచి పూర్తిస్థాయి నీటి మట్టం చేరలేదు. 2.23 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు కాలక్రమేణా తాగునీటి ప్రాజెక్టుగా మారిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ప్రాజెక్టుకు అనుసంధానంగా రూ.50కోట్లతో రాజంపేట పట్టణానికి బృహత్తర తాగునీటి పథకం, రూ.10కోట్లతో పుల్లంపేటకు తాగునీటి పథకం, సుండుపల్లె, వీరబల్లి మండలాలకు నీరందించడానికి మరో రూ.100కోట్లతో తాగునీటి పథకాలను ఏర్పాటు చేశారు. ఐదేళ్లుగా వర్షాలు కురవక ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరు నిలువలేదు. ప్రస్తుతం వర్షాల్లోనైనా నిండుతుందనుకుంటున్న సమయంలో 2003లో తెగిపోయిన గేటు తిరిగి శుక్రవారం పడకపోవడంతో నీళ్లన్నీ వృథాగా వెళ్లిపోయాయి.  

ఇదే క్రమంలో 1960 సంవత్సరంలో సుండుపల్లె మండలంలోని బాహుదానదిపై 0.32 టీఎంసీల సామర్థ్యంఓ పింఛా ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. 3,750ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. ఈ ప్రాజెక్టు ఆది నుంచి మరమ్మతులకు నోచుకుంటూనే ఉంది. రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్టు మట్టికట్ట దెబ్బతింటుందని సంబంధిత అధికారులు ఉన్నతాధికారులకు నివేదికలు పంపినా పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం కుడికాలువ మటికట్టకు గండి పడి ప్రాజెక్టులోని పూర్తినీరు ఏటిపాలైపోయింది. దీనివల్ల సుండుపల్లె, రాయచోటి ప్రాంతాలకు తీవ్ర సాగు, తాగునీటి సమస్య ఏర్పడనుంది.


అన్నమయ్య గేట్లను త్వరలో రిపేరు చేయిస్తాం

- ఓబీ సుబ్బనరసమ్మ, డీఈ, అన్నమయ్య డ్యాము

అన్నమయ్య డ్యాము గేట్లను వెంటనే రిపేరు చేయిస్తాం.. ఇందుకు సంబంధించి గతంలో గేటు ఏర్పాటు చేసిన స్వర్ణ కనస్ట్రక్షన్స కంపెనీ అధికారులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు. నిపుణులు తనిఖీలు నిర్వహించి సాంకేతిక సమస్యలు గుర్తించి వెంటనే రిపేరు చేయిస్తాం. ప్రధానంగా దెబ్బతిన్న 5వ నెంబరు గేటును రిపేరు చేయిస్తాం. మిగిలిన సాంకేతిక సమస్యలు పూర్తిచేయించి ప్రాజెక్టులో నీరు నింపడానికి ప్రయత్నిస్తాం.


నోర్ల్లుకొట్టుకొని నిరసన

గేటు పడకపోవడంతో నీళ్లన్నీ వృథాగా వెళ్లిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు వద్ద శనివారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్‌రాయులు నేతృత్వంలో టీడీపీ నేతలు నోర్లుకొట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ జగనమోహనరెడ్డి ప్రభుత్వం, రాజంపేట పాలకనేతల నిర్లక్ష్య వైఖరి వల్ల అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేకుండా పోయాయని వాపోయారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు కిలో గ్రీసు పూసివున్నా గేట్లు పడేవని అన్నారు. పింఛా ప్రాజెక్టులో గేట్లు లేవకపోవడం వల్ల ప్రాజెక్టు కుడికాలువ మట్టి కట్ట తెగిపోయి, అన్నమయ్య ప్రాజెక్టు వద్ద గేట్లు కిందకు దిగకపోవడం వల్ల ఉన్న నీరంతా ఖాళీ అయ్యిందన్నారు. దీనికి అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాలన్నారు. ఇకనైనా జగన ప్రభుత్వం స్పందించి ఈ రెండు ప్రాజెక్టులను వెంటనే మరమ్మతులు చేయించి వచ్చే తుఫాన్లలోనైనా నిండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి చెన్నూరు సుధాకర్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు సంజీవరావు, గుండ్లూరు జనార్ధనరెడ్డి, వెంకటేశ్వర్లనాయుడు, కొండా శ్రీనివాసులు, సమ్మెట శివప్రసాద్‌, శివరామరాజు, పసుపులేటి ప్రవీణ్‌, కొండ్రాతి గణపతి తదితరులు పాల్గొన్నారు.







Updated Date - 2020-11-28T05:30:00+05:30 IST