ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండానే బయల్దేరిన విమానం... చివరికి ఏమైందంటే...

ABN , First Publish Date - 2022-01-02T18:36:09+05:30 IST

విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరాలంటే ఎయిర్ ట్రాఫిక్

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లేకుండానే బయల్దేరిన విమానం... చివరికి ఏమైందంటే...

రాజ్‌కోట్ : విమానాశ్రయం నుంచి విమానం బయల్దేరాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అనుమతి తప్పనిసరి. అయితే డిసెంబరు చివరి వారంలో ఓ స్పైస్‌జెట్ విమానం గుజరాత్‌లోని రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఏటీసీ అనుమతి లేకుండానే బయల్దేరింది. ఈ సంఘటనపై దర్యాప్తునకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశించింది. ఈ దర్యాప్తు ముగిసే వరకు ఈ విమానం పైలట్లను డీ-రోస్టర్ చేసింది. 


రాజ్‌కోట్ విమానాశ్రయం డైరెక్టర్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబరు 30న స్పైస్‌జెట్ విమానం ఎస్‌జీ-3703 ఏటీసీ అనుమతి లేకుండానే రాజ్‌కోట్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరింది. ఏటీసీ అనుమతిని తప్పనిసరిగా తీసుకోవలసి ఉండగా, పైలట్లు ఈ నిబంధనను పాటించలేదు. దీనిపై సవివరమైన నివేదికను భారత విమానాశ్రయాల సంస్థ (ఏఏఐ) ప్రధాన కార్యాలయానికి, డీజీసీఏకి పంపించారు. ఈ విమానం బయల్దేరిన తర్వాత రాజ్‌కోట్ ఏటీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విమానం పైలట్లతో మాట్లాడారు. టేకాఫ్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా బయల్దేరారని అడిగారు. అందుకు పైలట్లు స్పందిస్తూ, పొరపాటు జరిగిందని, క్షమించాలని కోరారు. 


ఓ ప్రముఖ దిన పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విమానంలోని ఓ పైలట్ మాట్లాడుతూ, ఈ సంఘటనకు కారణాలేమిటో దర్యాప్తులో వెల్లడవుతాయని చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదన్నారు. 


Updated Date - 2022-01-02T18:36:09+05:30 IST