భూమి కోసం ఒక పాట

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

భుజం మీద బతుకు భేతాళుడు మనీపర్సు ఒక దండగ బరువు కార్డులన్నీ ఎగరేసినా..

భూమి కోసం ఒక పాట

నిన్నంతా ఒక్క యుద్ధ వార్త కూడా చదవలేదు

మంచం దిగలేదు.. ముసుగు తియ్యలేదు

నన్ను నేను చూసుకుంటూ గడిపాను

నేనిప్పుడు నగరాల స్మశానాల్లోంచి

పరుగుపెడుతున్న శవాన్ని-

మైనస్‌ వన్‌ టూ త్రీ ఫోర్‌ ఫైవ్‌..

గడ్డకట్టిన దేహాన్ని లాగుతున్న ఊపిరి శకటాన్ని-

పది.. ఇరవై.. నలభై.. అరవై

బుల్లెట్‌ వేగంతో మైలురాళ్ళు వెనక్కి..

యుద్ధక్షిపణిలా నేను ముందుకి-

భుజం మీద బతుకు భేతాళుడు-

మనీపర్సు ఒక దండగ బరువు

కార్డులన్నీ ఎగరేసినా

ఒక గూగుల్‌ మ్యాపు కొని తేలేవు-

నేను ‘ఫైన్‌’ నోటిఫికేషన్‌ లేదు

టేక్‌ ‘కేర్‌’ మెసేజ్‌ లేదు

ఊగిసలాడే జీవలేశాన్ని

కాసేపు ఊపే రింగ్‌ టోన్‌ లేదు

ఆగిపోయిన భూమిలా

మూగబోయిన సెల్‌ఫోన్‌-

ఎటు చూడు మంచు ఎడారి

ఎంత పెద్ద సమూహమైనా

అదంతా ఒక ఒంటరి బాటసారి-

తడబడినా.. పడినా.. ప్రాణాలు పోయినా

పలకరించే దిక్కు లేదు..

ఎటు పోవాలో దిక్కు తోచదు

నా చుట్టూ నేనే తిరుగుతున్నానా

నా డైరెక్షన్‌ రాంగో రైటో

చెప్పడానికి చంద్రుడూ లేడు..సూర్యుడూ లేదు

నో నెట్‌.. నో హట్‌.. నో హగ్‌..

ఓన్లీ ఫాగ్‌-

నిలువునా కప్పేసిన అతిచల్లని నల్లని చావుపొగ

యుద్ధానికైనా ఒక లక్ష్యం వుంది

నా నడకకే ఒక గమ్యం లేదు

శత్రుదేశాలకైనా ఒక బోర్డర్‌ వుంది

నా ప్రాణ ప్రయాణానికే

ఒక ఆర్డర్‌ లేదు.. ఒక బోర్డర్‌ లేదు

నిన్నంతా అరసెకను కూడా

యుద్ధం గురించి ఆలోచించ లేదు-

నేటివ్‌ రెసిడెంట్‌ని.. ఫారిన్‌ స్టూడెంట్‌ని

ఎల్డర్‌ని.. యంగర్‌ని.. అప్పుడే పుట్టినవాడిని..

ఇంకా పుట్టనివాడిని..

నన్ను నేనే పరిత్యజిస్తున్నాను

నన్ను నేనే బహిష్కరిస్తున్నాను

నా దేహానికి నేనే కాందిశీకుణ్ణి

వెళ్ళిపో.. బతికిపో.. పారిపో.. దూరంగా

నేలమీద కేవలం మనిషి నీడలే మొలిచే చోటుకి

ఆకాశంనుంచి కేవలం వెలుగునీళ్ళే కురిసేచోటుకి-

నిన్నంతా ఒక్క వార్‌ విజువల్‌ కూడా చూడలేదు

యుద్ధభూమిలో అమ్మ కోసం ఏడుస్తున్న

అనాథ శిశువుని-

బంకర్‌లో ముడతల ముడతల వృద్ధ పశువుని-

ధ్వంసమైన ఆసుపత్రిలో నొప్పులు పడుతున్న

నిండు గర్భిణీని-

బడిశిథిలాల్లో నెత్తుటి యూనిఫాంని-

నిన్నంతా ఒక్క యుద్ధ వార్త కూడా వినలేదు

మంచం దిగలేదు.. ముసుగు తియ్యలేదు

కూలిన యుద్ధ విమానాల శకలాల్లోంచి

చరిత్ర పాడుతున్న 

విషాద సంగీతం వింటున్నాను-

ఈ రోజు కూడా యుద్ధ వార్తలు

చూడను.. వినను.. చదవను.

అసలెప్పుడూ ఆ పని చేయను

యుద్ధ విరామ వీణకు దేహాన్ని తీగలా చుడతాను-

అతి భయంకర నియంతల కోరలు తీసే

అతి సామాన్య ప్రపంచ ప్రజా సమూహాల కోసం

శాంతి కాముకుల స్వప్నాస్థికలతో

ఒక పాట కడతాను.


ప్రసాదమూర్తి

84998 66699

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST