అష్ట దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకు తండ్రిపై కొడుకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-04-03T20:55:03+05:30 IST

నా శిక్ష అనుభవించాల్సిందేనని

అష్ట దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకు తండ్రిపై కొడుకు ఫిర్యాదు

న్యూఢిల్లీ : చట్టం ముందు అందరూ సమానులేనని, మన సొంత మనుషులే తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని ఓ వ్యక్తి తన చర్యల ద్వారా చాటి చెప్తున్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌ నివాసి అయిన 30 ఏళ్ళ వ్యక్తి ఏకంగా తన తండ్రిపైనే ఫిర్యాదు చేశారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం నిబంధనలను తన తండ్రి ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఉల్లంఘనదారుపై కేసు నమోదు చేశారు. 


ఢిల్లీ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల వ్యక్తి తన ఫిర్యాదులో తన తండ్రి (59) ప్రతి రోజూ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారని, అష్ట దిగ్బంధనం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. తాను పదే పదే కోరినప్పటికీ ఆయన పట్టించుకోకుండా, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారని తెలిపారు. 


ప్రపంచాన్ని కుదిపేస్తున్న నోవల్ కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించకుండా నిరోధించేందుకు ప్రభుత్వం 21 రోజులపాటు దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఒకరికొకరు దూరంగా ఉండాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 2,301కి చేరాయి. 156 మందికి నయమైంది, 56 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-04-03T20:55:03+05:30 IST