అవినీతి లేని సమాజంతోనే నిజమైన స్వాతంత్య్రం..

ABN , First Publish Date - 2022-08-11T05:52:10+05:30 IST

మా తండ్రి పెడబల్లె పెద్దయల్లారెడ్డి. ఆయన జీవించి ఉన్నంత వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగిరేది. ఆయన కూడా స్వాతంత్య్రం కోసం పోరాటం చేశాడు. జిల్లా

అవినీతి లేని సమాజంతోనే నిజమైన స్వాతంత్య్రం..
స్వాతంత్ర సమరయోధుడు పెడబల్ల్లె బాలయల్లారెడ్డి

స్వాతంత్య్ర సమరయోధుడు పెడబల్లె బాలయల్లారెడ్డి


ఆయన పేరు పెడబల్లె బాలయల్లారెడ్డి. 1921 జనవరి 13న జన్మించారు. 101 సంవత్సరాల వయసు పూర్తయ్యి 102 జరుగుతోంది. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా క్విట్‌ఇండియా ఉద్యమంలో పాల్గొని 3 నెలలు జైలుశిక్ష అనుభవించారు. అవినీతిలేని సమాజం ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని అంటున్నారు. దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో మిగిలిన ఏకైక స్వాతంత్య్రర సమరయోధుడి జ్ఞాపకాలు..

(చెన్నూరు)


నాన్న స్ఫూర్తితో..

మా తండ్రి పెడబల్లె పెద్దయల్లారెడ్డి. ఆయన జీవించి ఉన్నంత వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగిరేది. ఆయన కూడా స్వాతంత్య్రం కోసం పోరాటం చేశాడు. జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ గాంధీ ఆశయాలను, సూక్తులను, శాంతియుత పంథాలో స్వాతంత్య్ర సాధన కోసం ఇచ్చిన సందేశాలను ప్రచారం చేస్తూ వచ్చారు. వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొనడమే కాక ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు 3 నెలలు జైలుశిక్ష, రూ.100 జరిమానా విధించింది. వేలూరు జైలుకు తరలించారు. అనంతరం 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఈయనే నాకు మొదట స్ఫూర్తి.


రాజకీయ పాఠశాలలో..

నాడు జిల్లాలో 187 మంది స్వాతంత్ర సమరయోధులు ఉండే వారు. ఒక్క చెన్నూరు మండలంలోనే 12 మంది ఉండగా ప్రస్తుతం నేను ఒక్కడినే మిగిలాను. పాత కడపకు చెందిన స్వాతంత్య్ర పోరాట సభ్యుడు కె.రంగారెడ్డి 1941లో చెన్నూరులో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేశారు. చెన్నూరు గ్రామ పొలిమేరల్లోని వనంలో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో యువకులు పెద్ద సంఖ్యలో చేరారు. ఇందులో నేను కూడా ఒకడిని. ఎన్జీరంగా శిష్యులైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి(చిత్తూరు), రాచకొండ నరసింహారెడ్డి(మదనపల్లె), సిరిగిరెడ్డి బాలిరెడ్డి(లెక్చరర్‌ మార్కాపురం) లాంటి సమరయోధులంతా మాకు నెలరోజులపాటు డెమోక్రసీ, సోషలిజం, కమ్యూనిజం గురించి చెప్పేవారు.

1935లో గాజులపల్లె వీరభద్రరావు అనే సమరయోధుడు ప్రతి ఆదివారం చెన్నూరుకు వచ్చి గాంధీయిజం గురించి బోధించేవారు. ఉమ్మడి రాష్ట్రాలు (తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ)లో ఆంధ్ర మహాసభలు జరిగినప్పుడు 1942లో టంగుటూరి ప్రకాశంపంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య క్విట్‌ ఇండియా ఉద్యమం గురించి ఎంతో బోధించారు. వారి మాటలకు మేమంతా ఉత్తేజితులమై వారి వెంట వెళ్లాము.


క్విట్‌ ఇండియా ఉద్యమంలో 3 నెలల జైలు

1941లో చెన్నూరు, కొండపేట మధ్య ఉన్న కాజ్‌వేను ధ్వంసం చేశాం. కె.సుబ్బయ్య, సాధువెంకటస్వామి, శేషారెడ్డి, నంద్యాల గురుస్వామి, మోటు గంగన్న, సగలి కొండారెడ్డి, వాసుదేవరెడ్డి, గోసుల సంటెన్న, వెంకటరెడ్డి, బి.వెంకటసుబ్బారెడ్డి, బి.తిమ్మారెడ్డి, గోదిన అనంతపురి, బుడ్డారెడ్డిగారి శేషారెడ్డి, జి.నారాయణలతో కలిసి కాజ్‌వేను పగుల కొట్టాం. ఫలితంగా మమ్మలందరినీ కడప సబ్‌జైలులో మూడు నెలలు ఉంచారు. దీనికి సంబంధించి ఇద్దరు గ్రామ నౌకర్లు మా మీద, దేశం మీద ఉన్న గౌరవంతో తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో మమ్మలందరినీ జైలు నుంచి విడుదల చేశారు. వారిద్దరినీ మాత్రం బళ్లారి జైలులో పెట్టారు. జైలు నుంచి వచ్చాక చెన్నూరు తాలుకా పరిధిలో ఎక్కడ ఉద్యమం జరిగినా వెళ్లి పాల్గొనేవాడిని.


కూతురికి గాంధీ భార్య పేరు

నాకు 1943 మే 29న మోడమీదపల్లెకు చెందిన లీలావతమ్మతో వివాహమైంది. మాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు సంతానం. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర ప్రకటన విడుదలైంది. అదే రోజు లీలావతమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్వాతంత్య్రం రోజున జన్మించడం, గాంధీజీ పట్ల అపార గౌరవం ఉండడంతో పుట్టిన బిడ్డకు గాంధి భార్య కస్తూర్బా పేరును (కస్తూరిదేవిగా) పెట్టుకున్నాం. స్వాతంత్య్ర ప్రకటన వెలువడడంతో కె.రంగారెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరులో గుర్రాలపై మేమంతా భారత జెండాతో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించాం.


యువత నీతి నిజాయితీతో ఉండాలి

ఆనాటి ఆకలి కేకలు, బ్రిటీష్‌వారి పైశాచిక చేష్టలతో ఎంతోమంది చంటి బిడ్డలు, వృద్ధులు ప్రాణాలు వదిలారు. అవి తలుచుకుంటే నేటికీ మనసు తీవ్ర ఆవేదనకు లోనవుతుంది. ఇప్పుడున్న యువత స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలు, అడుగు జాడలు మరువకుండా నీతి నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, పెద్దలపట్ల గౌరవంతో నడుచుకోవాలి. నేటి యువత సమాజానికి మార్గ నిర్దేశకులుగా ఉండాలి తప్ప హత్యలు, రాజకీయాలు, ప్రజలను మోసగించడం, గూండాయిజం, దోపిడీలు, దౌర్జన్యాలు, కబ్జాలు వంటి వాటి జోలికి పోకుండా ఆదర్శంగా నిలవాలి. అలాగే పాలకులు సైతం సమాజంలో అవినీతికి అవకాశం లేకుండా చూడాలి. సమాజాన్ని పట్టి పీడించే అతి చెడ్డమార్గం అవినీతి. మా బిడ్డలను అవినీతికి ఎలాంటి అవకాశం ఇవ్వని పద్ధతిలో పెంచాను. సమాజం కూడా అలాగే నడుచుకోవాలన్నది నా కోరిక.



Updated Date - 2022-08-11T05:52:10+05:30 IST