శ్రీనగర్ : కశ్మీరు వేర్పాటువాది ఫరూఖ్ అహ్మద్ దార్ వురపు బిట్టా కరాటేపై నమోదైన కేసుల యథాతథ పరిస్థితిని తెలియజేయాలని ఓ కశ్మీరీ పండిట్ కుటుంబం శ్రీనగర్ కోర్టును కోరింది. కశ్మీరులో పండిట్లపై జరిగిన హింసాకాండలో దారుణంగా హత్యకు గురైన సతీశ్ టిక్కూ కుటుంబం ఈ పిటిషన్ను దాఖలు చేసింది.
బిట్టా కరాటే 1991లో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను డజన్లకొద్దీ పండిట్లను చంపానని చెప్పాడు. సతీశ్ టిక్కూను కూడా హత్య చేసినట్లు తెలిపాడు. ఆ తర్వాత మరొక సందర్భంలో బిట్టా మాట్లాడుతూ, తాను ఎవరినీ చంపలేదని, తనను నిర్బంధించి, ఆ విధంగా చెప్పించారని ఆరోపించాడు.
టిక్కూ కుటుంబం తరపున న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ ఈ క్రిమినల్ అప్లికేషన్ను శ్రీనగర్ కోర్టులో దాఖలు చేశారు. ఉత్సవ్ మీడియాతో బుధవారం మాట్లాడుతూ, తమ పిటిషన్పై కోర్టు తొలిసారి విచారణ జరిపిందని తెలిపారు. కోర్టు తమ వాదనలను సకారాత్మకంగా విన్నట్లు తెలిపారు. 31 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని జమ్మూ-కశ్మీరు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసిందని చెప్పారు. బిట్టా కరాటేపై ఎందుకు చార్జిషీటును దాఖలు చేయలేదని ప్రశ్నించిందన్నారు. నరమేధంలో హతుడైన సతీశ్ కుమార్ టిక్కూ కుటుంబానికి ఇది ఆశాజనకమైన విచారణ అని చెప్పారు.
కరాటేను 1990 జూన్లో అరెస్టు చేశారు. 2006లో ఇండెఫినిట్ బెయిలుపై విడుదల చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్నారనే ఆరోపణలపై 2019లో అతనిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఇదిలావుండగా, కశ్మీరీ పండిట్లను చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసిన కేసులను తిరిగి విచారించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి