గుండెపగిలిన గుడ్డంపల్లి

ABN , First Publish Date - 2022-07-01T07:09:46+05:30 IST

చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు.

గుండెపగిలిన గుడ్డంపల్లి

తెగిపడిన మృత్యువు


చుక్క పొడిచేవేళ కుమారి నిద్ర మేల్కొంది. తనది చిన్న రైతు కుటుంబం. భర్త మెకానిక్‌.  ఇద్దరు ముద్దులొలికే పసి బిడ్డలు. తను పొలం పనులు చూసుకునేది. బోరు బావి కింద సాగుచేసిన వేరుశనగ పొలంలో కలుపు తీసేందుకు గుడ్డంపల్లిలో కూలీలను మాట్లాడింది. వంట పని ముగించి, తెలతెలవారుతుండగా తన ఊరు పెద్దకోట్ల నుంచి గుడ్డంపల్లికి ఆటోలో బయలుదేరింది. ఆ ఊరికి చేరగానే.. ‘రాండమ్మో.. పొద్దెక్కుతాంది..’ అని అందరినీ పిలిచింది. తనతో కలిసి మొత్తం 12 మంది మహిళలు ఆటోలో సర్దుకున్నారు. చల్లటి గాలిలో పొలం వైపు ఆటో రయ్యిన దూసుకు వెళుతోంది. ‘ఇంకో రెండు నిమిషాలు ఉంటే పొలంలో దిగుతాం’ అనుకున్నారు. అప్పటికే విద్యుత స్తంభాలపై మోహరించిన కింకరులు.. విద్యుత తీగ రూపంలో మృత్యు పాశాన్ని విసిరారు. శ్రమ జీవుల శరీరాలు భగ్గున అంటుకున్నాయి. ఐదుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. ఆటో నుంచి దూకేసి.. ఆ విద్యుద్ఘాతపు విపత్తు నుంచి ఎనిమిది మంది బయట పడ్డారు. కళ్లెదుట తమ ఆప్తుల దేహాలు దగ్ధమౌతుంటే.. నిశ్చేష్టులై, నిస్సహాయులై చూస్తూ ఉండిపోయారు.    


ఒకేచోట ఐదుగురు మహిళలకు అంత్యక్రియలు 

ఊరంతా శ్మశానం దగ్గరే మృతులంతా కూలీలు, గొర్రెల కాపరులు


ధర్మవరం రూరల్‌ : ఎవరిని కదిలించినా కన్నీరే. ఎవరి నోట విన్నా అయ్యో! ఎంత ఘోరం జరిగిందనే ఆవేదనే. విద్యుత ప్రమాదంలో తమ గ్రామానికి చెందిన నలుగురు మహిళా కూలీలు సజీవ దహనం కావడంతో తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామం కన్నీటి సంద్రమైంది. ఊరికి తెచ్చిన మృతదేహాలను చూసి బోరున రోదించింది. గ్రామస్థులంతా కలిసి మృతులు నలుగురికి గ్రామ శ్మశానవాటికలో ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించారు. ఎవరైనా చనిపోతే వారి బంధువులు మాత్రమే దహనసంస్కారాలకు హాజరవుతారు. కానీ గ్రామానికి చెందిన నలుగురు మహిళలకు ఒకేచోట దహన సంస్కారాలు జరుగుతుండటంతో ఊరు ఊరంతా అక్కడికి చేరింది. శోకతప్త హృదయంతో వారికి కడసారి వీడ్కోలు పలికింది.  పెద్దకోట్ల గ్రామానికి చెందిన  కుమారికి కూడా అదే శ్మశాన వాటికలో మిగతావారితోపాటు అంత్యక్రియలు నిర్వహించారు.


మృతులంతా కూలీలు.. గొర్రెల కాపరులు

తాడిమర్రి: చిల్లకొండయ్యపల్లి వద్ద విద్యుత ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు. ఉన్న కాస్త భూమిని సాగు చేసుకుంటూ మిగిలిన సమయాల్లో కూలి పనులకు వెళ్లి పొట్టపోసుకుంటున్నవారే. ఇంటి యజమానికి చేదోడుగా ఉంటున్న మహిళలు చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.   పిల్లల ఆలన పాలన చూసే మహిళలు మృత్యుఒడికి చేరడంతో ఆ ఐదు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. 


ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ

- విద్యుత ప్రమాదంలో  మృతి చెందిన కొంకా రామలక్ష్మికి భర్త మల్లికార్జున,  కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త మల్లికార్జున ఇటీవల  గుండెపోటుకు గురై శస్త్ర చికిత్సలు చేయించుకుని మంచానపడ్డాడు. అయన పూర్తిగా కోలుకునేలోపు రామలక్ష్మి మృత్యువాత పడింది. వీరి పిల్లల ఆలనా పాలన చూసుకునేవారు కరువయ్యారు.

- కొంకారత్నమ్మకు భర్త కిష్టయ్యతో పాటు ఆరోగ్యం సరిగా లేని ఇద్దరు కుమారులున్నారు. కిష్టయ్య పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో  అప్పుడప్పుడు గొర్రెల కాపరిగా కూలి పనులకు వెళ్లివచ్చేవాడు. రత్నమ్మ కూలిపనులకు పోతూ ఇంకో వైపు ఆరోగ్యం సరిగాలేని ఒకకుమారుడు మధు, మతిస్థిమితం లేని మరో కుమారుడు మదనమోహనల ఆలనపాలన చూసేదే. అన్ని తానై కుటుంబాన్ని చూసుకునే ఈమె మృత చెందడంతో ఆ తండ్రి, బిడ్డల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 

- లక్ష్మదేవికి భర్త ఈశ్వరయ్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తెకు వివాహం కాగా, మరో కుమార్తెకు వివాహం చేయాల్సి ఉంది. కుమారుడు  డిగ్రీ చదువుతూ తండ్రికి తోడుగా  అప్పుడప్పుడుగొర్రెల కాపరిగా వెళ్లాడు.

- మల్లయ్య భార్య కొంకా కాంతమ్మ. ఈమెకు భర్తతో పాటు ఇద్దరు కుమారులున్నారు.. భార్యభర్తలు ఇద్దరు కష్టపడి కుమారులిద్దరిని ఉన్నతచదువులు చదివించారు. పెద్ద కుమారుడు సచివాలయంలో ఉద్యోగం సాధించగా చిన్నకుమారుడు బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 

- ప్రమాదంలో మృతిచెందిన కుమారికి భర్త రాజా,  కుమారుడు(6), కుమార్తె(4) పిల్లలు ఉన్నారు. ఈమె భర్త రాజా మెకానిక్‌ వృత్తిని కొనసాగిస్తున్నారు. సొంత ఊళ్లో ఉన్న వ్యవసాయ పొలంలో పనులు చేయించడం కోసం కూలీలతో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. లోకం పోకడ తెలియని ఆ చిన్నారులు తల్లి లేని సమాజంలో ఎలా బతుకుతారోనంటూ పలువురు ఆవేదనతో కన్నీటి పర్యంతమయ్యారు. 



బాధితులకు న్యాయం చేయాలని పరిటాల శ్రీరామ్‌ ధర్నా  

తాడిమర్రి: మండలంలోని చిల్లకొండయ్యపల్లి వద్ద జరిగిన విద్యుత ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.50లక్షలు పరిహారం, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలంటూ టీడీపీ ధర్మవరం నియోజకవర్గం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ ధర్నా చేశారు. తాడిమర్రిలోని మరువపల్లి దారి, విద్యుత కార్యాలయం ఎదుట బాధితుల బంధువులు, టీడీపీ, కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఆందోళన నిర్వహించారు.  నాసిరకం తీగలు వాడటం వల్లే ప్రమాదం జరిగిందని, దీనికి ప్రభుత్వం, విద్యుతశాఖ పూర్తిగా బాధ్యత వహించాలన్నా రు. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించి కుర్చున్నారు. ధర్మవరం ఆర్డీఓ వరప్రసాదరావు ధర్నా వద్దకు చేరుకుని మీ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో  పరిటాల శ్రీరామ్‌ ధర్నా విరమించారు. అంతుకు మునుపు బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ మండల కన్వీనర్‌ కూచిరాము, శేఖర్‌, ఎల్‌ నరేంద్రచౌదరి,  కమ్యూనిస్టు నాయకులు జంగాలపల్లిపెద్దన్న, పోలా రామాంజినేయులు, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.


బాధితులకు అండగా ఉంటాం: గోనుగుంట్ల సూర్యనారాయణ

విద్యుత ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన గుడ్డంపల్లి వాసులకు అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అన్నారు.  ఆయన గురువారం గుడ్డంపల్లి గ్రామానికి చేరుకుని మృతిచెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈయన వెంట నాయకులు మంజునాథ్‌, వెంకటేశ,  కొంకానాగార్జున, శేషాధ్రి, అశ్వర్థనారాయణ తదితరులు పాల్గొన్నారు.


నా కూతురు బాగోగులు ఎవరు చూస్తారయ్యా ..

సాయంత్రం వస్తాను. ఇంటి వద్ద ఉండి పనులు చేసుకో అని చెబితివే. అంతలోనే శవమైపోయావా? అంటూ  భార్యను పోగొట్టుకున్న ఈశ్వరయ్య గుండెలు పగిలేలా రోదించాడు. ఒక అమ్మాయికి నా భార్య తోడ్పాటుతో పెళ్లి చేశా. ఇంకో బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్న సమయంలో  ఈ ఘోరం జరిగితే మా గతి  ఏమైపోతుంది. మేమెట్లా బతికేది అంటూ బంధువులను పట్టుకుని రోదించాడు. 

- ఈశ్వరయ్య, 

మృతురాలు లక్ష్మిదేవి భర్త


ఇనచార్జ్‌ మంత్రి గుమ్మనూరు జయరాం దిగ్ర్భాంతి

పుట్టపర్తి రూరల్‌: విద్యుత ప్రమాదంలో ఐదుగురు మహిళలు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరమని జిల్లా ఇనచార్జ్‌ మంత్రి గుమ్మనూరు జయరాం గురువారం  ఓప్రకటనలో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తుందని మంత్రి  తెలిపారు. 






కళ్ల ముందే కాలిపోయారు

రమాదేవి

తాడిమర్రి: అందరం ఆటోలో కూలిపనులకు వెళ్తున్నాం. తోటలోకి మరో పది నిమిషాల్లో చేరుకుంటాం అనుకుంటుండగా ఆటోకు కరెంటు షాక్‌ కొట్టింది. వెనుక ఉన్న వారికి మంటలు అంటుకున్నాయి. మధ్యలో కుర్చున్న మేము బయటకు దూకాం. డ్రైవర్‌ పోతలయ్య కూడా ఆటోను స్పీడుగా నడపాలని చూసి కుదరకపోవడంతో కిందకు దిగి ఆటోలో వారిని టవల్‌తో పట్టి బయటకు లాగాడు. పూర్తిగా ఆటోను లాగేయాలని  ప్రయత్నించిన ఆయనకు కూడా షాక్‌ తగిలింది. దీంతో అందరం ఆటోను వదిలిపెట్టి పక్కకు వచ్చాం. 

- ప్రమాదం నుంచి బయటపడిన కూలీ

Updated Date - 2022-07-01T07:09:46+05:30 IST