రోజంతామొరాయించిన సర్వర్‌

ABN , First Publish Date - 2022-08-17T06:17:00+05:30 IST

బడికి వెళ్లిన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం మానేసి స్మార్ట్‌ ఫోన్లను చూస్తూ గడిపేశారు. ఏమిటీ నిర్లక్ష్యం..? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు..? అని అనుకోకండి.

రోజంతామొరాయించిన సర్వర్‌
పెనకచెర్ల డ్యాం స్కూల్‌లో ఫోన్లతో టీచర్ల కుస్తీ

యాప్‌.. ఫ్లాప్‌

ముఖ హాజరు కోసం టీచర్ల తంటాలు

తొలిరోజు 13.87 శాతం మందికే హాజరు

బడికి వెళ్లిన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడం మానేసి స్మార్ట్‌ ఫోన్లను చూస్తూ గడిపేశారు. ఏమిటీ నిర్లక్ష్యం..? విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నట్లు..? అని అనుకోకండి. ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు కారణం. పాఠశాల ఆవరణలోకి వెళ్లి.. ఉదయం 9 గంటల్లో తమ స్మార్ట్‌ ఫోన్లను ఆనచేసి,  సిమ్స్‌-ఏపీ యాప్‌లో సెల్ఫీ దిగి.. అప్‌లోడ్‌ చేయాలని, అలా చేస్తేనే బడికి గురువులు హాజరైనట్లు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటికే రకరకాల యాప్‌లతో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు.. హాజరు విషయంలోనూ తంటాలు పడాల్సి వస్తోంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుని, చాలామంది ఉదయం 8 గంటలకల్లా పాఠశాలలకు చేరుకున్నారు. కానీ సర్వర్‌ పనిచేయలేదు. దీంతో ముఖ హాజరు వేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో ప్రయత్నించిన కొందరికి మాత్రమే అటెండెన్స్‌ నమోదైంది. ఆ తర్వాత వేలాది మంది టీచర్లకు చెమటలు పట్టించింది. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల వరకూ ప్రయత్నిస్తూనే ఉండిపోయారు. ఆ తరువాత  10.30 గంటల సమయంలో ప్రయత్నించారు. చివరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకూ.. గుర్తుకు వచ్చినప్పుడల్లా బయోమెట్రిక్‌ తంటాలు పడుతూ కనిపించారు. 

అనంతపురం విద్య



బోధనపై ధ్యాసేదీ..?

బడికి వెళ్లేముందు ఉపాధ్యాయుల మదదిలో ‘ఈ రోజు ఏ పాఠం చెప్పాలి..? ఏ పరీక్ష పెట్టాలి..? ఏ ప్రశ్నలు అడగాలి..?’ అనే ఆలోచనలు రావాలి. కానీ యాప్‌ల గోల కారణంగా బోధన గురించి ఆలోచించే పరిస్థితే కనిపించడం లేదు. ఉదయం  నుంచి సాయంత్రం వరకూ వాటితోనే సరిపోతోందని ఉపాధ్యాయులు వాపోతున్నా రు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులందరి చేతుల్లోనూ మంగళవారం మొబైల్‌ఫోనలు కనిపించాయి. అందరూ వాటిని చూస్తూ చికాకుగా గడిపేశారు. ఏ టీచర్‌ని కదిలించినా, యాప్‌ పనిచేయడం లేదు.. సర్వర్‌ సతాయిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్‌లో జీపీఎస్‌ ఆన్‌ చేసి, ఫొటో క్యాప్చర్‌ చేసేందుకు ప్రయత్నిస్తే.. ఫెయిల్‌ అని, ట్రై అగెయిన్‌ అని రిప్లే వస్తోంది. మధ్యాహ్నం దాకా ప్రయత్నించిన పలువురు ఉపాధ్యాయులు, ఆ తరువాత వదిలేశారు. జిల్లా వ్యాప్తంగా 8,852 మంది టీచర్లకు గాను 3,517 మంది యాప్‌లో రిజిస్టర్డ్‌ చేసుకున్నారు. వీరిలో కేవలం 1,228 మంది తొలిరోజు అటెండెన్స్‌ వేసుకోగలిగారు. మొత్తం ఉపాధ్యాయులలో 39.73 శాతం మంది రిజిస్టర్‌ చేసుకోగా, 13.87 శాతం మంది హాజరు వేశారు. ప్రభుత్వం డివైజ్‌లు ఇవ్వకుండా, టీచర్ల సొంత సెల్‌ఫోన్లలోనే ముఖ హాజరు వేయాలనడం ఏమిటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా, సర్వర్‌ సామర్థ్యం పెంచకుండా, ఉన్నఫలంగా ఉదయం 9 గంటల్లోపు హాజరు వేయాలని ఆంక్షలు పెట్టడం పట్ల ఉపాధ్యాయలోకం మండిపడుతోంది.


మనోవేదనే..

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ హాజరు వేయడానికైనా టీచర్లు సిద్ధంగా ఉన్నారు. కానీ గతంలో బయోమెట్రిక్‌, ఐరిష్‌ హాజరు వేసేందుకు సర్వర్‌ ప్రాబ్లంతో అనేక ఇబ్బందులు పడ్డారు. చాలా గ్రామాల్లో నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్నాయి. నిమిషం ఆలస్యమైనా సీఎల్‌  కింద ఉండాల్సిందేన్న ఉత్తర్వులు టీచర్లను మనోవేదనకు గురిచేస్తున్నాయి. క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించి, నిబంధనలు సులభతరం చేయాల్సిన అవసరం ఉంది.

- బండారు శంకర్‌, జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి, ఎంఈఎఫ్‌ 


పరికరాలను ప్రభుత్వం అందించాలి..

జిల్లాలో ఇంటర్నెట్‌ సదుపాయం లేని పాఠశాలలను గుర్తించాలి. అలాంటి చోట ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాలి. ఫేస్‌ బయోమెట్రిక్‌ వేసేందుకు చాలా మంది టీచర్ల సెల్‌ఫోన్లలో సదుపాయం ఉండకపోవచ్చు. ప్రభుత్వమే పరికరాలు అందించాలి. 

- సత్యప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు


పరిష్కారం అవుతాయి..

ఉపాధ్యాయులు సకాలంలో స్కూళ్ల కు వెళ్లాల్సిందే. విధుల్లో మరింత ఖచ్చిత్వం కోసమే యాప్‌ను తీసుకొచ్చారు. సెలవుల కారణంగా తక్కువ మంది యాప్‌లో రిజిస్టర్‌ చేసుకున్నారు. సాంకేతిక సమస్యలను విజయవాడలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్యలు పరిష్కారమవుతాయి.  

  - శామ్యూల్‌, డీఈఓ



Updated Date - 2022-08-17T06:17:00+05:30 IST