మనసు మర్మాలు విప్పిన విజ్ఞాని

ABN , First Publish Date - 2022-05-13T06:00:29+05:30 IST

హైద్రాబాద్ వచ్చిన కొత్తలో 1986లో సండే ఫుట్‌పాత్ బుక్‌స్టాల్స్‌లో అప్పటికి నాలుగైదేళ్ళ క్రితం ఆగిపోయిన మనోవిజ్ఞాన మాస పత్రిక ‘రేపు’ పాత సంచికలు సేకరించాను...

మనసు మర్మాలు విప్పిన విజ్ఞాని

హైద్రాబాద్ వచ్చిన కొత్తలో 1986లో సండే ఫుట్‌పాత్ బుక్‌స్టాల్స్‌లో అప్పటికి నాలుగైదేళ్ళ క్రితం ఆగిపోయిన మనోవిజ్ఞాన మాస పత్రిక ‘రేపు’ (ఆ విషయమ్మీద అదే దేశంలోకెల్లా తొలి పత్రిక అనుకుంటున్నాను) పాత సంచికలు సేకరించాను. ఓ ఇరవై ముప్పై ఆదివారాలు అదేపనిగా తిరిగి, ప్రారంభ సంచిక నుండి ముగింపు సంచిక వరకు ఏవో రెండు మూడు మినహా సేకరించి, చాలాకాలం వాటిని కాపాడాను. ఓ నాలుగైదేళ్ళ క్రితం ఆగిపోయిన మాస పత్రిక పాత సంచికలు అమ్ముడౌతున్నవంటేనే, ఆ పత్రిక ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. నా పదహారేళ్ళ ప్రాయం 1977లో ప్రారంభమైనదనుకుంటున్నాను. రేపు పత్రిక – 81దాక వచ్చిన జ్ఞాపకం.


న్యూ పర్స్పెక్టివ్స్ బేనర్‌పై హరిజన్ అనే ఓ న్యూవేవ్ సినిమాతీసే ప్రయత్నం కూడా చేసారు నరసింహారావు గారు. ఆ పత్రికల్లో వచ్చిన ఆర్టికల్సే అనేక పుస్తకాలుగా ప్రచురించారు.  ఏ విషయమ్మీదైన సమగ్రంగా ఎడిటోరీల్ రాయగల వాళ్ళలో కమెండో నాగరాజు, రేపు నరసింహారావులు అగ్రగణ్యులు అని ఎన్‌కౌటర్ దశరథరాం రాసాడు ఓ చోట.


‘వ్యకిత్వ వికాసం’ అనే మాటని సృష్టించినది నరసింహారావే. ఆ రకమైన సాహిత్యం తెలుగులో వారి ద్వారానే వెలుగులోకొచ్చింది. ఆ రంగంలో వారి సాహిత్యమే ప్రామాణికం. సవ్యమైన ఆలోచనా ధోరణికి – విశ్లేషణకి పెట్టింది పేరు రేపు నరసింహారావు. విల్‌ డురాంట్ – 'The Lessons of History' అనే అపురూప గ్రంథానికి ‘మానవ చరిత్ర మనకు నేర్పే గుణపాఠలేమిటి?’ అనే పేరున సంక్షిప్తీకరించి ప్రచురించారు నరసింహారావు. మానవ స్వభావం, ప్రవర్తన గురించి, మానవ భవిష్యత్తు విషయమై చరిత్ర ఏమి చెపుతుంది? తెలుసుకోవాలనుకున్న జిజ్ఞాస గలవారికి అద్భుత పరిచయం ఆ పుస్తకం. 1992లో ‘కలం గళం’ పేరున స్వాతి వారపత్రికలో అనేక సామాజికాంశాలపైన ఆయన వ్యాసాలు రాశారు. అవి ఎక్కడా పుస్తక రూపంలో రాలేదు. ఓ ఏణ్ణర్ధం క్రితం ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే ‘రమేషు గారూ మీకింకా గుర్తున్నాయ అవి’ అని ఆశ్చర్యపడ్డారు.


‘ప్రజాసేవకు నిజమైన అర్థం చెప్పిన మహోన్నత వ్యక్తి పాటూరి రాజగోపాల నాయుడు గారు’ అన్న శీర్షికన గొప్ప స్మృతి వ్యాసం రాశారు నరసింహారావు. ఆ వ్యాసాన్నే ‘రాజన్న’ పేరున పుస్తకంగా ముద్రించడమైనది. నరసింహారావు ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోవడం అందరికీ తీరని వేదన! వారు మనకు కనుమరుగైనా, వారి రచనలు, ఆలోచనా ధోరణి, విశ్లేషణా తీరు మన కళ్ళముందే ఉంటుంది.

గొర్రెపాటి రమేష్ చంద్రబాబు

పబ్లిషర్‌

Read more