దళిత విద్యార్థులకు ప్రత్యేక క్యూ పెట్టిన ప్రిన్సిపాల్

ABN , First Publish Date - 2021-10-01T22:56:50+05:30 IST

పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో దళిత విద్యార్థులను ప్రత్యేక

దళిత విద్యార్థులకు ప్రత్యేక క్యూ పెట్టిన ప్రిన్సిపాల్

లక్నో : పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో దళిత విద్యార్థులను ప్రత్యేక వరుసలో నిల్చోబెట్టిన ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీ జిల్లా, వాన్‌పూర్వ గడేరీ గ్రామ పంచాయతీలోని ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ సంఘటనపై కేసు నమోదైంది. 


ఓ విద్యార్థి తండ్రి నారాయణ్ మాట్లాడుతూ, ప్రిన్సిపాల్ కుసుమ్ సోనీ విద్యార్థులను కొట్టారని ఆరోపించారు. భోజన సమయంలో అగ్ర వర్ణాలు, షెడ్యూల్డు కులాల విద్యార్థులకు వేర్వేరు క్యూలను పెట్టారన్నారు. తాను దళితుడినని చెప్పారు. 


ఇదిలావుండగా, ప్రిన్సిపాల్ కుసుమ్ సోనీ ఆ గ్రామ పెద్ద వినయ్ కుమార్ జైశ్వాల్‌పై ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రాంగణంలో జైశ్వాల్ అల్లరి సృష్టించారని ఆరోపించారు. పాఠశాల తలుపులకు తాళాలు వేశారని పేర్కొన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కుసుమ్ తోసిపుచ్చారు. 


తాను అందరినీ సమానంగా చూస్తానని కుసుమ్ మీడియాకు చెప్పారు. విద్యార్థులంతా కలిసి మెలిసి కూర్చుంటారని చెప్పారు. గ్రామ పెద్ద జైశ్వాల్ ప్రతినిధినని చెప్పుకుంటూ పవన్ దూబే వచ్చారని, పాఠశాలలోని వద్యార్థులను బయటికి పంపించేసి, తలుపులకు తాళాలు వేశారని చెప్పారు. పాఠశాల ఫొటోలు తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారన్నారు. తాను దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. 


వినయ్ కుమార్ జైశ్వాల్ మాట్లాడుతూ, కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. భోజనం సమయంలో కుల వివక్ష చూపిస్తున్నారని చెప్పారన్నారు. తాను పాఠశాలకు వెళ్ళినపుడు కుసుమ్ లేరని చెప్పారు. కుసుమ్ సకాలంలో పాఠశాలకు రావడం లేదని తనకు విద్యార్థులు చెప్పారన్నారు. 


కుసుమ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం కేసు నమోదైంది. కుసుమ్‌ను సస్పెండ్ చేశారు.

Updated Date - 2021-10-01T22:56:50+05:30 IST