నిర్లక్ష్యంపై వేటు

ABN , First Publish Date - 2020-07-06T10:40:56+05:30 IST

పల్లెల్లో ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకు నడిపించడంలో అఽధికారులతోపాటు పాలకవర్గాల పాత్ర కీలకంగా మారింది

నిర్లక్ష్యంపై వేటు

పల్లె ప్రగతి, హరితహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

విధుల్లో అలసత్వం వహించిన వారిపై చర్యలు 

123 మంది సర్పంచులు, అధికారులకు షోకాజ్‌ నోటీసులు 

ఒక సర్పంచ్‌, 8 మంది సిబ్బంది సస్పెన్షన్‌

కొత్త పంచాయతీరాజ్‌ చట్టంతో కలెక్టర్‌కే విశేషాధికారాలు 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

పల్లెల్లో ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా ముందుకు నడిపించడంలో అధికారులతోపాటు పాలకవర్గాల పాత్ర కీలకంగా మారింది. ఇదే క్రమంలో పల్లెల్లో నూతన ఒరవడికి కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం 2018ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సర్పంచులకు అధికారాలు ఇస్తూనే విశేషాధికారాలు కలెక్టర్‌కు అప్పగించింది.  అభివృద్ధి పనులు, ప్రభుత్వ మార్గదర్శకాలపై  పల్లెల్లోని పాలకవర్గాలు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్‌ సంజాయిషీ కోరుతున్నారు. సంతృప్తి కరంగా లేని పక్షంలో సస్పెండ్‌ చేస్తున్నారు.


దీంతో  పంచాయతీ పాలకవర్గాలతోపాటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమాలతోపాటు డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటికలు, కంపోస్ట్‌ యార్డులు వంటి పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు మొదలయ్యాయి.  కలెక్టర్‌, అధికారులు క్షేత్ర స్థాయిలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. దిశానిర్దేశం చేయడంతోపాటు నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.  దీంతో గ్రామ కార్యదర్శులు, ఇతర సిబ్బంది భయపడుతున్నారు.


జిల్లాలో 123 మంది సర్పంచులు, అధికారులకు నోటీసులు 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 పంచాయతీలు ఉన్నాయి. డీపీవోతో పాటు 12 మంది మండల పంచాయతీ అధికారులు 66మంది కార్యదర్శులు, 171 మంది జూనియర్‌ కార్యదర్శులు పనిచేస్తున్నారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఇతర శాఖల సిబ్బందిపై కూడా చర్యలు ఉండగా ముఖ్యంగా పంచాయతీ శాఖ పరిధిలోనే చర్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 123 మంది సర్పంచులు, అధికారులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. ఎనిమిది మంది అఽధికారులు, 21 మంది సర్పంచులకు నోటీసులు అందజేశారు. ఒక సర్పంచ్‌ను ఆరు నెలలపాటు కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల్లోనే చర్యలకు గురవుతున్నారు.


మొదటి విడత పల్లె ప్రగతిలో 70 మంది అధికారులకు నోటీసులు ఇవ్వగా నలుగురు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఏడుగురు సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. రెండో విడత పల్లె  ప్రగతిలో 15 మంది అధికారులకు నోటీసులు ఇవ్వగా, ముగ్గురు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌లో ఏడు గురు అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఒకరిని సస్పెన్షన్‌ చేశారు. పది మంది సర్పంచులు నోటీసులు అందుకున్నారు. హరితహారంలో చందుర్తి మండలం నర్సింగాపూర్‌ సర్పంచ్‌ మొక్కలను ధ్వంసం చేసినందుకు సస్పెన్షన్‌కు గురయ్యారు. శ్మశాన వాటికలు, కంపోస్ట్‌ షెడ్‌ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహించినందుకు నలుగురు సర్పంచులకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దీంతో గ్రామాల్లో సర్పంచులు, అధికారులు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2020-07-06T10:40:56+05:30 IST