Russia Machine Gun : ఆటోమేటిక్ మెషిన్ గన్‌తో కుక్క కాల్పులు... ఇంటర్నెట్‌లో కలకలం...

ABN , First Publish Date - 2022-07-22T19:45:57+05:30 IST

ఆటోమేటిక్ మెషిన్ గన్‌ (automatic machine gun)తో కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తున్న వీడియో

Russia Machine Gun : ఆటోమేటిక్ మెషిన్ గన్‌తో కుక్క కాల్పులు... ఇంటర్నెట్‌లో కలకలం...

న్యూఢిల్లీ : ఓ రోబోటిక్ కుక్క గస్తీ తిరుగుతూ, ఆటోమేటిక్ మెషిన్ గన్‌ (automatic machine gun)తో కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తున్న వీడియో ఇంటర్నెట్‌ను వణికిస్తోంది. ఈ వీడియోను రష్యా (Russia)కు చెందిన HOVERSURF కంపెనీ వ్యవస్థాపకుడు అలగ్జాండర్ అటమనోవ్ (Alexander Atamanov) మార్చిలో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. 


ఈ రోబోటిక్ కుక్క ఓ ఇంటికి కాపలా కాస్తూ, గస్తీ తిరుగుతూ, ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ గన్‌తో కాల్పులు జరుపుతున్నట్లు ఈ వీడియోలో ఉంది. ఈ గన్‌ను కుక్క వీపుపై అమర్చారు. 


అటమనోవ్ ఇచ్చిన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ఈ రోబోటిక్ కుక్క శిక్షణ మైదానంలో ఈ విన్యాసాలు చేసింది. దీనికి సమీపంలోనే సాయుధ వాహనం ఉండటం ఈ వీడియోలో కనిపించింది. చురుగ్గా కదులుతున్న ఈ రోబో కుక్క లక్ష్యాల దిశగా చాలా తూటాలను పేల్చింది. టార్గెటింగ్ ఏ విధంగా జరుగుతున్నదీ తెలియజేయడం కోసం ఈ గన్ ఐపీస్‌ను క్లోజప్‌లో చూపించారు. అయితే ఈ కుక్క సంతులనాన్ని (బ్యాలెన్స్‌ను) వేగంగా సాధించలేకపోతోంది. ఈ రోబోటిక్ కుక్కపై అమర్చిన గన్‌ను ఏకే-74 డిజైన్ ఆధారంగా రూపొందించారు. ఇది రష్యన్ పీపీ-19 విట్యాజ్ సబ్‌మెషిన్ గన్. 


సామాజిక మాధ్యమాల్లో రచ్చ

రోబోటిక్ కుక్క ఆటోమేటిక్ మెషిన్ గన్‌తో విన్యాసాలు చేయడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరిగింది. ఇలాంటి మెషిన్స్ అవసరమా? అని చాలా మంది ప్రశ్నించారు. అమెరికన్లు పా పెట్రోల్ (PAW Patrol -ఏనిమేటెడ్ టీవీ సీరియల్) రష్యన్ బాలలకు విపరీతమైన విసుగు తెప్పిస్తోందని, అందువల్ల వారు ఈ పని చేయవలసి వచ్చిందని ఓ యూజర్ వ్యంగ్యంగా అన్నారు. 


ఓ ట్విటరాటీ స్పందిస్తూ, ప్రజల కన్నా వీటికే ఎక్కువ హక్కులు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో ఉన్న రోబోటిక్ కుక్క ప్రమాదవశాత్తూ ఎవరినైనా చంపితే, ఇది ఆటోమేటెడ్ కావడం వల్ల, దాని యజమానులకు ఎటువంటి శిక్ష ఉండదని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు.  అయితే ఇటువంటిదానిని ధ్వంసం చేయడం, పని చేయకుండా చేయడం అతి పెద్ద ఫెడరల్ నేరమని కేసు పెడతారన్నారు. 


అలగ్జాండర్ అటమనోవ్ రష్యాలో జన్మించినప్పటికీ, అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ జోస్‌లో 2014లో హోవర్‌సర్ఫ్ కంపెనీని స్థాపించారు. ఈ రోబోటిక్ కుక్క విన్యాసాలను ఎక్కడ చిత్రీకరించారో వెల్లడించలేదు. 


ఇటువంటి రోబోటిక్ కుక్క ప్రోటోటైప్ అమెరికాలో మరొకటి ఉంది. దీనిని ఘోస్ట్ రోబోటిక్స్ 2021లో ఆవిష్కరించింది. దీనిని స్పెషల్ పర్పస్ అన్‌మ్యాన్డ్ రైఫిల్ అంటారు. దీనికి 6.5 ఎంఎం క్రీడ్‌మూర్ రైఫిల్‌ను అమర్చారు. పగలు, రాత్రి పని చేయడానికి వీలు కల్పించే సెన్సర్లను దీనికి అమర్చారు. 





Updated Date - 2022-07-22T19:45:57+05:30 IST