విలువల ప్రతిరూపం

ABN , First Publish Date - 2022-08-12T05:25:31+05:30 IST

సండేల్‌ నారాయణరావు గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు.

విలువల ప్రతిరూపం
కుటుంబ సభ్యులతో నారాయణ రావు

స్వాతంత్య్ర సమరంలో సగం జీవితం గడిపిన సండేల్‌ నారాయణరావు
జాతీయోద్యమ ఆదర్శాలకు నిలువెత్తు ప్రతినిధి
అలనాటి యోధుడి జ్ఞాపకాలు పంచుకున్న వారసులు


సండేల్‌ నారాయణరావు గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. జిల్లాలో స్వాతంత్రోద్యమం ఊపందుకోవడంలో ఆయన పాత్ర ఉన్నది. ఆదర్శాలను  జీవితంలో భాగం చేసుకొని జాతీయోద్యమానికి ఆయన గౌరవం పెంచారు. సనాతన కుటుంబంలో పుట్టినా ఆధునిక ప్రగతిశీల చైతన్యాన్ని సొంతం చేసుకున్నారు. ఆ రోజుల్లో  సమాజం కోరుకున్న విలువలకు నారాయణరావు నిలువెత్తు ప్రతినిధి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నారాయణరావు గురించి ఆయన వారసుల జ్ఞాపకాలు...

కర్నూలు (కల్చరల్‌), ఆగస్టు 11: సండేల్‌ నారాయణరావు సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆ సంప్రదాయ భావాలను వీడి పోరాటాల బాట నడిచారు. సగం జీవితం స్వాతంత్య్ర సమరంలోనే గడిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అధికారం, పదవులు, సంపద వెంట పరిగెత్తలేదు. జాతీయోద్యమంలో ఏ విలువలను స్వీకరించారో వాటికి చివరంటా కట్టుబడి జీవించారు. స్వతంత్ర భావాలతో గడిపారు. 104 ఏళ్ల పూర్ణ జీవితం గడిపి  2013 ఆగస్టు 27న తుదిశ్వాస విడిచారు. కర్ణాటకకు చెందిన నారాయణరావు జీవితంలో చాలా భాగం కర్నూలుతో ముడిపడి ఉన్నది. కర్నూలు వాసిగానే గుర్తింపు పొందారు. చివరి రోజుల వరకు ఆయన  తన పనులు తానే చేసుకునేవారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయన నివసించే వీధికి నారాయణరావు వీధి అని నామకరణం చేసింది. ఆయన సేవలకు గుర్తుగా ఆయన మరణించే వరకు ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల్లో కర్నూలు కవాతు మైదానంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేకంగా ఆయన్ను సత్కరించేవారు. అమృతోత్సవాల సందర్భంగా నారాయణరావు వ్యక్తిత్వాన్ని ఆయన కుమారులు చంద్రశేఖర్‌, నరేంద్ర ప్రసాద్‌, తేజేశ్వరరావు ఇలా గుర్తు చేసుకుంటున్నారు.

సనాతనత్వాన్ని వీడి సంగ్రామం వైపు...

మానాన్న సండేల్‌ దేవరావుగారి నారాయణ రావు 26 జనవరి 1909లో కర్ణాటక రాష్ట్రంలోని సండేల్‌ అనే గ్రామంలో దేవప్పభట్‌, యమునమ్మ దంపతులకు ఎనిమిదో సంతానంగా జన్మించారు.  110 ఎకరాల భూమి, పెద్ద బంగళా ఉన్న ధనిక విలాసవంతమైన ఽ సనాతన బ్రాహ్మణ కుంటుంబం మాది. కానీ ఒక కార్యక్రమంలో మహాత్ముడి ప్రసంగం తన మనసును మార్చేసిందని మా నాన్న చెప్పేవారు.  పదిహేనో ఏట ఇల్లు, ఆస్తిపాస్తులు వదిలేసి పోరాటాల బాట పట్టారు.  షోలాపూర్‌లో ధనకోటి మల్లప్ప అనే సమరయోధుడిని ఉరితీసినందుకు నిరసనగా భాగల్కోట రాఘవేంద్రరావు నాయకత్వంలో గదగ్‌లో ప్రదర్శనలో పాల్గొన్నారు. అప్పుడు బ్రిటీషు ప్రభుత్వం ఆయన్ను తొలిసారిగా అరెస్టు చేసి పదిరోజులు జైలులో నిర్భందించింది. ఆ తర్వాత మహాత్మాగాంధీ పిలుపు మేరకు హుబ్లీలో గురురాజాచారి నాయకత్వంలో విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని 6 నెలలు జైలు జీవితం అనుభవించారు. బెంగుళూరులో కరపత్రాలు పంచినందుకు 8 రోజులు నిర్బంధంలో ఉన్నారు. తర్వాత సిద్ధలింగయ్య నాయకత్వంలో రాంపురంలో కాంగ్రెస్‌ మహాసభలో పాల్గొని పెద్దల పరిచయాలు పెంచుకున్నారు. బెంగుళూరులో గాంధీజీ కార్యదర్శి మహాదేవ దేశాయ్‌ సమావేశంలో వలంటీర్‌గా పనిచేస్తూ నెలా ఎనిమిది రోజులు జైలు జీవితం అనుభవించారు. నాడు కాంగ్రెస్‌ జెండాపై నిషేధాజ్ఞలు ఉండేవి. అయినా ఆ జెండా ఎగురవేసి రెండు నెలలు కారాగారంలో ఉన్నారు. ఇలా సంపూర్ణ స్వరాజ్యం సాధించే వరకు ఆయన చాలా కాలం జైలులోనే గడిపారు.

అజ్ఞాతంలో కర్నూలు చేరుకున్నారు

 మా నాన్నకు సమాజంలోని అన్ని వర్గాలను సమానంగా చూడాలనే భావన ఉండేది. కానీ మాది సనాతన బ్రాహ్మణ కుటుంబం కావడంతో 12 మంది తోబుట్టువుల మధ్య ఇమడటం కష్టంగా ఉండేది. అందుకే మహాత్ముని బాట ఎంచుకొని, అన్నీ త్యజించి మైసూరు, బెంగళూరు, చిక్‌మంగళూరు తదితర ప్రాంతాల్లో స్వరాజ్య ఉద్యమాల్లో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించి, ప్రజల్లో చైతన్యం నింపేవారు. అలా జైలు శిక్షలు అనుభవించి, బైటికి వచ్చాక అజ్ఞాతంలో ఉండి కర్నూలు చేరుకున్నారు. అప్పటి నుంచి చనిపోయే వరకు కర్నూల్లోనే ఉన్నారు. పత్తికొండలో 1929లో మహాత్ముని ప్రసంగం వినే అవకాశం వచ్చింది. బళ్లారి జిల్లాలోని ఊళ్లూరుకు చెందిన కళావతమ్మను వివాహం చేసుకున్నారు. మా అమ్మకూడా నాన్న అడుగుజాడల్లో నడిచారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మా నాన్న అజ్ఞాత జీవితం నుంచి బయటకు వచ్చారు.

 ఇంటి ముందు జాతీయ జెండా ఎగిరేది...

స్వాతంత్ర్యానంతరం ఇంటి ముందు ఏటా ఆగస్టు 15న, జనవరి 26న జాతీయ జెండాను మానాన్న ఎగురవేసేవారు. పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టేవారు. దేశనాయకుల త్యాగ నిరతిని  వివరించేవారు. సమాజంలో యువత ఎలా ఉండాలో చెప్పేవారు.

నాన్నతో ఎన్నెన్నో జ్ఞాపకాలు...

కుముద్‌బెన్‌ జోషి రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న రోజుల్లో ఒకరోజు ఆమె కర్నూలు గెస్ట్‌హౌస్‌లో దిగారు. కొద్దిసేపటికి ప్రొటోకాల్‌ చూసే ఒక రెవెన్యూ అధికారిని ఆమె పిలిచి సండేల్‌ నారాయణరావు గారిని పిలుచుకొని రండి అని ఆదేశించారు. ఆయన ఉన్నపళంగా మా ఇంటి ముందు వాలిపోయారు. వాహనం ఏర్పాటు చేయగా, నాన్నతో కలిసి మేము వెళ్లాము. ఆమె చాలాసేపు దేశ పరిస్థితులపై, సమాజంపై నాన్నతో చాలా సేపు చర్చించారు.

మరోసారి నాన్నతో కలిసి మేం అనంతపురం వెళుతున్నాం. ఏసీ కంపార్ట్‌మెంటులో ఉన్నాం. అందరికీ నిద్ర పట్టేసింది. రైలు అనంతపురం రెండు కిలోమీటర్లు దాటిపోయాక తెలిసింది. దీంతో ఆయన చైను లాగమని చెప్పారు. అలా లాగవచ్చో లేదో తెలియదు. కానీ నాన్న చెప్పటంతో లాగేశాము. రైలు ఆగింది. రైల్వే పోలీసులు వచ్చి విచారించారు. అనంతపురంలో రైలును ఆగకపోవడానికి కారణమైన అధికారి మీద చర్యలు తీసుకోమన్నారు. నాన్నను వారు గుర్తించి ఒక ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి మమ్మల్ని అనంతపురం చేర్చారు.

 సమాజంలో పరస్పర సహకార భావనలు అవసరం...

సేవ, పరస్పర సహకార భావనలతో జీవించాలని మానాన్న మాకు పదేపదే చెప్పేవారు. కర్నూలు పెద్దాసుపత్రి ఐదు జిల్లాలకు ముఖ్యమైన ఆసుపత్రి. అందువల్ల ఆసుపత్రికి వచ్చే చుట్టాల తాకిడి మా ఇంటి మీద బాగా ఉండేది. కానీ భోజన సమయానికి వచ్చేవారికి మనకు ఉన్నదాంట్లో భోజనం పెట్టాలని అని చెప్పేవారు. ఆ పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. అలాగే అవినీతి, లంచగొండితనానికి దూరంగా ఉండాలని చెప్పేవారు. పనుల కోసం వచ్చే వారికి సహాయం అందితే వారి కళ్లలో ఆనందాన్ని చూస్తామని చెప్పేవారు. మా ఉద్యోగ జీవితంలోనూ  మానాన్న అందించిన స్ఫూర్తితో సంతోషంగా ఉంటుంన్నాం. నాన్న  ఖద్దరు వస్త్రాలు, నెహ్రూ టోపీ ధరించేవారు.

 సేవలకు సత్కారాలు...

1972 ఆగస్టు 15న భారత ప్రభుత్వం నారాయణరావు సేవలను గుర్తించి తామ్ర పత్రంతో ఘనంగా సత్కరించింది.
2018 జనవరి 26న ఆయన నివసిస్తున్న కొత్తపేటలోని వీధికి సండేల్‌ నారాయణరావు వీధిగా నామకరం చేశారు.
ఇటీల సండేల్‌ నారాయణరావుపై పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు.

Updated Date - 2022-08-12T05:25:31+05:30 IST