Advertisement
Advertisement
Abn logo
Advertisement

వడ్డీరేట్ల తగ్గింపు అనివార్యం

కేంద్రప్రభుత్వం గత నెల 31న పొదుపు ఖాతాల వడ్డీరేట్ల తగ్గింపును ప్రకటించింది. అయితే ప్రకటించిన కొద్ది గంటలలోనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఐదు సంవత్సరాల కాలపరిమితి గల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్‌ఎస్‌సి) పై వడ్డీరేటును 7.9 నుంచి 6.8 శాతానికి తగ్గించారు. కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ , ప్రావిడెంట్ ఫండ్ వడ్డీరేట్లను సైతం తగ్గించడం, ఉపసంహరించుకోవడం ఏకకాలంలో జరిగింది! 


ఈ వడ్డీరేట్ల తగ్గింపుతో తమకేదో అన్యాయం జరిగిపోతుందంటూ ఖాతాదారులు గుండెలు బాదుకోవడానికి ఆందోళనకరమైన కారణమేమీ లేదు. ద్రవ్యోల్బణం రేటుతో సమాంతరంగా వడ్డీరేట్లను కూడా మార్పు చేయవలసిన అవసరముంది. ఉదాహరణకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌ఎస్‌సిపై వడ్డీ రేటు 7.9 శాతం కాగా ద్రవ్యోల్బణం రేటు 4.9 శాతం. ఖాతాదారు పొందే ‘వాస్తవిక ’ వడ్డీ రేటు 3.0 శాతం మాత్రమే . ద్రవ్యోల్బణం రేటుకు సమానస్థాయిలో అసలు మొత్తం తగ్గిపోవడం వల్లే వాస్తవిక వడ్డీరేటు తక్కువగా ఉంది. మీరు గత ఏడాది ఒక బ్యాంకులో 4.9 శాతం వడ్డీరేటు గల ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో రూ.100 జమ చేశారనుకోండి. గత ఏడాది మీరు ఆ వంద రూపాయలతో ఒక కిలో శ్రేష్ఠమైన బాస్మతి బియ్యాన్ని పొందగలిగేవారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన వంద రూపాయలకు, మీరు ఈ సంవత్సరం వడ్డీతో కలుపుకుని రూ.104.90 పొందగలుగుతారు. అయితే కిలో బాస్మతి బియ్యం ధర రూ.104.90 కి పెరిగింది. కనుక ఈ ఏడాది మీరు ఆ అధిక మొత్తానికి గత ఏడాది వలే కిలో బాస్మతి బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేసుకోగలుగుతారు. వడ్డీరేటు, ద్రవ్యోల్బణం రేటు మధ్య వ్యత్యాసమే ఖాతాదారుకు దక్కిన ‘వాస్తవిక’ ప్రయోజనం. 


ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటు 4.9 నుంచి 3.7 శాతానికి తగ్గిపోయింది. అయితే ఎన్‌ఎస్‌సి పై వడ్డీరేటులో ఎటువంటి మార్పులేదు. గత ఏడాది ఎన్‌ఎస్‌సిలో రూ.100 డిపాజిట్ చేసిన వారు రూ.107.9 లబ్ధి పొందగలుగుతారు. అంటే వాస్తవిక వడ్డీరేటు 4.2 శాతం (7.5 శాతం వడ్డీరేటులో నుంచి 3.7 శాతం ద్రవ్యోల్బణ రేటు తీసివేయగా మిగిలింది).  గత ఏడాది వాస్తవిక వడ్డీరేటు 3.0 శాతం (7.9 శాతం వడ్డీరేటులో నుంచి 4.9 శాతం ద్రవ్యోల్బణ రేటును తీసివేయగా మిగిలింది). వడ్డీరేటులో మార్పు లేకపోవడం, ద్రవ్యోల్బణ రేటు తగ్గిపోవడంతో వాస్తవిక వడ్డీరేటు ఈ సంవత్సరం 4.2 శాతానికి పెరిగింది. ఎన్ ఎస్ సి పై వడ్డీరేటును 7.9 నుంచి 6.8 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. ఆ నిర్ణయాన్ని అమలుపరిచినట్టయితే డిపాజిటర్ ఇప్పటికీ 3.1 శాతం వాస్తవ వడ్డీరేటు ( 6.8 వడ్డీరేటు నుంచి 3.7 శాతం ద్రవ్యోల్బణ రేటు తీసివేయగా మిగిలినది) పొందుతాడు. గత ఏడాది డిపాజిటర్ పొందిన వాస్తవ వడ్డీరేటుకు ఇది ఇంచుమించు సమానం. 


వడ్డీరేట్ల తగ్గింపును సమర్థించేందుకు మరో కారణమున్నది. ప్రజలు పొదుపు చేసే చిన్న మొత్తాలు వాస్తవంగా ప్రభుత్వం తీసుకునే రుణమే. పొదుపు ఖాతాల ద్వారా పొందే సొమ్ములో 95 శాతాన్ని ప్రభుత్వం తన వ్యయాలకు వెచ్చిస్తోంది. కేవలం ఐదు శాతం నిధులను మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తోంది. పొదుపు పథకాలకు భిన్నంగా బ్యాంకులలో డిపాజిట్ చేసే సొమ్ములో 50 శాతాన్ని ట్యాక్సీల కొనుగోలు, ఫ్యాక్టరీల ఏర్పాటు మొదలైన వాటికి రుణాలు ఇచ్చేందుకు వినియోగిస్తున్నారు. బ్యాంకులలో డిపాజిట్లను పెంపొందించేందుకు పొదుపుఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించడం సహేతుకమే. నిధుల సేకరణలో ఆర్థికభారాన్ని తగ్గించుకోవడం కూడా వడ్డీరేట్ల తగ్గింపునకు మరో కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వ సెక్యూరిటీలను కేవలం 6.2 శాతం వడ్డీరేటుతో విక్రయించడం ద్వారా ప్రభుత్వం భారీస్థాయిలో రుణాల రూపేణా నిధులు సమకూర్చుకోగలుగుతంది. మరి ఎన్‌ఎస్‌సి లాంటి పొదుపుఖాతాలపై 7.9 శాతం వడ్డీ చెల్లించవలసిరావడం వల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థికభారం పడుతుంది. 


మరింత ముఖ్యమైన విషయమేమిటంటే మన ఆర్థికవ్యవస్థ పెరుగుదల రేటు ఆరు సంవత్సరాలుగా క్రమంగా తగ్గిపోతోంది. కొవిడ్ విపత్తు కారణంగా ఈ పరిస్థితి మరింత విషమించింది. కరోనా మహమ్మారి మళ్ళీ చెలరేగిపోతుండడంతో ఆర్థికవ్యవస్థకు మరింత ముప్పు నెలకొంది. తమ విక్రయాలు కొవిడ్ ముందుస్థాయి కంటే ఇప్పటికీ 25 శాతం తక్కువగా ఉన్నాయని ఒక దుకాణదారుడు రెండు రోజుల క్రితమే నాకు చెబుతూ వాపోయాడు. ఫలితంగా అతడు ఆర్జించే లాభాలు తగ్గిపోయాయి. తన సొంత వినియోగానికి మార్కెట్ నుంచి అతడు కొనుగోలు చేసే సరుకులూ తగ్గిపోయాయి. అసలు మార్కెట్‌లో అన్ని సరుకులకూ డిమాండ్ తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో కొత్త మదుపులు చేయడం శ్రేయస్కరం కాదు. కొత్త మదుపులు లాభదాయకం కానప్పుడు రుణాలు తీసుకోవడం వల్ల ప్రయోజనమేమిటని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్ లో డిమాండ్ ఉంటే బ్యాంకు నుంచి రుణం తీసుకుని కొత్త ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు వారు తప్పక శ్రద్ధ చూపేవారు. ఆ డిమాండ్ లేనప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు వారు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం గానీ, కొత్త ఫ్యాక్టరీలను నెలకొల్పడం గానీ జరగదు గాక జరగదు. వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినా ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారస్థులు బ్యాంకు రుణాలు తీసుకోరని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు జపాన్ లో జరుగుతోంది ఇదే కదా. ఆ దేశంలో ఇప్పుడు వ్యాపారస్థులు ఎవరూ బ్యాంకు రుణాలు తీసుకోవడం లేదు. కొత్త మదుపులు చేయడం లేదు. ఆర్థిక వ్యవస్థ పెరుగుదల మందగించింది. 


ఆర్థికవ్యవస్థను పునరుద్ధరించడం కోసం వ్యాపారస్థులకు బ్యాంకు రుణాల మంజూరును మరింత సులభతరం చేయడంపై ప్రభుత్వం తన దృష్టిని కేంద్రీకరించింది. తక్కువ ద్రవ్యోల్బణం, బ్యాంకులలో డిపాజిట్లను ప్రోత్సహించడం, ఆర్థిక భారం కారణాలతో ఎన్‌ఎస్‌సి, ఇతర పొదుపుఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించడం సరైన దిశలో తీసుకున్న చర్యే. అయితే ఆ నిర్ణయం ఉపసంహరణ సమర్థనీయం కాదు. సమీప భవిష్యత్తులోనే ఆ వడ్డీరేట్లను ప్రభుత్వం మళ్ళీ తప్పక తగ్గిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అయితే మార్కెట్లో డిమాండ్ లేక పోవడంతో ఎవరూ బ్యాంకు రుణాలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం భిన్నమార్గాలను అనుసరించాలి. వడ్డీరేట్లను తగ్గించడంతో పాటు సగటు మనిషికి నగదు బదిలీ చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. తద్వారా ప్రజల కొనుగోలు సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అమెరికా, ఇతర దేశాలలో ఇప్పటికే నగదు బదిలీ విధానాన్ని అమలుపరుస్తున్నారు. నగదు బదిలీతో మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పాటు ఆర్థికవ్యవస్థ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతుంది.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...