Abn logo
Aug 4 2020 @ 01:20AM

అయోధ్యలో అపూర్వ ఘట్టం

నిజమైన లౌకికవాదం, కుహనా లౌకిక వాదం మధ్య పోరుకు ప్రతీకగా అయోధ్య ఉద్యమం నిలిచింది. ‘వివాదాస్పద కట్టడాన్ని మరో చోటికి గౌరవంగా తరలించి అక్కడ మసీదును నిర్మించేందుకు అనుకూలంగా ఉన్నామని’ 1989లో బిజెపి తీర్మానం చేసింది. గత ఏడాది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ తీర్మానం స్ఫూర్తికి అనుకూలంగా ఉన్నది. దీన్ని బట్టి బిజెపి ఆకాంక్ష ఎంత న్యాయసమ్మతంగా ఉన్నదో అర్థమవుతోంది. రామమందిర నిర్మాణమే కాదు, రామరాజ్య స్థాపన సైతం బిజెపి పాలనలో సంభవిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఈనెల 5వ తేదీ దేశ రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం. ఏడాది క్రితం కశ్మీర్లో 370 అధికరణ రద్దు చేసినప్పుడు దాన్నొక చరిత్రాత్మక ఘట్టంగా అనేకమంది అభివర్ణించారు. అయితే కశ్మీర్ విషయంలో జరిగింది కేవలం కొన్ని దశాబ్దాల పరిణామం మాత్రమే. ఈ దేశ అస్తిత్వానికి చిహ్నమైన శ్రీరాముడి జన్మస్థలంపై ఒక మసీదు నిర్మాణం జరిగి కొన్ని శతాబ్దాలు అయింది. పురాతత్వ శాఖ నివేదికల్లోనే కాదు, మొగల్ సామ్రాజ్య రికార్డుల్లో కూడా మందిరం స్థానంలో మసీదు నిర్మించారనడానికి సాక్ష్యాలున్నాయి. కట్టడం కూలిన తరువాత కూడా వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నదనడానికి మద్దతుగా వాస్తుపరమైన శిల్పాలతో పాటు, లిఖిత అంశాలతో కూడిన ఆధారాలెన్నో లభించాయి. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రత్యేక సర్వే జరిపినప్పుడు కూడా మరెన్నో ఆధారాలు లభ్యమయ్యాయి ఈ నేపథ్యంలో కొన్ని శతాబ్దాలుగా మనస్తాపానికి గురైన ఈ దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మళ్లీ అదే స్థానంలో మందిర నిర్మాణానికి ఆగస్టు 5న శంకుస్థాపన జరగడం సాధారణ పరిణామా? కానే కాదు.


అయోధ్య ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక సైద్ధాంతిక అంతర్మధనానికి కారణమైంది. ఈ ఉద్యమంలో కోట్లాది ప్రజలు అసాధారణ మద్దతునీయడంతో అది ఈ దేశంలో అతి పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం– భారత దేశ ఐతిహాసిక, చారిత్రక గతానికీ, భారతీయుల జాతీయ ఆత్మగౌరవానికీ, ఈ నేలలో ఉన్న ఆధ్యాత్మిక అన్వేషణకూ ఇక్కడి ప్రజలు ఆరాధించే శ్రీరాముడి జన్మభూమిలో, ఆయన పాలించిన చోటే ఒక భవ్యమైన మందిరం నిర్మాణం కావాలనే ఆకాంక్షకూ అవినాభావ సంబంధం ఉన్నది. అయోధ్య పుణ్య క్షేత్రానికే కాదు, పవిత్రమైన భారత భూమిపై ఉన్న అనేక దివ్యక్షేత్రాలకు లక్షలాది ప్రజలు భాష, భౌగోళిక, కుల, వర్గ వ్యత్యాసాలు లేకుండా వేలాది ఏళ్లుగా యాత్రలు చేస్తూనే ఉన్నారు. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు, పూజలు, యాత్రలు ఈ దేశంలో విశిష్టమైన జాతీయ ఐక్యతను ఏర్పరిచాయి. రామాయణంలోనూ, మన ఇతిహాసాల్లోనూ ఉన్న పాత్రలు స్థల, కాలాదులతో నిమిత్తం లేకుండా ప్రజలను ప్రభావితం చేశాయి. చెడుపై మంచి పోరాటం చేయాలనే విలువను మనకు అందించాయి. ఒక దేవుడిని ప్రజలు ప్రగాఢంగా ఎందుకు ఆరాధిస్తున్నారు? దేవుడు సర్వాంతర్యామి అని తెలిసినప్పటికీ అనేక యాత్రాస్థలాలకు కోట్లాది మంది ఎందుకు పర్యటిస్తారు? అన్న ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే మన సుసంపన్నమైన, వైవిధ్య భరితమైన సాంస్కృతిక వారసత్వం గురించి లోతుగా అధ్యయనం చేయవలిసి ఉంటుంది. మనకు అర్థమైనదానికంటే ఎంతో భిన్నమైన మానవ చరిత్ర భారత దేశంలో ఉన్నదని తెలుసుకోవాల్సి ఉంటుంది. చరిత్ర గమనంలో ఎన్నో ఆలయాలు విధ్వంసానికి గురయ్యాయి. దేవతా విగ్రహాలు నాశనమయ్యాయి. భక్తులు ఊచకోతకు గురయ్యారు. అయినప్పటికీ సోమనాథ మందిరం నుంచి మధుర, కాశీతో సహా అనేక ఆలయాలు నిరంతరం శిథిలాలనుంచి మళ్లీ ఆవిర్భవించి గతంలో కంటే బలంగా పునర్నిర్మితమైనవే. ఇది సాంస్కృతిక ఐక్యత. చెక్కుచెదని మత విశ్వాసాలకు, పవిత్ర మనోభావాలకు నిదర్శనం మాత్రమే కాదు, మన జాతీయ ఆత్మ. జాతీయ జీవనంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న విద్యుత్తు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ఈ విద్యుత్తు ఇవాళ దేశంలోని సామాజిక చేతనను రగిలిస్తుందని చెప్పక తప్పదు.


భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజల మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకుని వారితో మమేకమైనందువల్లే వారి ఆకాంక్షలకు అనుగుణంగా, భారతీయ ఆత్మకు సాంస్కృతికంగా పునర్ వ్యక్తీకరణ చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నది. భారత దేశ జాతీయ జీవనంలో రాముడు, రామాయణానికి ఉన్న ప్రాధాన్యత, శతాబ్దాలుగా అవి భారతీయుల సాంస్కృతిక వ్యక్తిత్వం, నైతిక విలువలపై చూపుతున్న ప్రభావం గురించి బిజెపికి తెలిసినందువల్లే ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ వస్తోంది. మానవ భావోద్వేగాలు, నైతిక పాఠాలతో కూడిన రామాయణంలో, సీతారామలక్ష్మణులు, ప్రధాన పాత్రలే కాదు గిరిజనులైన వాల్మీకి, శబరిల నుంచి తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా వ్యవహరించే శ్రవణకుమారుడి వరకూ చెప్పే విలువలకు మన భారతీయ కుటుంబాల్లో ఇప్పటికీ ప్రాధాన్యత ఉన్నది. తులసీదాస్‌నుంచి సూరదాస్ వరకూ, కబీర్‌ నుంచి తుకారాం, అస్సాంలోని శంకర్‌దేవ్‌ నుండి తమిళనాడులోని కంబ వరకూ భారత చరిత్రలో ఎందరో మహానుభావులు సామాజిక సంస్కరణలు జరపాలన్న తమ లక్ష్యాన్ని సాధించడం కోసం రాముడుని ప్రశంసించారు. సిక్కులు, జైనులు, బౌద్ధులు మాత్రమే కాదు, ఎందరో భారతీయ ముస్లింలు కూడా రాముడిని ఒక ఆదర్శ పాలకుడిగా, ఉన్నత మానవ లక్షణాల సమ్మేళంగా భావించారు. రాముడిని భారతదేశపు ‘ఇమామ్–ఏ–హింద్’ (భారత ఆధ్యాత్మిక నాయకుడు)గా ఇరవయో శతాబ్ది ఉర్దూ, పర్షియన్ మహాకవి అల్లామా ఇక్బాల్ అభివర్ణించారు.


శ్రీరాముడి పేరును గాంధీజీ జీవితాంతం భక్తితో ఉచ్చరించారు. రాముడ్ని ఆయన కేవలం ఒక హిందూ దేవుడిగా భావించలేదు. భారతీయ సందర్భంలో సార్వత్రిక సౌహార్ధ్ర భావానికి, జాతీయ సమైక్యతకు ఒక దైవ శక్తిగా ఆయన భావించారు. అనేక ఆగ్నేయాసియా దేశాల్లో రామాయణ గాథలు రకరకాలుగా ప్రచారమవుతాయి. భారత జాతీయ వ్యక్తిత్వానికి, సమైక్యతకు, సమగ్రతకు విశిష్టమైన సంకేతమైన శ్రీరాముడికి ఆయన జన్మస్థలంలోనే మందిర నిర్మాణం ప్రారంభం కావడం బిజెపి హయాంలో జరుగుతున్న ఒక అద్భుత పరిణామం. దీని పర్యవసానాలు భారతీయ సామాజిక చేతనపై ప్రగాఢ ప్రభావం చూపుతాయి. స్వాతంత్ర్యం రాగానే నాటి హోంమంత్రి సర్దార్ పటేల్ సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించేందుకు ఏ చర్యలు తీసుకున్నారో ఇవాళ ప్రధానమంత్రి మోదీ హయాంలో రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా అవసరమైన చర్యలన్నీ తీసుకుంటోంది. ప్రాచీన కాలంలో ఏ స్థలంలో నైతే చరిత్రాత్మకమైన సోమనాథ్ మందిరం ఉందో అదే స్థలంలో స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వం మందిరాన్ని పునర్నిర్మించి జ్యోతిర్లింగాన్ని పునః ప్రతిష్టింపజేస్తుందని 1947లో జునాఘడ్ భారత్కు వశమైన నాలుగురోజుల్లోనే సర్దార్ పటేల్ ప్రకటించారు. సర్దార్ పటేల్ ప్రారంభించిన పనిని ఆయన మరణానంతరం మరో కేంద్ర మంత్రి కెఎంమున్షీ చేపట్టి నెహ్రూ ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ మృదువుగా ఎదుర్కొంటూనే తన లక్ష్యాన్ని సాధించారు. ఈ దేశ ప్రజల మనోభావాలతో కాంగ్రెస్, ఇతర పార్టీలు చెలగాటమాడాయి. అసలు ప్రజల మనోభావాలనే అవి అర్థం చేసుకోక ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయి. షాబానో కేసులో ముస్లింలను బుజ్జగించేందుకు కోర్టు తీర్పునే కాలరాచిన రాజీవ్ గాంధీ హిందువుల ఓట్లకోసం 1989లో అయోధ్య నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.


రామజన్మభూమి లక్ష్యంపై కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉన్నట్లయితే బిజెపి తరువాత కాలంలో అయోధ్య ఉద్యమంలో చేరి ఉండేది కాదు. కాని కాంగ్రెస్, దాని పంచమాంగ దళం మెజారిటీ భారత ప్రజల న్యాయపూరిత డిమాండ్‌కు మతపరమైన రంగును పులిమాయి. ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే బదులు అయోధ్య అంశాన్ని మైనారిటీలకు వివరించడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ బూటకపు లౌకికవాదం వల్లనే అయోధ్య ఉద్యమానికి ప్రజల అఖండ మద్దతు లభించింది. నిజమైన లౌకికవాదం, కుహనా లౌకిక వాదం మధ్య పోరుకు ప్రతీకగా అయోధ్య ఉద్యమం నిలిచింది. ‘వివాదాస్పద కట్టడాన్ని మరో చోటికి గౌరవంగా తరలించి అక్కడ మసీదును నిర్మించేందుకు అనుకూలంగా ఉన్నామని’ 1989లో బిజెపి పాలంపూర్లో తొలుత అయోధ్యపై తీర్మానం చేసింది. గత ఏడాది సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈ స్ఫూర్తికి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. దీన్ని బట్టి బిజెపి ఆకాంక్ష ఎంత న్యాయసమ్మతంగా ఉన్నదో అర్థమవుతోంది. రామమందిర నిర్మాణమే కాదు, రామరాజ్య స్థాపన కూడా బిజెపి చేసి తీరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

వై. సత్యకుమార్బి

జెపి జాతీయ కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement