పేదల చెంతకు రేడియాలజీ హబ్‌

ABN , First Publish Date - 2022-08-19T04:29:04+05:30 IST

పేద ప్రజలకు శుభవార్త. ఇక ఆరోగ్య పరీక్షల కోసం ప్రైవేటు డయాగ్నస్టిక్‌లకు వెళ్లి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

పేదల చెంతకు రేడియాలజీ హబ్‌

  • వికారాబాద్‌లో ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ 
  • పేద ప్రజలకు తప్పనున్న ఆర్థిక భారం
  • అందుబాటులోకి రానున్న డిజిటల్‌ ఎక్స్‌రే, ఈసీజీ, అలా్ట్రసౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ సేవలు
  • ఉచిత ల్యాబ్‌ పరీక్షలతో పేద ప్రజలకు రూ.3.01 కోట్లు ఆదా..

 పేద ప్రజలకు శుభవార్త. ఇక ఆరోగ్య పరీక్షల కోసం ప్రైవేటు డయాగ్నస్టిక్‌లకు వెళ్లి భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే అన్ని రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం రేడియాలజీ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ హబ్‌ ఏర్పాటైతే పేద కుటుంబాలకు చెందిన రోగులకు ఎంతో ఊరట కలగనుంది.

వికారాబాద్‌, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో త్వరలో రేడియాలజీ హబ్‌ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏడాది కిందట వికారాబాద్‌ ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ (టీ-హబ్‌) హబ్‌  ఏర్పాటు చేసిన ప్రభుత్వం తాజాగా రేడియాలజీ హబ్‌ ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లా కేంద్రంలో ఉచిత రేడియాలజీ సేవలు ప్రారంభమైతే పేద ప్రజలకు చాలా వరకు ఆర్థిక భారం తప్పనుంది. స్థానికంగానే ఉచితంగా రేడియాలజీ పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. రేడియాలజీ హబ్‌ ప్రారంభిస్తే డిజిటల్‌ ఎక్స్‌రే, ఈసీజీ, అలా్ట్రసౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి ఇమేజ్‌ పరీక్షలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం టీ-హబ్‌లో పాథాలజీ, క్లినికల్‌ మైక్రో బయాలజీ, క్లినికల్‌ బయో కెమిస్ట్రీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో గత ఏడాది, జూన్‌ ఒకటిన ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ హబ్‌లో ఏడాది కాలంగా రక్త, మల, మూత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది జూలై వరకు 40,346 మంది రోగుల నుంచి 70,683 నమూనాలు సేకరించి 1,04,429 పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ 57 రకాల సమగ్ర పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం 47 నుంచి 50 వరకు సమగ్ర పరీక్షలు చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించే విధంగా సదుపాయం కల్పిస్తే 150 రకాలకు పైగా పరీక్షలు ఉచితంగా పొందే అవకాశం ఏర్పడుతుంది.


  • పేద ప్రజలకు రూ.3.01 కోట్లు ఆర్థికంగా ఆదా..

ప్రస్తుతం వైద్యమనేది చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఏ వ్యాధితో బాధపడుతున్నారనేది గుర్తించేందుకు నిర్వహించే రోగ నిర్ధారణ పరీక్షల కూడా ఖరీదుతో కూడుకున్నవి కావడంతో పేదలకు భారంగా పరిణమించింది. ఏ చిన్న ఆరోగ్య సమస్యతో డాక్టర్‌ వద్దకు వెళ్లినా రోగ నిర్ధారణ కోసం వివిధ పరీక్షలను చేయించుకొని రావాలని సూచిస్తున్నారు. ఆరోగ్య సమస్య ఏదైనా డాక్టర్‌ను సంప్రదిస్తే.. ఆ సమస్యకు కారణం తెలుసునేందుకు రక్త, మూత్ర, మల పరీక్షలు చేసుకు రావాలని సిఫారసు చేస్తున్నా రు. ఏదైనా జ్వరంతో బాధపడుతుంటే అది ఏ రకమైన జ్వరం అనేది గుర్తించేందుకు రక్త పరీక్ష తప్పని సరిగా మారింది. సరైన చికిత్స అందించేందుకు రోగ నిర్ధారణ అనేది ఎంతో ముఖ్యమైనది. రక్త పరీక్ష ఫలితం ఆధారంగా కచ్చిత మైన చికిత్స అందించవచ్చని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే, పేద ప్రజలకు రోగ నిర్ధారణ పరీక్షలు అనేది భారంగా మారాయి. జేబులు చిల్లులు పడే పరిస్థితులు నెలకొన్నాయి. రెండు, మూడు రోజులుగా జ్వరంతో బాధపడే వారు సమగ్రంగా రక్త పరీక్ష చేసుకోవాలంటే రూ.1,500 పరీక్షలకే వరకు ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది. ఇతర పరీక్షలైతే ఇంకా ఎక్కువ ఖర్చవుతుంది. రోగ నిర్ధారణ పరీక్షలకయ్యే ఖర్చులు చూసి చాలా వరకు పేదలు ఆ పరీక్షలు చేసుకోకుండానే మందులు వాడుతూ తమ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకుంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు పేదలకు భారంగా మారాయనేది గుర్తించిన రా ష్ట్ర ప్రభుత్వం తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ హబ్‌ ప్రారంభించింది. టీ-హబ్‌లో పేద ప్రజలు ఉచితంగా రోగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో గత ఏడాది జూన్‌ నుంచి ప్రారంభించిన టీ-హబ్‌లో రక్త, మల, మూత్ర పరీక్షలు చేస్తున్నారు. వివిధ పీహెచ్‌సీల్లో రోగుల నుంచి సేకరించిన నమూనాలను అదే రోజు పరీక్షించి 24 గంటల్లోగా వాటి ఫలితాలను మెసేజ్‌ రూపంలో పంపిస్తున్నారు. గత 13 నెలలుగా జిల్లా లో పేద ప్రజలకు రూ.3.01కోట్ల విలువైన రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వ గణాంకాలు వివరిస్తున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం వల్ల పేద ప్రజలకు ఆర్థిక భారాన్ని తప్పించినట్టయింది.


  • పేద రోగులకు తప్పనున్న ఆర్థిక భారం 

డిజిటల్‌ ఎక్స్‌రే, ఈసీజీ, అలా్ట్రసౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ సదుపాయం అందుబాటులోకి వస్తే పేదలకు మరింత ఆర్థిక భారం తప్పనుంది. ఈజీసీ, ఎక్స్‌రే, అల్ర్టాసౌండ్‌, సీటీస్కాన్‌, ఎంఆర్‌ఐ పరీక్షలు చాలా ఖరీదైనవి కావడంతో ప్రజలకు చాలా ఊరట కలగనుంది. రేడియాలజీకి సంబంధించిన పరీక్షలు చేసుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తే ఆర్థికంగా భారం కావడంతో రోగులు వెనకా ముందు ఆలోచిస్తున్నారు. టీ -హబ్‌లో రేడియాలజీ సేవలు అందుబాటులోకి వస్తే పేదలకు చాలావరకు మేలు జరగనుంది. అత్యాధునికమైన డిజిటల్‌ ఎక్స్‌రే, ఈసీజీ, అలా్ట్ర సౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ యంత్రాలు ఏర్పాటు చేసేందుకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కార్డియాక్‌, టీవీఎస్‌ ప్రోబ్‌ కూడా అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిసింది. అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు టీ-హబ్‌లో అందుబాటులోకి వస్తే రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించడానికి వీలవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. 


  • టీ-హబ్‌కు కొత్త భవనం

ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఏరియా ఆసుపత్రి పాత భవనంలో కొనసాగుతున్న టీ-హబ్‌కు సొంత భవనాన్ని నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజీవ్‌నగర్‌ కాలనీ వద్ద నిర్మించిన ఏరియా ఆసుపత్రి పక్కనే టీ-హబ్‌ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయితే గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రేడియాలజీ విభాగం, మొదటి అంతస్తులో ల్యాబ్‌ కొనసాగనున్నాయి. సేవలు విస్తృతమవుతాయి.


  • ప్రజలకు ఎంతో ఉపయోగం : డాక్టర్‌ శాంతప్ప, నోడల్‌ అధికారి, తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌, వికారాబాద్‌ 


టీ-హబ్‌లో రేడియాలజీ సదుపాయం కల్పిస్తే ప్రజలకు ఎక్స్‌రే, ఈసీజీ, అలా్ట్ర సౌండ్‌, సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ వంటి సేవలు ఉచితంగా పొందడానికి అవకాశం ఉంటుంది. గత ఏడాది ప్రారంభమైన టీ-హబ్‌లో బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, పాథాలజీ పరీక్షలు చేస్తున్నారు. రేడియాలజీ సేవలు ప్రారంభమైతే పేదలకు డబ్బు ఖర్చు లేకుండానే స్కానింగ్‌ తీయిం చుకునే అవకాశం కలుగుతుంది. ఇలాంటి సేవల వల్ల ప్రభుత్వాసుపత్రులకు ప్రజల నుంచి ఆదరణ మరింత పెరుగుతుంది.


  • ప్రభుత్వం త్వరగా ప్రారంభించాలి : శారదాంబ, గృహిణి, చీలాపూర్‌, పూడూరు మండలం

 వికారాబాద్‌లోని తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌లో ఎక్స్‌రే, ఈసీజీ, స్కానింగ్‌ సేవలు ప్రారంభించేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకోవడం సంతోషకరం. రేడియాలజీ సదుపాయాన్ని ప్రభుత్వం త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. ప్రైవేట్‌ ల్యాబ్‌లకు ఏ చిన్న పరీక్ష చేయించుకునే ందుకు వెళ్లినా వందల రూపాయల ఖర్చు తప్పడం లేదు. ఇప్పటికే ప్రజలకు అవసరమైన ల్యాబ్‌ పరీక్షలు ఉచితంగా చేస్తున్నారు. ఇప్పుడు రేడియాలజీ సేవలు ప్రారంభించాలని నిర్ణయించడం అనందంగా ఉంది. దీనివల్ల ఎంతో మంది పేదలకు ఆర్థికబారం తప్పుతుంది.

Updated Date - 2022-08-19T04:29:04+05:30 IST