Saudi Arabia లో ప్రముఖ ఎన్నారై కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-12T17:51:47+05:30 IST

సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రముఖ ఎన్నారై రఫీయుద్దీన్ ఎస్ ఫజుల్‌భోయ్ కన్నుమూశారు.

Saudi Arabia లో ప్రముఖ ఎన్నారై కన్నుమూత

జెడ్డా: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ప్రముఖ ఎన్నారై రఫీయుద్దీన్ ఎస్ ఫజుల్‌భోయ్ కన్నుమూశారు. ఎంతో మంది ఎన్నారైలకు మార్గదర్శకునిగా నిలిచిన రఫీయుద్దీన్ మరణం సౌదీ అరేబియాలోని భారత కమ్యూనిటీకి తీరని లోటు అనే చెప్పాలి. జెడ్డాలో తొలి ఇండియన్ స్కూల్ స్థాపించింది కూడా ఆయనే. 1958లోనే జెడ్డాలో అడుగు పెట్టారు రఫీయుద్దీన్. చదువుపై ఉన్న మక్కువతో అప్పట్లోనే జెడ్డాలో ఇండియన్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అలా 1969లో జెడ్డాలో ఇండియన్ ఇంటర్నెషనల్ స్కూల్(ఐఐఎస్‌జే)ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 10వేలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూల్‌లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రఫీయుద్దీన్‌కు మాతృదేశంపై ఎనలేని మమకారం. అందుకే తన చివరి శ్వాస వరకు ఆయన భారతీయ పౌరసత్వాన్ని వదులుకోలేదు. భారత పౌరునిగానే కొనసాగారు. 


ఇక భారత్ నుంచి హజ్ యాత్రకు వచ్చే వారికి కూడా ఆయన తనవంతు సహాయం చేసేవారు. బలాద్‌లోని మీనా రోడ్‌లో తన సొంత ఖర్చులతో హజ్ యాత్రికులకు వసతి కల్పించేవారు. గుజరాత్‌కు చెందిన రఫీయుద్దీన్ తల్లిదండ్రులు ముంబైలో స్థిరపడ్డారు. ముంబై నుంచి 1958లో ఓ షిప్పింగ్ కంపెనీలో పని కోసం మొదటిసారి ఆయన జెడ్డా వెళ్లారు. అప్పటి నుంచి ఆరు దశాబ్దాలకు పైగా ఆయన సౌదీలోనే గడిపారు. రఫీయుద్దీన్ భారతీయ సమాజానికి చేసిన విశిష్ట సేవలకు గాను 2008లో ఆయనకు భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డును ప్రదానం చేసింది. శనివారం జెడ్డాలో భారీగా తరలి వచ్చిన భారత కమ్యూనిటీ సమక్షంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. రఫీయుద్దీన్ మృతి సౌదీలోని భారతీయ సమాజానికి తీరనిలోటు అని ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-12-12T17:51:47+05:30 IST