మద్యం దుకాణంపై పోలీసుల దాడి

ABN , First Publish Date - 2020-03-30T09:44:30+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను పాటించకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బోడుప్పల్‌లోని ప్రియాబార్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు.

మద్యం దుకాణంపై పోలీసుల దాడి

బోడుప్పల్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ను పాటించకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బోడుప్పల్‌లోని ప్రియాబార్‌పై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. మద్యం విక్రయిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకుని నాలుగు ఫుల్‌బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బోడుప్పల్‌ హేమానగర్‌ కాలనీలోని ప్రియాబార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో రహాస్యంగా మద్యం విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజిగరి ఎస్‌వోటీ పోలీసులు శనివారం రాత్రి బార్‌పై దాడి చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఉప్పల్‌ ఆదర్శనగర్‌కు చెందిన పెద్దిరెడ్ల శ్రీనివాస్‌ (34) బార్‌లో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన ఆర్‌.లక్ష్మణ్‌ (32), కె.భాషా (23), జె.భరత్‌ (40) వెయిటర్లుగా పని చేస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని మద్యం సీసాలతో పాటు సెల్‌పోన్లను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్‌ పోలీసులకు సమాచాచరం అందించారు. ఈ మేరకు ఎక్సైజ్‌  పోలీసులు బార్‌ను సీజ్‌ చేశారు. మద్యం విక్రయిస్తున్న నలుగురిని మేడిపల్లి పోలీసులకు అప్పగించినట్టు ఎస్‌వోటీ పోలీసులు తెలిపారు. 


కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో

మియాపూర్‌, మార్చి 29(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్‌ కావడంతో కొంతమంది అక్రమంగా అధిక ధరలకు మద్యం అమ్ముతున్నారని సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు దాడిచేశారు. మద్యం సీసాలను సీజ్‌చేసి అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు. శేరిలింగంపల్లి ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ గాంధీ వివరాల ప్రకారం...  ఈనెల 27న మధ్యాహ్నం కొండాపూర్‌ రాఘవేంద్రకాలనీలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించి ఐదు కాటన్ల బీర్లు, కాటన్‌ ఓసీ విస్కిబాటిళ్లను సీజ్‌ చేశామన్నారు. దాడుల సమయంలో అక్కడ మద్యం బాటిల్స్‌ మాత్రమే లభించాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు అమ్ముతున్నారని దర్యాప్తు చేస్తునమని తెలిపారు. లాక్‌డౌన్‌ సందర్భంగా ఎవరైనా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 


సిగరెట్లు, గుట్కాలను అమ్ముతున్న వ్యక్తి అరెస్టు 

బర్కత్‌పుర, మార్చి 29(ఆంధ్రజ్యోతి): నిషేదిత విదేశీ సిగరెట్లు, పాన్‌మసాలా, గుట్కాలను గుట్టు చప్పుడుకాకుండా విక్రయిస్తున్న ఓ కిరాణా షాపు యజమానిని కాచిగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి 276 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ హబీబుల్లాఖాన్‌ వివరాల ప్రకారం... కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని టక్కీ జైలు సమీపంలో ముక్రముద్దీన్‌(28) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. గుట్టు చప్పుడు కాకుండా నిషేధించిన విదేశీ సిగరెట్లు, పాన్‌మసాలా, గుట్కాలను విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ పోలీసులు కిరాణాషాపుపై దాడిచేసి నిలువ ఉంచిన 276 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముక్రముద్దీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు. 

Updated Date - 2020-03-30T09:44:30+05:30 IST