అబార్షన్ పిల్స్ వల్ల మహిళకు మూడేళ్ల జైలు శిక్ష.. అమెరికన్లకు కొత్త టెన్షన్.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-07-15T00:26:11+05:30 IST

యూరోపియన్ దేశమైన పోలాండ్‌‌లోని ఓ కేసు ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ కేసు హాట్ టాపిక్ అయింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు అక్కడి న్యాయస్థానం సు

అబార్షన్ పిల్స్ వల్ల మహిళకు మూడేళ్ల జైలు శిక్ష.. అమెరికన్లకు కొత్త టెన్షన్.. అసలు కథేంటంటే..

ఎన్నారై డెస్క్: యూరోపియన్ దేశమైన పోలాండ్‌‌లోని ఓ కేసు ప్రస్తుతం ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఈ కేసు హాట్ టాపిక్ అయింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళకు అక్కడి న్యాయస్థానం సుమారు మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉండటంతో అమెరికాలోని డాక్టర్లు సహా కొందరు స్వచ్ఛంద కార్యకర్తలు భయాందోళనలకు గురవుతున్నారు. తమకు కూడా ఆ పరిస్థితి తప్పదేమో అని టెన్షన్ పడుతున్నారు. ఇంతకూ విషయం ఏంటంటే..


పోలాండ్‌కు చెందిన Justyna Wydrzyńska‌కు ప్రస్తుతం 47ఏళ్లు. అబార్షన్ డ్రీమ్ టీమ్ అనే సంస్థ సహ వ్యవస్థాపకురాలిగా పని చేస్తూ.. అబార్షన్‌ల విషయంలో అక్కడి మహిళలకు మద్దతుగా పోరాడుతున్నారు. ప్రస్తుతం కోర్టులో ఈమె పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అత్యాచార కేసులు, తల్లికి ప్రాణ హాని ఉన్న సందర్భంలో మినహా పోలాండ్‌లో అబార్షన్‌లు చట్ట విరుద్ధం. అబార్షన్‌లకు సహకరించిన వాళ్లు కూడా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. జస్టినా విషయంలో కూడా ఇదే జరిగింది. ఓ మహిళ ఇబ్బందులను చూసి తట్టుకోలేకపోయారు. అబార్షన్ పిల్స్ అందించి ఆమెకు గర్భవిచ్ఛిత్తి అవడానికి జస్టినా సహకరించారు. ఈ విషయం కాస్తా సదరు మహిళ భర్త దృష్టికి రావడంతో అతడు జస్టినాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోంది.. నేరం రుజువైతే.. జస్టినా‌కు సుమారు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. 



ఈ అంశమే అమెరికన్లను కలవరపెడుతోంది. అగ్రరాజ్యంలో కూడా అబార్షన్‌లపై నిషేధం విధిస్తూ తాజాగా సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ నేపథ్యంలో టెక్సాస్ కూడా కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. గర్భవిచ్ఛిత్తికి సహకరించే వారిపై.. సాధారణ ప్రజలు కూడా సివిల్ వ్యాజ్యాలు వేసే విధంగా నిబంధనలు తీసుకొచ్చింది. ఇదే దారిలో మరికొన్ని రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి. దీంతో అమెరికాలోని డాక్టర్లు, స్వచ్ఛంద కార్యకర్తలు కలవరపాటు చెందుతున్నారు. గర్భవిచ్ఛిత్తికి సహకరిస్తే తమకు కూడా జాస్టిన్‌‌కు ఎదురైన పరిస్థితే వస్తుందని భయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. జాస్టిన్‌పై కేసులు నమోదవ్వడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్ ఖండించారు. సురక్షితమైన అబార్షన్‌ల మీద నిషేధం కొనసాగుతున్నందున.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు, చిన్నారులు ఏటా ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు.


Updated Date - 2022-07-15T00:26:11+05:30 IST