Abn logo
Jun 1 2020 @ 00:15AM

‘‘ప్రొజాయిక్‌ లైఫ్‌లో పడకూడదు కవి’’ - హెచ్చార్కె

కదలడు-వదలడు, చిక్కడు-దొరకడు, వాడే-వీడు లాంటి టైటిల్స్‌ హెచ్చార్కేకి సరిగ్గా సరిపోతాయి. ఎప్పటికప్పుడు ఒపీనియన్స్‌ ఛేంజ్‌ చేసే హెచ్చార్కేతో మిత్రులకు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. అంతా ‘అబద్ధం’ అంటూ తెలుగు సాహిత్యాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే హెచ్చరించి, నిజం ఏమిటో మాత్రం మనల్నే తెలుసుకోమంటాడు. కథ, కవిత, పాట, విమర్శ, పత్రికా రచన.. ఇలా అన్ని ప్రక్రియల్లో వేలు పెట్టి.. తనదైన దిశలోనే సాగుతున్నాడు. అగ్రరాజ్యం అమెరికాలోని న్యూజెర్సీలోని పెన్నింగ్టన్‌, వెనుకబడ్డ రాయలసీమలోని కర్నూలు జిల్లా నంద్యాల తాలూకాలోని గని మధ్య చక్కెర్లు కొడుతూ తనదైన రస్తా నిర్మించుకున్న హెచ్చార్కే జ్ఞాత, అజ్ఞాత ముఖాలను పాఠకుల ముందుంచే ప్రయత్నమే ఈ సంభాషణ.

- దేశరాజు, కోడూరి విజయ్‌కుమార్‌


కవిత్వంలో  ‘‘నేను ఈ కొత్త దారిని ప్రవేశపెట్టానూ’’ అని మీరు అనుకునేవి?

నేనైతే ‘‘క్రిటికల్‌ రియలిజం’’ అనేది నాతోనే మొదలయ్యిందీ అనుకుంటాను. అంతవరకూ ఉన్న విప్లవోద్యమాన్ని, జీవితాన్ని క్రిటికల్‌గా చూడటమూ, రియలిస్టిక్‌గా చూడటమూ (రొమాంటిసిజం లేకుండా)... ఇది నా ‘అబద్ధం’ పుస్తకంలోని కవితలతోనే మొదలయ్యిందీ అనుకుంటాను. త్రిపురనేని శ్రీనివాస్‌ ‘రహస్యోద్యమం’కు దీన్ని ఆపాదించటానికి ప్రయత్నించారు. ‘రహస్యోద్యమం’లో చాలా రొమాంటిసిజం ఉంది. అసలు ‘రహస్యోద్యమం’ అంటే ఏమిటి? రహస్యంగా, మనసులో జరిగే ఉద్యమం అని కదా. మనస్సులో జరిగే ఉద్యమం అంటే భావవాదమే కదా. దానికీ తిలక్‌ ‘అమృతం కురిసిన రాత్రి’కీ తేడా ఏమిటి? 


యాభై ఏళ్ల కవిత్వ రచనలో మీరు ఏమి సాధించారనుకుంటున్నారు?

నేను ప్రారంభంలో ఏం సాధించాలనుకున్నానో అది సాధించాను. కొంతమంది స్నేహితుల య్యారు. కవిత్వం రాస్తున్నానని చెప్పినప్పుడు తమ్మినేని పుల్లయ్య అని నా బియ్యెస్సీ ఫ్రెండు ‘‘ఒరే నీలో ఆర్టిస్టున్నాడురా!’’ అని మెచ్చుకుంటే సంతోషం వేసింది. బిఎస్సీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా జ్యోతిలో ఒక పొయెమ్‌ వచ్చింది, ‘జీవితం, కాయితం’ అన్నది దాని హెడింగ్‌. పుల్లయ్య మెచ్చు కున్నది దాన్ని. ఈ మెచ్చికోళ్లే నేను సాధించింది.


ఈ ప్రయాణంలో మీ కవిత్వం ఎలా పరిణామం చెందింది? 

నా కవిత్వం నిర్దిష్టత నుంచి అనిర్దిష్టత వైపు ఎక్కువ జరిగింది అనుకుంటాను. కవిత్వంలో నేరుగా కనపడి చెప్పడం కాకుండా, off-the-camera చెప్పడం అలవాటైంది. 


అంటే నినాదంలా కాకుండా అనా?

అవును. అయితే ఆ తర్వాత కూడా నినాదం అంటే నాకేమీ చెడు అభిప్రాయం లేదు. కొన్ని నినాదాలు గొప్ప కవిత్వాలనుకుంటాను. ‘జీనా హై తో మర్‌నా సీఖో’ అన్నది గొప్ప కవిత అనుకుంటాను. కాబట్టి కవిత్వంలో ఆ డైరెక్ట్‌నెస్‌ తప్పని అనుకోవటం లేదు. కానీ నాలోనే ఆ మార్పు జరిగింది. దానికి కారణం ఈస్థటిక్స్‌ కాదు, పాలిటిక్సే. 


మీ కవిత్వంపై ప్రభావాల గురించి చెప్పండి?

మా వూరు, రాయలసీమ, నా మీది పెద్ద ప్రభావం. మా మద్దిలేటి వాగు అంటే నాకు విపరీతమైన ప్రేమ. ఆ వాగులో ఇసుకన్నా విపరీతమైన ప్రేమ. నా బాల్యం మీద మాత్రం నాకు ప్రేమ లేదు. నాకు నా ‘మాల్గుడీ డేస్‌’ లేవు అనుకుంటూ ఉంటాను. అందుకే నా ‘అబద్ధం’ కవితా సంపుటిలో నా ‘‘భాస్కరశతకోత్పలమాలావృత భయంకర బాల్య సశేషాన్ని చెబుతున్నాను నేను’’ అని రాశాను. బాల్యం కాకుండా మిగిలిందే కదా మన జీవితం. కానీ ఆ మద్దిలేటి వాగన్నా, ఇసుకన్నా.. అది మటుకు ఇష్టం నాకు. అక్కడ నిజమైన స్నేహితులు దొరికారు నాకు. ఆ తర్వాత చాలా హిపోక్రసీని చూశాను నేను. అక్కడ ఆ స్నేహితుల్లో అది కనపడేది కాదు. ఇక కవిత్వ ప్రభావాల విషయానికొస్తే--ఫస్ట్‌ అండ్‌ ఫోర్‌మోస్ట్‌--శ్రీశ్రీ. ఆయన చెప్పే పద్ధతి, ఆయనలోని ‘రా’నెస్‌ నాకు చాలా ఇష్టం. తిలక్‌ వెల్‌కట్‌ డైమండ్‌ అయితే, శ్రీశ్రీ అన్‌కట్‌ డైమండ్‌. శ్రీశ్రీ ఇన్‌ఫ్లుయెన్స్‌ నా మీద రెండు రకాలుగా ఉంది. మొదట ఇష్టం వల్ల కలిగిన ఇన్‌ఫ్లుయెన్స్‌ అయితే, రెండోది ఆయన్నించి దూరం జరిగే ప్రయత్నం ద్వారా కలిగిన ఇన్‌ఫ్లుయెన్స్‌. ఇంకా నా సీనియర్‌ పొయెట్స్‌లో నగ్నముని నాకు ఇష్టం. ‘సర్‌ప్రైజ్‌ ఎలిమెంట్‌’ నగ్నమునిలో భలే ఉంటుంది. మొదటి చరణంలో చెప్పిందాన్ని నిషేధిస్తున్నట్టుగా (నిషిద్ధాక్షరిలా) రెండో చరణం ఉంటుంది. ఆ ఎలిమెంట్‌ ఆఫ్‌ సర్‌ప్రైజ్‌ లేకుండా మంచి కళ ఉండదనేది నా అభిప్రాయం. 


మీకు కమ్యూనిస్టు రాజకీయాలతో పరిచయం ఎలా జరిగింది?

లయోలా కాలేజ్‌లో ఉండగా చండ్ర పుల్లారెడ్డి దగ్గరకు వెళ్ళి కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తానని అడిగాను. ఆయన నిరుత్సాహపరిచాడు. అప్పుడే వాళ్ళు సిపిఎం నుంచి బైటకు వస్తున్నారు. అది కారణం కావొచ్చు. తరువాత ఆయనే నన్ను పాలిటిక్స్‌లో దింపాడు. ఎమ్మే కాగానే మా వూళ్ళో నాకు తెలిసిన పేద పిల్లలందరితోనూ ఒక రైతు కూలీ సంఘం పెట్టాను. భలే గడిచింది మాకు. గద్దర్‌ పాటలూ, వంగపండు పాటలూ... ఏవంటే అవి పాడుకునేవాళ్ళం. జల్ల మీద ఒక పెట్రోమాక్స్‌ లైటు పెట్టి ‘‘మల్లిగాడ్ని నేను.. దొర జీత గాణ్ణి నేను...’’ అని ఎగురుకుంటూ పాడి, ‘‘కామ్రేడ్స్‌’’ అని ఉపన్యాసం ఇచ్చి, విప్లవ రాజకీయాల గురించి చెప్పి వచ్చేవాళ్లం. సంఘం పెట్టాకా మాకు అనిపించింది--మన ఊరికి మాత్రమే సంఘం ఉంటే సరిపోదు కదా, ఇది కాదు మనం చేయాల్సింది అనిపించింది. అలా ఏదన్నా కమ్యూనిస్టు పార్టీలో చేరాలనుకున్నాం. అప్పుడు తరిమెల నాగిరెడ్డి గ్రూపు నుంచి మండ్ల సుబ్బారెడ్డిని మా ఊరికి పిలిపించుకున్నాం. ఆయన మాట్లాడుతూ చెప్పిన రాజకీయాలకన్నా హ్యూమన్‌ రిలేషన్స్‌ విషయంలో ఆయన అభిప్రాయాలు అసహ్యంగా అనిపించాయి. రాధక్కకు, చండ్రపుల్లారెడ్డికి సంబంధాల వల్ల పార్టీ చెడిపోయింద న్నాడు. ఇక అదేం కమ్యూనిస్ట్‌ పార్టీ అనుకున్నాను. వర్గ శత్రు నిర్మూలన అనేదాన్ని నేనెప్పుడూ సమర్థించలేదు. ఒక భూ స్వామిని చంపితే మిగతా భూస్వాములు పారిపోతారు, ఊరు మనదై పోతుంది. అది కదా చారుమజుందార్‌ చెప్పిన వర్గ శత్రు నిర్మూలన సారాంశం. ఎమ్మే రెండేళ్ళలో...చదువుతున్నప్పుడు విరసంలో పని చేశాను కదా, అప్పుడు కూడా ఆ విషయంలో విభేదించాను. 


సాయుధ వర్గ పంథా మీద కూడా మీ అభిప్రాయం ఈ మధ్య మారినట్టుంది?

ఈ మధ్య ఏమీ మారలేదు. 1986 నాటికే మారింది. అది మారగానే నేను పార్టీ వదిలేశాను.


కారణం?

ఒకటి ఎక్స్‌పీరియన్స్‌. అప్పటికే 12ఏళ్ళు పని చేశాను. నా పనీ, నా ఆలోచన కలిసి పని చేసే చోట నేను ఉన్నాను, ‘విమోచన’ ఎడిటర్‌గా. నాకు ఒకటి అర్థమైంది: ఏ ఎమ్‌.ఎల్‌ పార్టీ విప్లవాన్ని గెలవలేదని. ఎందుకూ అన్నది నేను నా రాజీనామా పత్రంలో కూడా రాశాను. సైనిక యంత్రాంగాన్ని తట్టుకొనేంత బలంతో వీరు సైన్యాన్ని నిర్మించటం అనేది అసాధ్యం. ఎన్నాళ్ళు చేసినా గెరిల్లా పోరాటం చేయాల్సిందే. స్టాండింగ్‌ ఆర్మీ తయారు అసాధ్యమైనప్పుడు దాన్నిక సాయుధ పోరాట మనకూడదూ అన్నది నా

అభిప్రాయం. 


మీ అభిప్రాయంలో ఈ మార్పుకి పర్టిక్యులర్‌ సంఘటనలేమైనా కారణమా?

నేను పార్టీ నుంచి బైటికి రావటానికి ముందు ఉద్యమం స్టిల్‌ వాటర్స్‌లా వుంది. ఏం జరగాలో, ఎంత ఎత్తుకు ఎదగాలో అంతా ఎదిగింది ఉద్యమం. ఇక తర్వాత ఏంటన్నది తెలీని పరిస్థితి. ఆ ప్రతిష్టంభన కారణంగా ఎమ్‌.ఎల్‌ గ్రూపులు మధ్య ఒకరినొకరు చంపుకోవటం పెరిగింది. బాబన్న అనే అంధుణ్ణి చంపారు. ఇలాంటి ‘‘భ్రాతృ హత్యలు’’ ఇంకా కొన్ని జరిగాయి. అప్పుడే ‘‘ఇదే అదను భ్రాతృ హత్యల కథను రచించెదను నేను’’ అని రాశాను నా ‘అబద్ధం’లో.


‘అబద్ధం’ కవితా సంపుటికి ముందు వచ్చిన ‘గుండె దండోరా’, ‘రస్తా’, ‘లావా’ల్లోని కవిత్వంతో పోలిస్తే, ‘అబద్ధం’లోని కవిత్వం భిన్నంగా ఉంటుంది. దీని గురించి చెప్పండి?

‘అబద్ధం’కు ముందు ఉన్న పుస్తకాల ఫార్మ్‌లో లిరిసిజం ఎక్కువ. ‘అబద్ధం’ మాత్రం ఆ తర్వాతి నా జీవితానికి ఒక మేనిఫెస్టోలాంటిది. అసలు అంతకుముందు ఉన్నదాన్ని తిరస్కరిస్తూనే ‘అబద్ధం’ అన్న పేరు పెట్టాను. అంతకుముందుదంతా తప్పు అని చెప్పాను, చేతనైన మట్టుకు. అయితే ‘అబద్ధా’నికి ఇంకో అర్థం కూడా అనుకున్నాను. ‘భ్రాంతి’ (ఇల్యూజన్‌?) అని. అసలు కవిత్వమంతా భ్రాంతేనని. అలాగే ‘అబద్ధం’ సమయానికి పోస్ట్‌ మోడర్న్‌ టెండెన్సీస్‌ నాలో వచ్చాయి. 


తెలుగులో అప్పటికే పోస్ట్‌ మోడర్న్‌ భావనలు వచ్చాయని మీరు అనుకున్నారా? 

మీరు ‘‘తెలుగులో పోస్ట్‌ మోడ్రర్న్‌ భావనలు వచ్చాయా’’ అని అడుగుతున్నప్పుడు మోడర్న్‌ - పోస్ట్‌ మోడర్న్‌ అన్నవాటిని పీరియడ్స్‌గా తీసుకుని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నవి వేరు. దళిత్‌మూమెంట్‌ అన్నది మోడర్నిజంలో కుదరదు. ముక్కల ముక్కల జీవితం, ఫ్రాగ్మెంటేషన్‌... ఇది మోడర్నిజంలో కుదరదు. 


ఈ ఫ్రాగ్మెంటేషన్‌ జరగటం వల్ల (దళిత, స్త్రీ, మైనారిటీ వాదాలు రావటం వల్ల) రాజ్యానికి ఒక బలమైన ప్రత్యామ్నాయం లేకుండాపోయిందని అనుకుంటున్నారా? 

ఈ వర్గాలన్నీ ఫ్రాగ్మెంటేషన్‌ జరగటం వల్లనే బతికాయి. లేకపోతే మనకు నారాయణలు, రాఘవులు, తమ్మినేని వీరభద్రాలూ వీళ్ళే కమ్యూనిస్టులుగా మిగిలేవారు. వీళ్ళు కమ్యూనిస్టులు కాదని ఇప్పటికే అర్థమైంది కదా. కమ్యూనిజం ఏమన్నా మిగిలిందంటే దళిత వాదులలోంచి మిగిలింది.


మీరు ఇటీవల సాయుధ పోరాటాలకు- ప్రజా ఉద్యమాలు, రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలపటం వంటివి ప్రత్యామ్నాయమన్నట్టుగా ఫేస్‌బుక్‌లో రాస్తున్నారు. ఆయుధాలతో నిలబడేవారే రాజ్యం ముందు నిలబడలేనప్పుడు, ఇలా ప్రజల్లోంచి వచ్చే డెమాక్రటిక్‌ నిరసనలు నిలబడి గెలవగలవా? 

అవును, ఇవే గెలుస్తాయి. అవి గెలవ లేవు. ఎందుకంటే ఈ నిరసనల్లో ప్రజలున్నారు, సాయుధ పోరాటంలో ప్రజలు లేరు. 


ప్రజల మద్దతు లేదంటారా? అలాగే ఆ బస్తర్‌ లాంటి చోట్ల నిజంగా వారు సాయుధ పోరాటం గాక డెమాక్రటిక్‌గా ప్రజా నిరసనలు జరిపి ఉంటే మార్పు వచ్చేదంటారా?

ముందు సాయుధ పోరాటం అనే ఐడియా అసలు ఎక్కడ బయల్దేరిందో, ఇప్పుడు ఈ బస్తర్‌లాంటి చోట్ల ఏ పర్యవసానాన్ని చేరిందో మనం గమనించాలి. మా పార్టీ అసలు ప్రణాళిక ఏమిటో చెప్తాను. గోదావరి లోయలో బత్తుల వెంకటేశ్వరరావు, చండ్ర పుల్లారెడ్డి వీళ్ళందరూ వెళ్ళి సాయుధ పోరాటం స్టార్ట్‌ చేయాలనుకున్నారు. సాయుధ పోరాటానికి ఒక బారికేడ్‌ కావాలి. అది అడవిలోనే సాధ్యం. కాబట్టి అడవిలో ఉన్న ప్రజల్లో పని చేయాలి. అందుకు అడవి ప్రజల మన్నన పొందాలి. కాబట్టి తునికాకు పోరాటం మొదలైన పోరాటాలు చేశారు. ఇక తర్వాత దళాలు నిర్మించాలి. ఎందుకూ? పోలీసులు దాడులు చేస్తే కాచుకోవటానికి. అంటే మన ఆత్మరక్షణ కోసం సాయుధ దళాలు తయారయ్యాయి. ఆదివాసుల కోసం కాదు. వాళ్ళు కూడా అందులో భాగం కావొచ్చు కానీ, కేవలం వాళ్ళ కోసమే కాదు. ఈ ఆత్మరక్షణ దళాలు క్రమంగా గెరిల్లా స్క్వాడ్స్‌ అవుతాయనీ, ఆ గెరిల్లా స్క్వాడ్స్‌ రెగ్యులర్‌ ఆర్మీ అవుతాయనీ, తర్వాత ఆ ప్రాంతం లిబరేటెడ్‌ ప్రాంతం అవుతుందనీ... ఇదీ పొలిటికల్‌ స్ర్టాటజీ. అయితే ఇక్కడ ఒక విషయం: ఏ కమ్యూనిస్ట్‌ పార్టీ అయినా ఫ్యూడలిజం మీద యుద్ధం చేయటానికైతే రైతుల్లో పని చేయాలి, కాపిటలిజం మీద యుద్ధం చేయటానికైతే కార్మికుల్లో పని చేయాలి. కానీ ఆదివాసీల్లో మాత్రమే పని చేయటమేమిటి? ఆదివాసులు కనీసం రైతులు కూడా కాదు. కార్మిక వర్గ మనస్తత్వం వాళ్ళకు ఉండే అవ కాశమే లేదు. ఈ ఆదివాసులు పెట్టుబడిదారీ వ్యవస్థపై ఎట్లా యుద్ధం చేస్తారు. పెట్టుబడిదారీ విధానం ఉన్నది హైదరాబాద్‌లో, కర్నూల్‌లో. అంతేకానీ బస్తర్‌లో కాదు, అడవుల్లో కాదు. ఇది కృత్రిమం అని నేనంటున్నాను. నువ్వు సాయుధుడివై నిలబడవచ్చు, దాన్ని సాయుధ పోరాటం అనదల్చుకుంటే అనుకోవచ్చు, కాని దాని లక్ష్యమైతే పెట్టు బడిదారీ విధానాన్ని కూలదోయడం కాదు. అక్కడ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్నదల్లా ఏమిటంటే, పసిపిల్లలకు చదువు లేకుండా చేస్తున్నది, రోడ్లు లేకుండా చేస్తున్నది. అసలు ఈ పోరాటం మన ప్రయోజనాలకోసమా, ఆదివాసుల ప్రయోజనాలకోసమా? నేను సాయుధ పోరాటాన్ని కాదుగానీ, రివల్యూషన్‌ను ప్రేమిస్తాను. రివల్యూషన్‌ తప్పు కాదు, కానీ దాన్ని ఎట్లా చేద్దామనేది చర్చ చేయాలి.


ఆలస్యంగా కథలు రాయటం మొదలుపెట్టారు కదా, అసలు కథలు రాయాలని ఎందుకనుకున్నారు?

నేను కథగా ఏం చెప్పానో, అది కవిత్వంలో చెప్పలేను. అందుకే కథ. కథ రాస్తూ అందులో కవిత్వం చొప్పించేవాళ్ళ మీద నాకు తక్కువ చూపు ఉంది. ఆ రాసేదేదో కవిత్వమే రాయచ్చు కదా అంటాను. నా కథల్లో ఏది చదివినా నన్ను కవి అని అనుకోరు. 


తొలి దశలో రాసే రచనలే బావుంటాయి, తర్వాత రాసే వాటిలో అంత ఫైర్‌ ఉండదూ అంటారు విమర్శకులు. ఒప్పుకుంటారా?

ఒప్పుకుంటాను. తొలిదశలో ఉన్న స్పాంటేనిటీ ఆ తర్వాత క్రాఫ్ట్‌ కింద మారిపోతుంది. కవిత్వం అంటే ఏంటో తెలిసిపోయినవాడు ఇక craftsmanగా మిగులుతాడు. కానీ మొదట్లో అలా కాదు. అప్పుడు కవిత్వం రాద్దామని కూచుని రాయడు. ఏమో అనిపించి ఏదో రాస్తే అది కవిత్వమై పోతుంది. రాన్రానూ ఆ స్పాంటేనిటీ పోతుంది. స్పాంటేనిటీ కోసం ఎదురుచూడటం మానేసి, ‘‘ఈ మధ్య కవిత రాసి చాన్నాళ్ళయింది ఒకటి రాద్దాం’’ అని రాసే ప్రమాదముంది తలపండిన కొద్దీ. 

    

పనిగట్టుకొని కవిత్వం రాయటం తప్పంటారు?

పనిగట్టుకొని కవిత్వం రాయటం తప్పే. కానీ పనిగట్టుకొని కవిగా ఉండటంలో తప్పులేదు. ఉండాలి కూడా. కవిగా ఉంటం కోసం ఏం చేయాలో అది చేయాలి. అంటే సంపాదన, పిల్లల్ని కనడం, పోషణ... ఇదే ధ్యేయమైన ప్రొజాయిక్‌ లైఫ్‌లో పడకూడదు కవి. మహాప్రస్థానం ముందుమాటలో చలం అంటాడే, ‘‘వట్టిపోని ఆవు, ఏటా పాసయ్యే కొడుకూ, అణగారిన పెళ్ళాం...’’ అని, ఇలాంటి జీవితంలో పడకుండా చూసుకోవాలి కవి. 


హెచ్చార్కె పురస్కారాలకు దూరంగా ఉన్నాడా, పురస్కారాలే హెచ్చార్కేను దూరం ఉంచాయా?

పురస్కారాలే హెచ్చార్కేని దూరంగా ఉంచాయి. నేనైతే నాకు ఫ్రీవర్స్‌ ఫ్రంట్‌ అవార్డు రావాలని కోరుకున్నాను. ఒక సామెత ఉంది: యథార్థవాది లోకవిరోధి అని. ఎప్పుడు ఏది నిజమనుకుంటే అది మాట్లాడుతూ వచ్చాను. మీరు చెబుతోన్న ఆ గుర్తింపులూ, పేరూ రాకపోవటానికి కారణం అదీ అనుకుంటున్నాను. నేను కమ్యూనిస్టు పార్టీలోకి వెళ్ళటానికీ, నేను కమ్యూనిస్టు పార్టీనుంచి బైటకి వచ్చేయటానికీ కూడా ఇదే కారణం. 


కవులు పాలకుల పక్షం వహించటం ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది?

ప్రతి ఒక్కరికీ కెరీర్‌ కావాలి. నాకూ గుర్తింపు కావాలి. తప్పులేదు. కానీ కెరీర్‌ కోసం ఏదైనా చేయటం వేరు. ఉదాహరణకి: పాలకుల పాదాక్రాంతం కావడం. దేన్ని నువ్వు సమర్థించలేవో దాన్ని సమర్థించాల్సిన దుర్గతిలోకి నిన్ను నువ్వు నెట్టుకోవడం. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరిగిన సందర్భాన్నే తీసుకుందాం. మీరిద్దరూ కవులుగా సమ్మెని సమర్థించి ఉంటారు. ఎందుకంటే దేశరాజుకీ, కోడూరి విజయకుమార్‌కీ stakes లేవు. మీరు సమ్మెని సమర్థించినా మీకు పోయేదేమీ లేదు. కానీ సమర్థిస్తే పోయేదేదో ఉన్నవాళ్ళు ఇక్కడ పెరిగారా లేదా? అదీ నేనంటున్నది. ఆ స్థితిలోకి ఒక కవి తనని తాను నెట్టుకోవడం నీచమైన కెరీరిజం. 


ఆమధ్య కవిత్వం ఎన్నాళ్ళు మన్నుతుంది... అన్న చర్చ జరిగింది. దాని మీద మీ అభిప్రాయం?

ఒకటి మాత్రం వాస్తవం: రాబోయే కాలం వచనానిదే. ఎందుకంటే, రొమాంటిసిజం ఎప్పుడు ఉంటుందంటే-- మన చుట్టూవున్న స్థితి ఘోరంగా ఉన్నప్పుడే. మన చుట్టూ స్థితి బాలేనప్పుడే మనం మతాన్ని సృష్టించుకున్నాం, కవిత్వాన్ని సృష్టించుకుంటాం. ఈ స్థితి కొంచెం జీవన యోగ్యంగా అయ్యేకొద్దీ, మనకు రొమాంటిసిజం అవసరం తీరిపోతుంది. అవసరం తీరిపోయే కొద్దీ ఇక మనం మామూలుగానే ఉంటాం, ప్రోజ్‌గా ఉంటాం. అందుకే భవిష్యత్తు వచనానిదే అంటాను. అలాగంటే, పొయెట్రీ పోతుందని మాత్రం కాదు. ప్రోజ్‌ పొయెట్రీ వుంటుంది. పనిగట్టుకొని కవిత్వం రాయటం తప్పే. కానీ పనిగట్టుకొని కవిగా ఉండటంలో తప్పు లేదు. ఉండాలి కూడా. కవిగా ఉంటం కోసం ఏం చేయాలో అది చేయాలి. అంటే సంపాదన, పిల్లల్ని కనడం, పోషణ... ఇదే ధ్యేయమైన ప్రొజాయిక్‌ లైఫ్‌లో పడకూడదు కవి. మహాప్రస్థానం ముందుమాటలో చలం అంటాడే, ‘‘వట్టిపోని ఆవు, ఏటా పాసయ్యే కొడుకూ, అణగారిన పెళ్ళాం...’’ అని, ఇలాంటి జీవితంలో పడకుండా చూసుకోవాలి కవి. 
ఇంటర్వ్యూ: దేశరాజు, కోడూరి విజయ్‌ కుమార్‌

Advertisement
Advertisement
Advertisement