ధర్మయాత్రే కాని దండయాత్ర కాదు

ABN , First Publish Date - 2022-10-04T06:05:58+05:30 IST

జగన్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర ప్రారంభించారు...

ధర్మయాత్రే కాని దండయాత్ర కాదు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర ప్రారంభించారు. గత నెల 12న ప్రారంభమైన ఈ మహాపాదయాత్ర శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా, ఎవరు ఏ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా పట్టించుకోకుండా శాంతియుతంగా సాగుతోంది. అయితే దీనిపై అక్కసు వెళ్ళగక్కుతున్న వారికి అమరావతి రైతుల తరఫున వాస్తవ పరిస్థితులను విశదపరచాల్సిన అవసరం ఉంది.


గత నాలుగున్నర సంవత్సరాలలో అమరావతి రైతుల మీద చిమ్మినంత విషం, బహుశా చరిత్రలో మరే ప్రాంతం వారి మీద ఎవరూ వెళ్లగక్కి ఉండరు. కులం ముద్ర వేయడంతో పాటు శ్మశానం, ఎడారి లాంటి పదాలతో మంత్రులే అమరావతి ప్రాంతాన్ని హీనపరిచే వ్యాఖ్యలు చేశారు. అయితే మేధావులుగా చలామణి అవుతున్న అనేకమంది అమరావతిపై అదే విధమైన అక్కసు వెళ్లగక్కటం శోచనీయం. ఈ బుద్ధిజీవులు పాలనా వికేంద్రీకరణను మూడు రాజధానులతో ఏ విధంగా పొంతన పెడతారో ఎవరికీ అర్థం కాని విషయం. జిల్లాలు, మండలాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల వారీగా స్థానిక సంస్థలను బలోపేతం చేసుకుంటూ వాటికి తగినన్ని అధికారాలు బదలాయించడమే పరిపాలనా వికేంద్రీకరణ అని ఏ కాస్త చదువుకున్నవాడిని అడిగినా చెబుతాడు. మరి ఈ మేధావులేమో తమ వ్యాసరాజాల్లో వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు పాలనా వికేంద్రీకరణకు ఉదాహరణలుగా పేర్కొన్నారు!


రాజకీయ నాయకులతో పాటు ఈ మేధావులు కూడా అమరావతి రైతుల పాదయాత్రను దండయాత్రగా అభివర్ణించడం చాలా గర్హనీయం. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు; రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు; రైతులంతా ఒకే కులం వారు అన్నారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు. వారంతా ఆరుగాలం శ్రమించే రైతులే అని, అందునా ఎక్కువమంది దళితులు, బీసీలు ఉన్నారని, వారే ఎక్కువ భూమిని భూసమీకరణకు ఇచ్చారనే విషయాన్ని సమగ్ర ఆధారాలతో రాష్ట్ర ప్రజలందరికీ దృష్టికి తీసుకువస్తూనే ఉన్నాం. అయినా వాస్తవాల్ని అంగీకరించలేని వారు మాత్రమే ఇప్పటికీ అవే వాదనలని, అవే అబద్ధాలని ప్రచారం చేస్తూనే ఉన్నారు. ప్రజలందరూ గమనించాల్సిన అంశం ఏమిటంటే అమరావతి రైతులు ఒక ఎకరం భూమి అంటే సుమారు 4,800 గజాలు ప్రభుత్వానికి ఇచ్చి, తిరిగి 1250 లేదంటే 1450 గజాలు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మిగిలిన భూమి అంతా ఎవరిది ప్రభుత్వానిది కాదా? ప్రభుత్వానిది అంటే ప్రజలది కాదా? దీన్ని త్యాగం అనరా? ఇక్కడ జరిగే అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిలో భాగం కాదా? రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాలలో అభివృద్ధి వికేంద్రీకరణ పూర్తిస్థాయిలో జరగాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కొంత పని చేసిందనేది మనం పూర్తిగా మర్చిపోయాం. విశాఖ, తిరుపతి, అనంతపురం, కడప, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం తదితర ప్రాంతాలలో స్థానికంగా అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ అభివృద్ధి దిశగా కొన్ని అడుగులు పడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం ఆ అభివృద్ధికి కొనసాగింపుగా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, ప్రాంతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అమరావతి రైతులపై ఎదురుదాడి చేస్తున్న, మూడు రాజధానుల అసంబద్ధ వాదాన్ని సమర్థిస్తున్న వారందరికీ ఒకటే ప్రశ్న- గత మూడున్నర ఏళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడెక్కడ ఏ విధమైన అభివృద్ధి పనులు జరిగాయో, నిరుద్యోగులు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో, ఎన్ని పరిశ్రమలు స్థాపించబడ్డాయో ఆధారాలతో నిరూపించగల సత్తా ఎవరికైనా ఉందా? 


మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ రద్దుచేసి ఎన్నికలకు వెళదామని, మీరు గెలిస్తే మీకు కావలసిన చోట రాజధానిని పెట్టుకోవచ్చని కొందరు సవాల్ చేస్తున్నారు. ఇది చాలా తప్పుడు అవగాహనతో కూడిన వాదన. ఒకసారి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాజధానిని మార్చడం సాధ్యం కాదని న్యాయస్థానం ఇప్పటికే తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పు వెలువడిన ఆరు నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే తెలియనప్పటికీ, ఇప్పటికే వెలువడిన హైకోర్టు తీర్పు మాత్రం రాజధానిని అమరావతి ప్రాంతం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కదల్చడం సాధ్యం కాదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ మా విన్నపమిది: ప్రభుత్వం చేస్తున్న విష ప్రచారాలను పక్కనపెట్టి అమరావతి ప్రాంతానికి రండి. రాజధాని రైతుల కష్టాలను పరిశీలించండి. వారికి మద్దతు పలకండి. కేవలం ఈ అంశాలను ప్రజలలోకి తీసుకెళ్ళేందుకే అమరావతి రైతులు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. అది ధర్మయాత్రే కాని దండయాత్ర కానే కాదని అర్థం చేసుకోండి.

బండ్ల సూరిబాబు

Updated Date - 2022-10-04T06:05:58+05:30 IST