ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల భవితవ్యంపై సుప్రీంకోర్టులో పిల్

ABN , First Publish Date - 2022-03-14T01:39:07+05:30 IST

ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు భారత దేశంలో

ఉక్రెయిన్ వైద్య విద్యార్థుల భవితవ్యంపై సుప్రీంకోర్టులో పిల్

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకు భారత దేశంలో తమ చదువును కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. భారత దేశ పాఠ్య ప్రణాళికలో వీరికి ప్రవేశం కల్పించేందుకు వీలుగా మెడికల్ సబ్జెక్ట్ ఈక్వివాలెన్సీ ఓరియెంటేషన్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ పిల్ కోరింది. 


న్యాయవాది రాణా సందీప్ బుస్సా, తదితరులు ఈ పిల్‌ను దాఖలు చేశారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులను భారత దేశంలోని కళాశాలల్లో చదువును కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో కొన్ని పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇదే విజ్ఞప్తితో ప్రవాసీ లీగల్ సెల్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 


ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరంతా ఆర్థికంగా నష్టపోవడంతోపాటు, తమ చదువు కొనసాగడంపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 


Updated Date - 2022-03-14T01:39:07+05:30 IST