Taj Mahal Controversy: తాజ్ మహల్ అసలు చరిత్రపై సుప్రీంకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2022-10-01T21:57:39+05:30 IST

తాజ్ మహల్ (Taj Mahal) అసలు చరిత్రపై అధ్యయనానికి

Taj Mahal Controversy: తాజ్ మహల్ అసలు చరిత్రపై సుప్రీంకోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ : తాజ్ మహల్ (Taj Mahal) అసలు చరిత్రపై అధ్యయనానికి ఓ నిజ నిర్థరణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీని చరిత్ర గురించి స్పష్టత ఇచ్చి, వివాదాలకు తెర దించాలని కోరింది. దీనిని షాజహాన్ నిర్మించినట్లు చెప్తున్నప్పటికీ శాస్త్రీయ ఆధారాలేవీ లేవని పేర్కొంది. 


తాజ్ మహల్ అసలు చరిత్రను నిర్థరించాలని కోరుతూ డాక్టర్ రజనీష్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇదే అభ్యర్థనతో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు మే 12న తోసిపుచ్చింది. అడ్వకేట్ సమీర్ శ్రీవాస్తవ ద్వారా ఈ పిటిషన్‌ దాఖలైంది. 


పిటిషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం, పిటిషనర్ గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కి సమాచార హక్కు దరఖాస్తు చేశారు.  దీనికి ఎన్‌సీఈఆర్‌టీ బదులిస్తూ, మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య కోసం తాజ్ మహల్‌ను నిర్మించినట్లు ప్రాథమిక ఆధారాలు అందుబాటులో లేవని తెలిపింది. అదేవిధంగా పిటిషనర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేశారు. ఈ సంస్థ కూడా ఆయనకు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. 


మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం తాజ్ మహల్‌ను 1631 నుంచి 1653 వరకు 22 ఏళ్ళపాటు నిర్మించినట్లు చెప్తున్నప్పటికీ, అందుకు తగిన శాస్త్రీయ సాక్ష్యాధారాలు లేవని పిటిషనర్ ఆరోపించారు. 


మొఘల్ దురాక్రమణదారులు, దండయాత్ర చేసినవారు నిర్మించిన కట్టడాలను చారిత్రక కట్టడాలుగా ప్రకటించడాన్ని పిటిషనర్ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. 


Updated Date - 2022-10-01T21:57:39+05:30 IST