బెంగళూరు : పాట్నా నుంచి బెంగళూరు వచ్చిన ఇండిగో విమానంలో ఇద్దరు ప్రయాణికుల లగేజీ బ్యాగులు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఆ ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. కస్టమర్ కేర్ నుంచి సరైన సహకారం అందకపోవడంతో ఆ ఇద్దరిలో ఒకరు తన సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించి, తన బ్యాగును తాను పొందగలగడంతోపాటు, ఇండిగోకు మంచి సలహాలు కూడా ఇచ్చారు. ఇటువంటి అసౌకర్యం కలిగినందుకు ఎయిర్‌లైన్స్ విచారం వ్యక్తం చేస్తూ, లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చింది.
సాఫ్ట్వేర్ ఇంజినీరు నందన్ కుమార్ ట్విటర్ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆయన మార్చి 27న ఇండిగో 6ఈ-185 విమానంలో పాట్నా నుంచి బెంగళూరు వెళ్ళారు. ఆయన లగేజీని పొరపాటున సహ ప్రయాణికుడు తీసుకెళ్ళారు. సహ ప్రయాణికుడి లగేజీని నందన్ తీసుకొచ్చారు. ఈ విధంగా బ్యాగులు మారడంలో ఇరువురి పొరపాటు లేదు. ఆ రెండు బ్యాగులు దాదాపు ఒకే విధంగా ఉండటంతో ఇలా జరిగింది.
ఇంటికి వెళ్ళిన తర్వాత నందన్ కుమార్ భార్య ఆ బ్యాగును బాగా పరిశీలించి, ఇది మన బ్యాగు కాదని చెప్పారు. మనం తాళం కప్పలను వాడం కదా? అన్నారు. దీంతో జరిగిన పొరపాటును గుర్తించారు. అనంతరం ఆయన ఇండిగో కస్టమర్ కేర్‌ను సంప్రదించారు. ఒక రోజు వేచి చూసినప్పటికీ కస్టమర్ కేర్ నుంచి సరైన సమాధానం రాలేదు. తన బ్యాగును పట్టుకెళ్లిన వ్యక్తికి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ముందుకు రాలేదు. వ్యక్తిగత గోప్యత, డేటా ప్రొటెక్షన్ అంటూ సాకులు చెప్పారు. ఆ మర్నాడు కూడా కస్టమర్ కేర్ నుంచి ఫోన్ రాలేదు. అయితే ఏజెంట్ మాత్రం ఓ హామీ ఇచ్చారు. ఆ బ్యాగును పట్టుకెళ్ళిన వ్యక్తి సమాచారం దొరికిన వెంటనే ఫోన్ చేస్తామని చెప్పారు. ఎంతకీ ఫోన్ రాకపోవడంతో నందన్ కుమార్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు.
@IndiGo6E websiteను తెరిచి F12 buttonను నొక్కి, చెక్-ఇన్ ఫ్లోను, నెట్వర్క్ లాగ్ రికార్డును చూశారు, కావలసిన సమాచారం సేకరించారు. తన బ్యాగును పట్టుకెళ్ళిన సహ ప్రయాణికుడి పీఎన్ఆర్ నంబరు తాను తీసుకొచ్చిన బ్యాగుపై ఉండటంతో దాని ఆధారంగా కొంత ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఆ సహ ప్రయాణికుడి సమాచారం, ఫోన్ నంబరు తెలుసుకున్నారు. అదృష్టవశాత్తూ వీరిద్దరూ దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. తాను తీసుకొచ్చిన బ్యాగును ఆయనకు ఇచ్చేసి, తన బ్యాగును తాను తిరిగి తీసుకున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కూడా కొన్ని సూచనలు చేశారు. IVRను ఫిక్స్ చేసుకోవాలని, మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని తెలిపారు. కస్టమర్ కేర్ సేవలు చురుగ్గా ఉండేలా చూడాలని, రియాక్టివ్‌గా ఉండేలా చేయవద్దని చెప్పారు. సున్నితమైన సమాచారాన్ని ఈ వెబ్సైట్ లీక్ చేస్తోందని, దీనిని సరిదిద్దాలని సూచించారు.
దీనిపై ఇండిగో స్పందిస్తూ, నందన్ కుమార్‌కు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. సెక్యూరిటీ లోపాలు లేకుండా జాగ్రత్తవహిస్తామని హామీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి