పాఠశాల పాఠ్యాంశాల్లో వేద విజ్ఞానాన్ని చేర్చాలి : పార్లమెంటరీ ప్యానెల్

ABN , First Publish Date - 2021-12-01T00:30:01+05:30 IST

పాఠశాలల్లో బోధించే చరిత్ర పాఠ్యాంశాల్లో భారత దేశ స్వాతంత్ర్య

పాఠశాల పాఠ్యాంశాల్లో వేద విజ్ఞానాన్ని చేర్చాలి : పార్లమెంటరీ ప్యానెల్

న్యూఢిల్లీ : పాఠశాలల్లో బోధించే చరిత్ర పాఠ్యాంశాల్లో భారత దేశ స్వాతంత్ర్య సమర యోధులకు కల్పిస్తున్న ప్రాధాన్యంపై సమీక్షించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. ఈ పాఠ్యాంశాల్లో వేదాలలోని ప్రాచీన విజ్ఞానాన్ని చేర్చాలని తెలిపింది. సిక్కు, మరాఠా చరిత్రను కూడా చేర్చాలని, స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటించాలని తెలిపింది. విద్య, మహిళలు, బాలలు, యువత, క్రీడలపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘానికి బీజేపీ ఎంపీ వినయ్ పి సహస్రబుద్ధే నేతృత్వం వహిస్తున్నారు. 


ప్రముఖ చరిత్రకారులతో చర్చలు, సమీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుల వివరాలను చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాలని సిఫారసు చేసింది. ఇలా చేయడం వల్ల భారత దేశ స్వాతంత్ర్య సంగ్రామం పట్ల సంతులన భావం పెరుగుతుందని చెప్పింది. అంతేకాకుండా ఇంత కాలం మరుగునపడిన యోధులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపింది. ఈ నివేదికను మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 


ఈ కమిటీలో పది మంది రాజ్యసభ సభ్యులు, 21 మంది లోక్‌సభ సభ్యులు  ఉన్నారు. నలుగురు బీజేపీ రాజ్యసభ ఎంపీలు, టీఎంసీ, సీపీఎం, డీఎంకే, ఏఐఏడీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఒక్కొక్క రాజ్యసభ ఎంపీ ఉన్నారు. లోక్‌సభ సభ్యుల్లో 12 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు, టీఎంసీ, సీపీఎం, జేడీయూ, శివసేన, వైకాపా, డీఎంకే, బీజేడీల నుంచి ఒక్కొక్క లోక్‌సభ ఎంపీ ఉన్నారు. 


Updated Date - 2021-12-01T00:30:01+05:30 IST