ఒక రాత్రి గీతం

ABN , First Publish Date - 2022-06-06T05:30:00+05:30 IST

రాత్రి ఆకాశం క్రింది నిశ్శబ్ద మైదానం ఆకాశం నిండా లిపి తొడగని నక్షత్ర రాసుల సంభాషణలు ఇప్పుడేమీ లేదు

ఒక  రాత్రి గీతం

రాత్రి ఆకాశం క్రింది

నిశ్శబ్ద మైదానం


ఆకాశం నిండా లిపి తొడగని

నక్షత్ర రాసుల సంభాషణలు

ఇప్పుడేమీ లేదు


చిరుగాలికి పూల రేకులను రాల్చే చెట్లు

కొమ్మలపై పక్షుల సంగీత కచేరీలు

గాజుకళ్ళ చేపపిల్లలను

తనలో దాచుకున్న నదులు

ఇప్పుడేమీ లేవు


నేనిక్కడ నిలబడి ఉన్నాను

బహుశా ఇక్కడే ఆగిపోయాను


నన్ను దాటిపోయిన

ఒంటరి పగళ్ళని


నన్ను ఉనికిలోకి తీసుకోని

శూన్య సమూహాలనీ


అవకాశవాద అక్షర బానిసల

నెరజాణతనాలని


మనిషి వాసన లేని

కరచాలనాల సమావేశాలని


మానవ భాషలేని 

అసంతృప్త అసందర్భ చర్చలనీ


పత్రికల నిండా పరుచుకుంటున్న

కంపు వాసనల దుర్ఘంధాలని


అన్నింటినీ వెనకే విడిచి వస్తున్నాను

చీకటి వర్ణాలను కనురెప్పలపై

చిత్రిక పడుతున్నాను

ఒక కొత్త వర్ణ దృశ్యమేదో

ఈ నిశ్శబ్ద నేలపైన మొలకెత్తుతుందని 


ఊపిరిసలపని జనసమూహ నగరాలు దాటి

ఇలా ఒంటరి మైదాన భూములపైన

ఒక కొత్త నినాదాన్ని రాసి


నాలుగు దిక్కులా వాక్యాన్ని

పరివ్యాప్తింప చేయాలి

చంద్రుడు ప్రకాశించకముందే

ఈ శీతల రాత్రి పొత్తిళ్ళలో

మనిషిని నిటారు చేసే

ఒక కొత్త పద్యాన్ని పురుడుపోయాలి


చెమన్‌

94403 85563

Updated Date - 2022-06-06T05:30:00+05:30 IST