పేగుల్లో రక్తం గడ్డలు కడుతోంది!

ABN , First Publish Date - 2021-06-03T09:08:27+05:30 IST

గుండె, మెదడు, కాళ్లలో రక్తం గడ్డలు కట్టడం ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ, తాజాగా కొవిడ్‌ రోగుల పేగుల్లో కూడా రక్తం గడ్డలు కడుతోంది! ముంబైలో

పేగుల్లో రక్తం గడ్డలు కడుతోంది!

కొవిడ్‌ రోగుల్లో కొత్త సమస్య 

తీవ్ర కడుపు నొప్పి వస్తే జాగ్రత్త


ముంబై, జూన్‌ 2: గుండె, మెదడు, కాళ్లలో రక్తం గడ్డలు కట్టడం ఇప్పటి వరకు మనకు తెలుసు. కానీ, తాజాగా కొవిడ్‌ రోగుల పేగుల్లో కూడా రక్తం గడ్డలు కడుతోంది! ముంబైలో ఇటువంటి కేసులు పదుల సంఖ్యలో వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. కడుపులో భరించలేనంత నొప్పి వచ్చినప్పుడు జాగ్రత్త పడాల్సిందేనని, తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో పనిచేసే సునీల్‌ గవాలీ (59)కి ఓ రోజు మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత హఠాత్తుగా కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆయన రెండు డోసులు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కూడా తీసుకున్నారు. ఎలాంటి కొవిడ్‌ లక్షణాలూ లేవు. తాము చేసిన చికిత్సతో అతనికి నొప్పి నుంచి ఉపశమనం కలగలేదని వైద్యుడు అనిరుధ్‌ భుయాన్‌ తెలిపారు.


అనుమానం వచ్చి సీటీ స్కాన్‌ చేయగా.. పేగులకు రక్తం సరఫరా చేసే ప్రధాన ధమనుల్లో చాలా చోట్ల రక్తం గడ్డలు కట్టిందని చెప్పారు. వాటిని కరిగించేందుకు తక్షణమే చికిత్స చేయాలని, లేదంటే కుళ్లిపోయి (గ్యాంగ్రిన్‌) పుండుగా మారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ధమనుల్లో గడ్డలు కట్టిన రక్తాన్ని మందులతో కరిగించామని, శస్త్రచికిత్స అవసరం లేకుండా చేశామని వివరించారు. బాధితుడికి కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చిందన్నారు. ఇలా కొవిడ్‌ పాజిటివ్‌, పేగుల్లో రక్తం గడ్డలు కట్టడం.. రెండూ కలిసి వచ్చిన కేసు గడిచిన 8-9 నెలల్లో ఇది తొమ్మిదోదని చెప్పారు. ఈ కేసుల్లో ఎవరూ కూడా శ్వాసకు సంబంధించిన సమస్యతో రాలేదని, కేవలం తీవ్రమైన కడుపు నొప్పితోనే వచ్చారని తెలిపారు. కొవిడ్‌ రోగుల్లో 16-30 శాతం మందికి శ్వాస సంబంధిత సమస్యలు లేకపోయినా.. జీర్ణాశయాంత్ర సమస్యలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాల్లోనూ తేలిందన్నారు. 

Updated Date - 2021-06-03T09:08:27+05:30 IST