నవ రాజకీయ ప్రభాతం

ABN , First Publish Date - 2022-07-08T06:12:39+05:30 IST

అశేష ప్రజల త్యాగాల పునాదులపై ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్న స్థాయిలో నీళ్లు నిధులు నియామకాలు సమకూరలేదు...

నవ రాజకీయ ప్రభాతం

అశేష ప్రజల త్యాగాల పునాదులపై ఎనిమిదేళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే తెలంగాణ ప్రజలు కోరుకున్న స్థాయిలో నీళ్లు నిధులు నియామకాలు సమకూరలేదు. పేదలకు ఏ సంక్షేమ పథకమూ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఈ శోచనీయ పరిస్థితులలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ శుభ సంఘటనకు నేటితో ఒక సంవత్సరకాలం పూర్తయింది. జాతీయ పాలక పక్షమూ, ప్రధాన ప్రతిపక్షమూ తెలంగాణ పాలకులతో అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయి. అయినా ఆ రెండూ–బీజేపీ, కాంగ్రెస్ – రాష్ట్ర పాలక పార్టీకి ప్రత్యామ్నాయాలుగా చైతన్యశీల తెలంగాణ సమాజం భావించడంలేదు.


నిరుద్యోగం నిర్మూలనకు, రైతుల శ్రేయస్సునకు స్ఫూర్తిదాయక కృషి చేయని జాతీయ పాలక పక్షం తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారానికి వచ్చే అవకాశాలు లేవు. తెలంగాణ ఇచ్చింది తామేనని చెప్పుకుంటున్న జాతీయ ప్రతిపక్షం రాష్ట్రంలో తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దైన్య స్థితిలో ఉంది. నిత్యం అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్న పార్టీ తెలంగాణ సమాజం విశ్వాసాన్ని పొందే అవకాశం లేదనేది స్పష్టం.


పార్టీ స్థాపించిన తొలి రోజు నుంచి వైఎస్ షర్మిల అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా నిరాహార దీక్ష, ఆత్మహత్య చేసుకున్న రైతాంగం కోసం పరామర్శ యాత్ర, చిన్నారులపై లైంగిక దాడుల సందర్భంగా నిరసనలు ఇలా అన్ని సందర్భాల్లో ప్రభుత్వ వైఫల్యాలను యువ నాయకురాలు షర్మిల గట్టిగా నిలదీస్తున్నారు. తన విలక్షణ నాయకత్వంతో ఆమె తెలంగాణ సమాజం విశ్వాసాన్ని క్రమంగా చూరగొంటున్నారు. 3500 కిలోమీటర్ల ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించి 116 రోజుల్లో 1500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసిన షర్మిలకు గ్రామ గ్రామాన విశేష ఆదరణ లభిస్తోంది. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా చేసిన వాగ్దానాలలో వేటినీ పూర్తి చేయని విషయాన్ని ఆమె ప్రజలకు గుర్తు చేస్తున్నారు. దివంగత రాజశేఖర్ రెడ్డి పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించి తనకంటూ ప్రజల మనసుల్లో ఒక చెరగని స్థానాన్ని సాధించుకున్నారు. తన ఐదేళ్ల పాలనలో సంక్షేమ రంగంలో గతంలో ఎవరు ఊహించని విజయాలు సాధించారు. అనేక పథకాలు అమలుపరచి అన్ని వర్గాల అభివృద్ధికి బాటలు వేశారు. అదే స్థాయిలో వైఎస్ షర్మిల ప్రజల అభిమానం చురగొంటూ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అధికారంలోకి తీసుకురాగలరని ప్రజలు విశ్వసిస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న అన్ని సమస్యల పట్ల ఒక ప్రత్యేక అవగాహనతో వాటి పరిష్కారం కోసం చక్కటి ఆలోచనలతో వైఎస్ఆర్‌టీపీ కృషి చేస్తోంది. కనుకనే గ్రామ గ్రామాన ప్రస్తుత పాలక పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఒక గట్టి ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. జాతీయస్థాయిలో లాలూచీ రాజకీయాలు నడుపుతున్న పార్టీలకు, ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏలుతున్న ఆశ్రితపక్షపాత పాలకులకు ప్రత్యామ్నాయంగా తాను ఒక ఆదర్శవంతమైన సమర్థ నాయకత్వాన్ని అందించగలననే విశ్వాసాన్ని తెలంగాణ సమాజంలో నెలకొల్పేందుకు షర్మిల గట్టి కృషి చేస్తున్నారు. కేవలం ఏడాది కాలంలోనే తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరణను ఆమె అమితంగా పొందుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుత పాలకులకు ఒక మంచి ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించే స్థితికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని షర్మిల ముందుకు నడిపిస్తున్నారు. ఈ యువ నాయకురాలికి శుభాకాంక్షలు, అభినందనలు.

తూడి దేవేందర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ

(నేడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మొదటి ఆవిర్భావ దినోత్సవం)

Updated Date - 2022-07-08T06:12:39+05:30 IST