లాక్డౌన్ పై కొత్త కోణం

ABN , First Publish Date - 2020-03-31T09:21:18+05:30 IST

ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ దీర్ఘకాలిక ప్రభావానికి సంబంధించి మూడు అనిశ్చితాలను మనం ఎదుర్కోవలిసివున్నది. వైరస్ వ్యాప్తిని అరికట్టగల వ్యాక్సీన్‌ను శాస్త్రవేత్తలు శీఘ్రగతిన కనిపెట్టగలరా, లేదా అనేది మొదటి అనిశ్చితి. ఆసన్నమయిన వేసవి...

లాక్డౌన్ పై కొత్త కోణం

లాక్‌డౌన్‌ను అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో కాకుండా ఆర్థిక వ్యవస్థలోని వివిధ సెగ్మెంట్ల వారీగా అమలుపరచాలి. ప్రపంచీకరణ వల్ల చౌకగా నాణ్యమైన సరుకులు మనకు అందుబాటులోకి వచ్చాయి. వాటితో పాటు కరోనా లాంటి మహమ్మారులూ వచ్చాయి మరి! చిన్నచిన్న విభాగాలుగా విభజితమైన ఆర్థిక వ్యవస్థతో దేశంలోనే తయారైన ఖరీదైన సరుకులను కొనుగోలు చేసుకోవల్సివుంటుంది. దీనివల్ల కరోనా వైరస్‌లాంటి విషక్రిములు మనపై విరుచుకుపడే అవకాశాలూ సన్నగిల్లుతాయి.


ఆర్థిక వ్యవస్థలపై కరోనా వైరస్ దీర్ఘకాలిక ప్రభావానికి సంబంధించి మూడు అనిశ్చితాలను మనం ఎదుర్కోవలిసివున్నది. వైరస్ వ్యాప్తిని అరికట్టగల వ్యాక్సీన్‌ను శాస్త్రవేత్తలు శీఘ్రగతిన కనిపెట్టగలరా, లేదా అనేది మొదటి అనిశ్చితి. ఆసన్నమయిన వేసవి కాలంలో ఈ విషక్రిమి హరించుకు పోతుందా లేక రాబోయే శీతాకాలంలో మళ్ళీ అది విజృంభిస్తుందా? అనేది రెండో అనిశ్చితి. వైరస్‌కు బలికాకుండా సామాన్య మానవుడు స్వీయ రక్షణను అభివృద్ధి పరచుకోగలుగుతాడా లేక అది తన వినాశనకాండను కొనసాగిస్తూనే వుంటుందా? అనేది మూడో అనిశ్చితి.


కరోనా ప్రభావం ‘యు’ వలే వుంటుందా, లేక ‘ఎల్’ వలే వుంటుందా అనే విషయాన్ని ఈ అనిశ్చితాలే నిర్ణయిస్తాయి. ఆర్థిక వ్యవస్థ కొంతకాలం మాంద్యంలోకి దిగజారిపోయి, ఆ తరువాత సత్వరమే పూర్వ స్థాయికి చేరడాన్ని ‘యు’ సూచిస్తుంది. అలాకాక ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అసాధ్యమైపోయి చెప్పుకోదగిన కాలం పాటు అంతకంతకూ దిగజారిపోయే పరిస్థితి కొనసాగడాన్ని ‘ఎల్’ సూచిస్తుంది. దూరదృష్టితో ఆలోచించే వివేకవంతులమైతే మనం ‘ఎల్’ పరిస్థితులకు సంసిద్ధమవ్వాలి. ఎందుకంటే కరోనా మహమ్మారి చాలా కాలం పాటు ఆర్థిక కార్యకలాపాలకు తీవ్ర అవరోధంగా కొనసాగనున్నది.


ముంచుకొస్తోన్న ఈ ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాల ప్రభుత్వాలు ఆర్థిక ఉద్దీపన పథకాలను ప్రకటించాయి. ప్రభుత్వం భారీ రుణం తీసుకొని, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేందుకు మదుపు చేయడమనేది ఆర్థిక ఉద్దీపన మౌలిక భావన. ఈ అదనపు క్రియాశీలత వల్ల ప్రభుత్వం అదనపు పన్ను రాబడులను ఆర్జిస్తుంది. ఉద్దీపన కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం ఈ ఆదాయాన్ని ఉపయోగించుకుంటుంది.


అయితే ప్రస్తుత ఆర్థిక ఉద్దీపన అదనంగా ఎలాంటి ఆదాయాన్ని సమకూర్చదు. లాక్‌డౌన్ మూలంగా కోల్పోయిన ఆదాయ నష్టానికి పరిహారం మాత్రమే మాత్రమే సమకూర్చగలుగుతంది. లాక్‌డౌన్ మూలంగా ప్రస్తుతం పడుతున్న ఆర్థిక భారాన్ని భవిష్యత్తుకు మార్చడం మాత్రమే ఈ ఆర్థిక ఉద్దీపనలు చేయగలుగుతాయి. అవి ఎలాంటి అదనపు ఆదాయాలను సమకూర్చవు.


ద్రవ్య విధానానికి కూడా ఇటువంటి పరిమితులే వున్నాయి. కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గిస్తాయి. వ్యాపార సంస్థలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని మదుపు చేస్తాయని, అలాగే వినియోగదారులు అప్పు తీసుకుని వినియోగిస్తారనే భావనతోనే వడ్డీరేట్లను తగ్గిస్తారు. అయితే వ్యాపార సంస్థలు రుణాలు తీసుకుని మదుపు చేసేందుకు సుముఖంగా లేవు. ఎందుకని? మార్కెట్‌లో డిమాండ్ లేక పోవడమే. అలాగే వినియోగదారులు రుణాలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకని? రాబోయే రోజుల్లో తమకు ఉద్యోగ భద్రత లేదనే భయం వెంటాడుతున్నప్పుడు ఎవరైనా విలాస జీవితానికి ఎలా ఆరాటపడతారు?


మరి మార్గాంతరమేమిటి? ఆర్థిక వ్యవస్థను, అంతర్ సంబంధాలు తక్కువగా వుండే రీతిలో, చిన్న విభాగాలుగా విభజించాలి. వ్యక్తికి వ్యక్తికి మధ్య సంపర్కం ద్వారానే కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. ఇటువంటి సంబంధాలు, విదేశీ ప్రయాణాలు, వాణిజ్యం, మదుపుల మూలంగా విభిన్న ప్రాంతాలకు చెందిన వారి మధ్య నెలకొంటున్నాయి. మనదేశంలో కరోనా బారిన పడిన వారిలో అత్యధికులు విదేశాలలో నిర్దిష్ట ప్రాజెక్టులలో పని చేస్తున్నవారు లేదా విభిన్న దేశాలలో విద్యాభ్యాసం చేస్తున్నవారే కావడం గమనార్హం.


మనం మన ఆర్థిక వ్యవస్థను చిన్న విభాగాలుగా విడగొట్టి వాటి మధ్య సంబంధం తక్కువగా వుండేలా చేస్తే కరోనా హాని కారక సంబంధాలు తగ్గిపోతాయి. ఉదాహరణకు అంతర్జాతీయ స్థాయిలో ఇటలీ, స్పెయిన్‌లు, జాతీయ స్థాయిలో మహరాష్ట్ర, కేరళలపై కరోనా వైరస్ ప్రభావం అమితంగా ఉన్నది. ఇటలీ, స్పెయిన్, మహారాష్ట్ర, కేరళలే కాకుండా అన్ని దేశాలు, సకల రాష్ట్రాలను ‘పరిధీకృత ప్రాంతాలు’గా చేసి, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య సంబంధాలను తగ్గించి వేస్తే కరోనా కల్లోలం అంత తీవ్రంగా వుండబోదు. 


అయితే ఇందుకు ఇటలీ నుంచి సరఫరా అయ్యే ఆలివ్‌లకు, స్పెయిన్ నుంచి వచ్చే సిట్రస్ పండ్లకు, మహారాష్ట్ర ఉల్లిపాయలకు, కేరళ మిరియాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనవలసివున్నది. బంగ్లాదేశ్‌లాంటి దేశాలు, ఒడిషా లాంటి రాష్ట్రాలు ఉక్కు, కార్లను తయారు చేసుకొనేందుకు తమ సొంత ఫ్యాక్టరీలను నెలకొల్పుకోవల్సివున్నది.పూణే, కోటలో వలే తామూ ట్యూషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.


అంతర్ -విభాగ వాణిజ్యం తగ్గుదల, కరోనా వైరస్ ప్రభావం సోకని రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించేందుకు తోడ్పడుతుంది. లాక్‌డౌన్‌ను అంతర్జాతీయ లేదా జాతీయ స్థాయిలో కాకుండా ఆర్థిక వ్యవస్థలోని వివిధ సెగ్మెంట్ల వారీగా అమలుపరచాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ ప్రతిపాదన చేస్తున్నందుకు నేనేమీ సంతోషంగా లేను. అయితే చేయక తప్పదు. చేసి తీరాలి కూడా. ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ వల్ల నాణ్యమైన సరుకులు చౌకగా మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే వాటితో పాటు కరోనా లాంటి మహమ్మారులూ వచ్చాయి మరి. చిన్నచిన్న విభాగాలుగా విభజితమైన ఆర్థిక వ్యవస్థతో దేశంలోనే తయారైన ఖరీదైన సరుకులను కొనుగోలు చేసుకోవల్సివుంటుంది. అయితే దీనివల్ల కరోనా వైరస్ లాంటి విషక్రిములు మనపై విరుచుకుపడే అవకాశాలూ సన్నగిల్లుతాయి. దేశీయ ఉత్పత్తులపైనే ఆధారపడడం అనేది సౌఖ్యదాయకం కాని మాట నిజమే. అయినా మనం ఇటువంటి కఠోర నిర్ణయాన్ని తీసుకోక తప్పదు.


చౌక వస్తువులు, వాటితో పాటే ప్రాణాంతక వ్యాధుల రాకను కోరుకుందామా లేక ఖరీదైన దేశీయ సరుకులు, మహమ్మారులు విజృంభించలేని పరిస్థితులను ఆశిద్దామా? దేశాల మధ్య ఇనుపతెరలు ఏర్పాటు చేయాలని నేను వాదించడం లేదు. ఆర్థిక వ్యవస్థల తక్కువ ఏకీకరణే మంచిదన్నది నా వాదన. ఆర్థిక వ్యవస్థలు మరింత స్వయం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలి. వాటికి మరింత స్వయం ప్రతిపత్తి వుండి తీరాలి. దీనివల్ల జీవనప్రమాణాలు అంత సమున్నతంగా ఉండకపోవచ్చు. అయితేనేం ఎటువంటి మహమ్మారుల భయం లేకుండా ప్రశాంతంగా జీవించగలుగు తాము కదా.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-03-31T09:21:18+05:30 IST