సీఎంగా నితీశ్‌.. డిప్యూటీగా తేజస్వి

ABN , First Publish Date - 2022-08-11T08:53:55+05:30 IST

బిహార్‌లో మహాకూటమి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు కటీఫ్‌ చెప్పిన జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌కుమార్‌..

సీఎంగా నితీశ్‌.. డిప్యూటీగా తేజస్వి

బిహార్‌లో కొలువుదీరిన కొత్త సర్కారు

ప్రమాణం చేయించిన గవర్నర్‌ చౌహాన్‌

బీజేపీ, ప్రధాని మోదీపై నితీశ్‌ విసుర్లు

2014 గతం.. 2024 భవిష్యత్తు

దాని గురించి ఆలోచించాలని సూచన

మోదీజీ.. మీరు చెప్పింది నిజమే: ఆర్జేడీ


పట్నా, ఆగస్టు 10: బిహార్‌లో మహాకూటమి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు కటీఫ్‌ చెప్పిన జేడీ(యూ) చీఫ్‌ నితీశ్‌కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు సహా.. ఏడు పార్టీల మహాఘఠ్బంధన్‌తో జట్టుకట్టారు. ఆ కూటమి సారథిగా.. ఎనిమిదోసారి బిహార్‌ సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ ఫాగూ చౌహాన్‌ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.


అంతా ముందుగా ఊహించినట్లే.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో తేజస్వీ భార్య రాజ్‌శ్రీ యాదవ్‌, తల్లి, మాజీ సీఎం రబ్రీదేవి, సోదరుడు తేజ్‌ ప్రతాప్‌ పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి బీజేపీ నేతలెవరూ హాజరవ్వలేదు. తమకు ఆహ్వానం అందిందని, వెన్నుపోటు ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి సాక్ష్యంగా ఉండకూడదని నిర్ణయం తీసుకున్నామని బీజేపీ నేత సుశీల్‌ మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యనించారు. అటు కొత్త సర్కారు కొలువుదీరడంపై జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. రాజ్‌భవన్‌ వెలుపల నితీశ్‌, తేజస్వీకి అనుకూల నినాదాలు చేశాయి. ప్రమాణస్వీకారానికి ముందు.. ఆర్జేడీ చీఫ్‌, మాజీ సీఎం లాలూప్రసాద్‌ యాదవ్‌ నితీశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బీజేపీతో కటీఫ్‌ నిర్ణయంపై నితీశ్‌ను లాలూ అభినందించినట్లు ఆర్జేడీ వర్గాలు తెలిపాయి. 


ప్రభుత్వ కూర్పు ఇలా?

పొత్తులో భాగంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. గతంలో మాదిరిగా తేజస్వీ సోదరుడు తేజ్‌ ప్రతా్‌పకు మంత్రి పదవి, ఆర్జేడీ నుంచి మరో నేతకు స్పీకర్‌ పదవి దక్కే అవకాశాలున్నాయి. కాంగ్రె్‌సకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తంమీద 2015 మాదిరిగానే ప్రభుత్వ కూర్పు ఉంటుందని మహాగఠ్బంధన్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. క్యాబినెట్‌లో ఏయే పార్టీకి ఎన్ని బెర్త్‌లు దక్కుతాయనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాయి.


హోంశాఖను తేజస్వీ కోరుతుండగా.. నితీశ్‌ ఆ శాఖను తన వద్దే పెట్టుకుంటాడని తెలుస్తోంది. బీజేపీ సభ్యులు ప్రాతినిధ్యం వహించిన శాఖల్లో చాలా వరకు ఆర్జేడీకి దక్కే అవకాశాలున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత నితీశ్‌ విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనసాగదని, మధ్యలోనే కూలిపోతుందంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘‘2014ను గతం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. భవిష్యత్‌ 2024 అనేది గుర్తెరిగి.. చింతించడం ఆరంభించాలి’’ అని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన 2014లో గెలిచారని, 2024లో గెలవకపోవచ్చని పరోక్షంగా పేర్కొన్నారు. అంతకు ముందు బీజేపీ నేత సుశీల్‌ మోదీ విలేకరులతో మాట్లాడుతూ.. సంఖ్యాబలం అధికంగా ఉన్న తేజస్వీ.. ఉపముఖ్యమంత్రిగా ఉన్నా.. పెత్తనం ఆయనదే ఉంటుందని జోస్యం చెప్పారు. మరోవైపు నితీశ్‌ వెన్నుపోటు పొడిచారంటూ బీజేపీ వర్గాలు ఆందోళన చేపట్టాయి. పట్నాలోని బీజేపీ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించాయి.  


మోదీజీ.. బిహారీలు అదే చేశారు: ఆర్జేడీ

2017లో ప్రధాని మోదీ చేసిన ఓ ట్వీట్‌ను తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్జేడీ సోషల్‌ మీడియా విభాగం ఎత్తిచూపింది. అప్పట్లో మహాగఠ్బంధన్‌ను వీడిన నితీశ్‌, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానిపై మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘‘దేశ ఉజ్వల భవిష్యత్‌ కోసం బిహార్‌ ప్రజలకు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉంది’’ అని మోదీ ఆ ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. దానికి ఆర్జేడీ ఇప్పుడు బదులిస్తూ.. ‘‘అవును సర్‌.. మీరు చెప్పింది నిజమే. బిహార్‌ సరిగ్గా ఇప్పుడు అదే చేసింది. ప్రజాస్వామ్యానికి తల్లి వంటి బిహార్‌.. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు దేశం చేస్తోన్న డిమాండ్‌ కూడా ఇదే’’ అని కౌంటర్‌ ఇచ్చింది. కాగా, ప్రాంతీయ పార్టీలను సమాధి చేయడమే బీజేపీ ధ్యేయమని ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆరోపించారు. బీజేపీతో పొత్తును వీడాలనే బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నిర్ణయానికి మద్దతు పలికారు. ‘‘బిహార్‌లో రాజకీయ అస్థిరత తదుపరి అధ్యాయం ప్రారంభమైంది. గడిచిన పదేళ్లలో ఇది ఆరో ప్రభుత్వం. దీన్ని బట్టి రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను అర్థం చేసుకోవచ్చు’’ అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-08-11T08:53:55+05:30 IST