ఉక్కుపై కొత్త కుట్ర!

ABN , First Publish Date - 2022-07-05T07:52:39+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం తెలివిగా ఎత్తులు వేస్తోంది. ఒకవైపు జిందాల్‌, అదానీ సంస్థలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయని లీకులిస్తూ.. మరోవైపు ప్లాంటులోని..

ఉక్కుపై కొత్త కుట్ర!

ప్లాంటులోని యూనిట్లు విడివిడిగా ప్రైవేటు సంస్థలకు అప్పగింత!

కోక్‌ ఓవెన్‌ 1, 2 బ్యాటరీల నిర్వహణకు టెండర్ల ఆహ్వానం

రెండేళ్లకు రూ.32.5 కోట్లు ఆఫర్‌

ఈ నెల 14లోగా బిడ్లు వేయాలని స్టీల్‌ప్లాంటు నోటిఫికేషన్‌

కాంట్రాక్టు కార్మికుల్లో 50 శాతం భూ నిర్వాసితులకే ఇవ్వాలని వెల్లడి

విజయవంతమైతే సింటర్‌ ప్లాంటు, బ్లాస్ట్‌ ఫర్నేస్‌లూ కట్టబెట్టే చాన్సు!


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం తెలివిగా ఎత్తులు వేస్తోంది. ఒకవైపు జిందాల్‌, అదానీ సంస్థలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయని లీకులిస్తూ.. మరోవైపు ప్లాంటులోని యూనిట్లను విడివిడిగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు చర్యలు చేపడుతోంది. ముందుగా ప్లాంటు ఆస్తులకు విలువ కట్టేందుకు అర్హత కలిగిన ఆర్థిక సంస్థలు ముందుకు రావాలని నోటిఫికేషన్‌ ఇవ్వడంతో.. ఆ ప్రక్రియను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. వారి దృష్టిని అటు మరల్చి.. దొడ్డిదారిన కీలక యూనిట్లను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా స్టీల్‌ప్లాంటులో అత్యంత కీలకమైన కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు 1, 2లను రెండేళ్లకు ఆపరేషన్‌, నిర్వహణకు ఇస్తామని జూన్‌ 25న స్టీల్‌ప్లాంటు ప్రకటన ఇచ్చింది. ప్లాంటులో మొత్తం ఐదు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలు ఉన్నాయి. వీటిలో బొగ్గులోని మలినాలన్నీ తొలగించి కోక్‌ను తయారుచేస్తారు.


ఆ కోక్‌ను స్టీల్‌ను తయారుచేసే బ్లాస్ట్‌ ఫర్నేసుల్లో ఉపయోగిస్తారు. ఒక్కో కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలో ప్రస్తుతం 200 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 300 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలను రెండేళ్లకు కాంట్రాక్టుకు ఇస్తామని స్టీల్‌ప్లాంటు పేర్కొంది. కోక్‌ తయారు చేయడానికి అవసరమైన బొగ్గును తామే అందిస్తామని.. కేవలం బ్యాటరీలను ఆపరేట్‌ చేసి, నిర్వహించడానికి రెండేళ్లకు రూ.32.5 కోట్లు ఇస్తామని ఆఫర్‌ ఇచ్చింది. దీనికి సిద్ధమైన సంస్థలు ఈ నెల 14లోగా టెండర్‌ వేయాలని సూచించింది. కాంట్రాక్టు కార్మికులను తీసుకుంటే.. అందులో 50 శాతం భూ నిర్వాసితులకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది.

 

రెండేళ్లుగా నిలిచిన ఉద్యోగాల భర్తీ

విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రైవేటీకరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను అమలుచేస్తున్న కేంద్రం ఉద్దేశపూర్వకంగా రెండేళ్ల నుంచి పోస్టుల భర్తీని నిలిపివేసింది. సీని యర్లంతా ఒక్కొక్కరుగా పదవీ విరమణ చేస్తున్నారు. ఇప్పుడు యూనిట్లవారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగిసే ్త.. ఉద్యోగుల సంఖ్య మరింత తగ్గిపోతుంది. వారిని వీఆర్‌ఎస్‌ వంటి పథకాల ద్వారా వదిలించుకునే యో చన కూడా ఉన్నట్లు సమాచారం. కోక్‌ ఓవెన్‌ బ్యా టరీలను కాంట్రాక్టరు విజయవంతంగా నిర్వహిస్తే.. ఆ తర్వాత సింటర్‌ ప్లాంటు, ఆపై బ్లాస్ట్‌ ఫర్నే్‌సలు కూడా టెండర్ల ద్వారా ప్రైవేటు సంస్థలకు ఇస్తారని చెబుతున్నారు. 


నాణ్యత పడిపోయే ప్రమాదం

కీలకమైన యూనిట్లను ప్రైవేటుకు అప్పగిస్తే...అక్కడేమైనా తప్పిదాలు జరిగితే దాని ప్రభావం ఉత్పత్తిపై పడుతుందని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఉదాహరణకు కోక్‌ ఓవెన్‌ బ్యాటరీలనే తీసుకుంటే.. వాటి నుంచి విడుదలయ్యే వృథా గ్యాస్‌ ద్వారా రోలింగ్‌ మిల్స్‌ నడుపుతున్నారు. ఇక్కడ తయారయ్యే కోక్‌ నాణ్యతను బట్టే బ్లాస్ట్‌ ఫర్నేసులో స్టీల్‌ నాణ్యత ఆధారపడి ఉంటుంది. కాంట్రాక్టు  సంస్థ నైపుణ్యం లేనివారిని నియమించుకుని సరైన కోక్‌ తయారు చేయకపోతే.. స్టీల్‌ ఉత్పత్తుల నాణ్యత పడిపోతుంది. విశాఖ ఉక్కు నాణ్యతకు పెట్టింది పేరు. మార్కెట్‌లో ఆ గుడ్‌విల్‌ పోతే తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అందువల్లే ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని కార్మిక సంఘాలు ఉద్యమిస్తున్నాయి. 

Updated Date - 2022-07-05T07:52:39+05:30 IST