30 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న నిరపరాధిని రక్షించిన యువ లాయర్..!

ABN , First Publish Date - 2022-06-29T03:01:04+05:30 IST

ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. డబ్బు లేకపోతే ఒక్కోసారి న్యాయం కూడా దక్కదు. కానీ..మనుషుల్లో మనసున్న దేవుళ్లు కూడా ఉంటారు. లాభాపేక్ష లేకుండా ఆపదలో ఉన్నవారికి ఆదుకుని వారి జీవితాలను నిలబెడతారు.

30 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న నిరపరాధిని రక్షించిన యువ లాయర్..!

ఎన్నారై డెస్క్: ప్రపంచం డబ్బు చుట్టూనే తిరుగుతుంటుంది. డబ్బు లేకపోతే ఒక్కోసారి న్యాయం కూడా దక్కదు. కానీ..మనుషుల్లో మనసున్న దేవుళ్లు కూడా ఉంటారు. లాభాపేక్ష లేకుండా ఆపదలో ఉన్నవారికి ఆదుకుని వారి జీవితాలను నిలబెడతారు. ఇక చేయని నేరానికి 30 ఏళ్లుగా జైల్లో మగ్గుతున్న ఓ అమెరికన్‌ను ఓ యువమహిళా లాయర్ ఇలాగే రక్షించారు. తన జీవితం ఇక జైలు గోడలకే పరిమితం అనుకుంటున్న తరుణంలో అతడికి మళ్లీ జీవితాన్ని తిరిగిచ్చారు. 


ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన జేమ్స్  1990లో ఓ హత్యా నేరం కేసులో జైలుపాలయ్యాడు. కానీ.. అప్పటి నుంచి తాను నిరపరాధినని ఆయన చెబుతూనే ఉన్నాడు. అయితే.. ఆయన గోడును న్యాయవాదులెవరూ పట్టించుకోలేదు. పెద్ద లాయర్లను పెట్టుకుని కేసు నుంచి విముక్తి పొందేందుకు అతడి వద్ద తగినంత ధనం లేకపోయింది. కానీ.. జేమ్స్, అతడి స్నేహితులు మాత్రం తమ ప్రయత్నాలను ఆపలేదు.  ఈ క్రమంలో వారికి నాట్లీ ఫ్రిగ్గర్స్(29) అనే యువ మహిళా లాయర్ తారసపడ్డారు. జేమ్స్ కథనంతా విన్న ఆమె ఉచితంగానే ఆయన కేసు టేకప్ చేసింది.   


అప్పటికే గర్భవతి అయిన ఆమె ప్రసవమైన ఆరు నెలలకే జేమ్స్ కేసులో విచారణ ప్రారంభించింది. ఆ ఘటనతో సంబంధం ఉన్న వారందిరినీ ప్రశ్నించింది. కేసుకు సంబంధించి వందల సంఖ్యలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించింది. చివరికి హత్య జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షి..  అసలు నిందితుడు జేమ్స్ అని పొరపాటు పడ్డట్టు తేల్చింది. తాను సేకరించిన ఆధారాలన్నీ శిక్షల పునఃసమీక్ష శాఖకు పంపించింది. దీంతో.. జేమ్స్‌కు అన్యాయం జరిగిందని భావించిన అధికారులు ఎట్టకేలకు అతడిని విడుదల చేశారు. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో జైలు నుంచి విడుదలైన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఏటా 55 వేల డాలర్లు చెల్లిస్తుంటుంది. అయితే.. గతంలో ఎటువంటి నేరాలు చేయని వారు మాత్రమే ఈ పరిహారానికి అర్హులు. కానీ.. జేమ్స్ అంతకుమునుపే మరో కేసులో అపరాధిగా తేలడొంతో ప్రస్తుతం అతడు బతుకుతెరువు కోసం అలమటిస్తున్నాడు. కానీ.. జైల్లో బతికేకంటే ఇలా స్వేచ్ఛగా ఉండటమే తనకిష్టమని చెబుతున్నాడు. మరోవైపు.. జేమ్స్‌కు ఆర్థికంగా ఆదుకోవాలంటూ ప్రారంభమైన ఆన్‌లైన్ సిగ్నేచర్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.   

Updated Date - 2022-06-29T03:01:04+05:30 IST