Amarnath Yatra: మనిషిని బతికించిన చావు నీదన్నా.. నూటికో కోటికో నీలాంటి ఇంతియాజ్‌ అహ్మద్ ఖాన్ ఒక్కరు..

ABN , First Publish Date - 2022-07-19T00:57:19+05:30 IST

సాటి మనిషికి సాయపడాలనుకునే గుణం, ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలనే ఆలోచనను మించిన మానవత్వం మరొకటి ఉండదు. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి..

Amarnath Yatra: మనిషిని బతికించిన చావు నీదన్నా.. నూటికో కోటికో నీలాంటి ఇంతియాజ్‌ అహ్మద్ ఖాన్ ఒక్కరు..

సాటి మనిషికి సాయపడాలనుకునే గుణం, ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలనే ఆలోచనను మించిన మానవత్వం మరొకటి ఉండదు. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి కులంతో, మతంతో పనిలేదు. ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని చూసి చలించిపోయే మనసుంటే చాలు. అలాంటి మంచి మనసున్న మనుషుల్లో ఒకరు కశ్మీర్‌కు చెందిన ఈ యువకుడు. పాపం.. తోటి మనిషిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన మత విద్వేషాల కంటే ఒక మనిషిలో ఉండే మానవత్వం ఎంత గొప్పదో చెప్పింది. సాటి మనిషి ప్రాణం కాపాడేందుకు మరో మనిషి పడిన తపన.. మానవత్వంతో స్పందించేందుకు మతం అడ్డుగోడ కాదని నిరూపించింది. ఆ యువకుడి వయసు 22 సంవత్సరాలు. కశ్మీర్‌కు చెందిన ఆ కుర్రాడి పేరు ఇంతియాజ్ అహ్మద్ ఖాన్. ఈ యువకుడికి పెళ్లైంది. 8 నెలల పాప కూడా ఉంది. అమర్‌నాథ్ యాత్రికులను తన గుర్రంపై గుహ వరకూ చేర్చడం ద్వారా వచ్చిన సంపాదనతో తన భార్య, బిడ్డను పోషించుకుంటూ జీవనం సాగించేవాడు.



కష్టాల కడలిలో ఎదురీదిన ఇంతియాజ్

కొన్ని రోజులుగా అమర్‌నాథ్ ప్రాంతంలో వాతావరణం యాత్రికులకు అనుకూలంగా లేదు. వార్షిక అమర్‌నాథ్ యాత్ర జూన్ 30వతేదీన ప్రారంభమైంది. అయితే జులై 8న ఆకస్మిక వరదల కారణంగా తాత్కాలికంగా యాత్రను నిలిపివేశారు. జులై 11న అమర్‌నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. దాదాపు కొన్నేళ్లుగా ఆ యాత్రికుల కోసం ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ ఆశగా ఎదురుచూశాడు. కారణం ఏంటంటే.. ఛక్లిపొరా అనే గ్రామానికి చెందిన ఖాన్ కుటుంబ పోషణ నిమిత్తం, యాత్రికులను ఆలయం వద్దకు చేర్చడం ద్వారా వచ్చే డబ్బుతో జీవనం సాగించవచ్చని భావించి 2018లో ఒక గుర్రాన్ని కొనుగోలు చేశాడు. అతని తండ్రి మహ్మద్ యూసఫ్ ఖాన్‌కు కళ్లు కనిపించవు. తల్లి కూడా వయసు మీద పడి అనారోగ్యంతో బాధపడుతోంది. తనకూ అప్పటికే పెళ్లైంది. ఒక తమ్ముడు, నలుగురు సోదరిలు ఉన్నారు. ఆ నలుగురు సోదరిల్లో ఎలాగోలా కష్టపడి ఒక సోదరికి ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ పెళ్లి చేశాడు. మిగిలిన ముగ్గురు సోదరిలకు పెళ్లి కాలేదు. దీంతో.. కుటుంబ పోషణ భారమంతా ఖాన్‌పై పడింది.



ఇక నుంచైనా నాలుగు ముద్దలు నోట్లోకి వెళతాయనుకుంటే..

2018లో గుర్రాన్ని కొనుగోలు చేసినప్పటికీ ఎక్కువ రోజులు అతని బతుకు బండి సాఫీగా సాగలేదు. 2019లో భద్రతా కారణాల వల్ల, ఆ తర్వాత రెండేళ్లు కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్ర సాగలేదు. దీంతో.. ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కావడంతో ఎంతో ఆశగా కుటుంబంలోని నలుగురికి నాలుగు ముద్దలు నోట్లోకి వెళతాయని భావించి ఒక మహిళా యాత్రికురాలిని గుర్రంపై తీసుకెళ్లేందుకు మాట్లాడుకున్నాడు. పంజ్‌తరణి (అమర్‌నాథ్ ట్రాక్ మిడ్ పాయింట్) వద్దకు చేరుకునే సరికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది. ఆ సమయానికి ఆ మహిళ గుర్రం మీద కూర్చునికూర్చుని అలసిపోయి గుర్రంపై వెళుతుండగానే నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేసింది.



అమర్నాథ్ యాత్రికురాలి ప్రాణానికి తన ప్రాణాన్ని అడ్డేసి..

ఆమెను గమనించిన ఖాన్ నిద్రపోవద్దని.. ముందుముందు అత్యంత క్లిష్టమైన చిత్తడి మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుందని.. ఆదమరిచి పొరపాటున కిందపడితే చనిపోయే ప్రమాదం ఉంటుందని ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ తీవ్రంగా అలసిన ఆమె గుర్రంపై ఉండి నిద్రలోకి జారుకోవడంతో ఆమెను అప్రమత్తం చేయడం ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ వంతైంది. వారి ప్రయాణం రానురానూ మరింతి సంక్లిష్టమైంది. ఆమె ఉన్నట్టుండి గుర్రంపై నుంచి నిద్రలోకి జారుకుని పడిపోతున్న క్రమంలో ఆమెను కాపాడేందుకు తన చేతులతో వెనుక నుంచి ఆమెను అటు వైపుకు నెట్టాడు. గుర్రం కూడా ఆమె వైపుకు వెళ్లింది. దీంతో.. గుర్రంతో పాటు ఆ యాత్రికురాలు కూడా ప్రాణాలతో బయటపడింది. పాపం.. ఖాన్ మాత్రం ప్రమాదంలో పడిపోయాడు. కాళ్లు జారడంతో వాగులో పడిపోయాడు. అతని ఆచూకీ కనిపెట్టడానికి దాదాపు 5 గంటల సమయం పట్టింది. అతనిని వాగులో నుంచి బయటకు తీసినప్పటికీ అప్పటికే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అమర్‌నాథ్ యాత్రికురాలి ప్రాణాలు కాపాడే క్రమంలో ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఎంత కష్టాల్లో ఉన్నా కుటుంబానికి వెన్నుదన్నుగా నిలిచిన ఇంతియాజ్ అహ్మద్ ఖాన్ మరణంతో అతని కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 8 నెలల వయసున్న ఇంతియాజ్ కన్న కూతురికి తండ్రి చనిపోయాడన్న విషయం కూడా తెలియని పసి వయసు. ఇంతియాజ్ చనిపోవడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది.

Updated Date - 2022-07-19T00:57:19+05:30 IST