పరంబిర్ సింగ్‌కు ముంబై కోర్టులో ఊరట

ABN , First Publish Date - 2021-11-30T20:41:54+05:30 IST

నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్‌పై జారీ

పరంబిర్ సింగ్‌కు ముంబై కోర్టులో ఊరట

ముంబై : నగర మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్‌పై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారంట్‌ను ఓ మేజిస్ట్రేట్ కోర్టు మంగళవారం రద్దు చేసింది. ఆయన బలవంతపు వసూళ్ళకు పాల్పడినట్లు రియల్ ఎస్టేట్ డెవలపర్ శ్యామసుందర్ అగర్వాల్ ఫిర్యాదు చేయడంతో జూలై 22న మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు పోలీసు అధికారులు కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కేసుపై మహారాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్డ్‌మెంట్ (సీఐడీ) దర్యాప్తు చేస్తోంది. 


పరంబిర్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేయాలని సీఐడీ ఇటీవల కోర్టును కోరింది. దీంతో కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. ఈ వారంట్‌ను  అడిషినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎం నెర్లికర్ మంగళవారం రద్దు చేశారు. 


అగర్వాల్ ఫిర్యాదు ప్రకారం, ఆయన వ్యాపార భాగస్వామి సంజయ్ పునమియాతో పరంబిర్ సింగ్, ఇతర పోలీసు అధికారులు కుమ్మక్కు అయి ఆయనపై తప్పుడు కేసు నమోదు చేశారు. దానిని ప్రస్తావించి, బెదిరిస్తూ, ఆయన వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు గుంజారు. 


బలవంతపు వసూళ్ళకు సంబంధించి పరంబిర్ సింగ్‌పై సుమారు 5 కేసులు నమోదయ్యాయి. ఆయన పరారైనట్లు ముంబై కోర్టు ఇటీవల ప్రకటించింది. ఆరు నెలలపాటు అజ్ఞాతంలో గడిపిన పరంబిర్ సింగ్ గురువారం ముంబై క్రైమ్ బ్రాంచ్ సమక్షంలో హాజరయ్యారు. ఆయనను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ఆయనకు తాత్కాలిక రక్షణ కల్పించింది. 


Updated Date - 2021-11-30T20:41:54+05:30 IST