ఎంపికల ఎత్తుగడ

ABN , First Publish Date - 2022-07-19T06:18:03+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. వివిధ కారణాల వల్ల ఓటువేయనివారినీ, పొరపాటున మరొకరికి వేసిన వారినీ అటుంచితే, ‘ఆత్మప్రభోదం’ మేరకు క్రాస్ ఓటింగ్ చేసినవారూ ఉండవచ్చు...

ఎంపికల ఎత్తుగడ

రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ ముగిసింది. వివిధ కారణాల వల్ల ఓటువేయనివారినీ, పొరపాటున మరొకరికి వేసిన వారినీ అటుంచితే, ‘ఆత్మప్రభోదం’ మేరకు క్రాస్ ఓటింగ్ చేసినవారూ ఉండవచ్చు. ఎదుటివారు పార్టీలను చీల్చి, డబ్బు ప్రలోభపెట్టి ఓట్లువేయించుకుంటున్నారని విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుండగానే, ప్రధానమంత్రి, మంత్రులు, మిత్రపక్షాల ప్రతినిధులు వెంటరాగా ఎన్డీయే తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్ నామినేషన్ ఘట్టమూ ఆర్భాటంగా జరిగింది. 


ప్రతిపక్షాల ఉమ్మడి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా నేడు నామినేషన్ వేయబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికలో ద్రౌపది ముర్ముకు ఓటేయాలని నిర్ణయించుకున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రతినిధి మాత్రం ఆల్వా విషయంలో తామంతా కలసికట్టుగా ఉన్నామని అంటున్నారు. ఎన్నికనాటికి ఎవరిమనసులు ఎలా మారుతాయన్నది అటుంచితే, ధన్‌కర్ ఎంపిక మాత్రం అనూహ్యమైనది. కొన్ని పేర్లను ప్రచారంలో పెట్టడం, చివరినిముషంలో ఊహించనివారిని బరిలోకి దించడంలో బీజేపీ దిట్ట. ఆదివాసీ ద్రౌపదిని హఠాత్తుగా తెరమీదకు తెచ్చి విపక్షాలను ఆత్మరక్షణలో పడవేసింది ఆ పార్టీ. ఈ మాట ముందే చెప్పవచ్చు కదా అని తృణమూల్ అధినేత్రి సైతం నీళ్ళునమిలారు. విపక్షాల అనైక్యతను సార్వత్రక ఎన్నికలకు ముందే ప్రజలకు తెలియచెప్పే అవకాశాన్ని బీజేపీ మాత్రం ఎందుకు వదులుకుంటుంది? మిత్రపక్షాలు, అస్మదీయ పార్టీలూ ద్రౌపది పక్షాన ఎలాగూ ఉండగా, స్వరాష్ట్ర ఆదివాసీ అయినందున జార్ఖండ్ ముక్తిమోర్చా, ఆత్మరక్షణార్థం ఉద్ధవ్ వర్గం ఆమెకే జై కొట్టవలసి వచ్చింది. రాష్ట్రపతి ఎన్నికను ఒక సైద్ధాంతికపోరాటంగా, ప్రజాస్వామ్య విలువలకోసం చేస్తున్న పోరాటంగా చిత్రీకరించిన విపక్షాలు, బీజేపీ వ్యతిరేక సంఘటితత్వానికి సూచికగా సార్వత్రక ఎన్నికల ముందు నిలుస్తాయని అనుకొనేలోగానే లెక్కలు మారిపోయాయి. విపక్షాల మాటలకూ చేతలకూ పొంతనలేదనీ, మాటల్లో ఉన్న బలం చేతల్లో కనిపించదనీ, మోదీ వర్సెస్ మిగతా అన్న పోరాటంలో సైతం అవి నిలబడలేకపోయాయన్న సంకేతం ప్రజలకు పోవడం సహజం. 


ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ నిలబెడుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. ఇప్పటికే ఉత్తరభారతంలో పూర్తిగా విస్తరించిన బీజేపీ, దక్షిణాది లక్ష్యంగా పనిచేయడం మొదలుపెట్టింది కనుక, కనీసం ఉపరాష్ట్రపతి పదవి ఇక్కడివారికి దక్కుతుందని అంతా అనుకున్నారు. మూడువందల పైచిలుకుఎంపీల్లో 29మంది మాత్రమే దక్షిణాదివారు ఉన్నందునా, హిమాచల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలున్నా తెలంగాణలో కార్యవర్గ సమావేశం పెట్టుకొని బలంగా గర్జించినందునా ఆ అంచనా కాదనలేనిదే. ఇటీవల నలుగురు దక్షిణాదివారిని రాజ్యసభకు కూడా పంపిన నేపథ్యంలో, వెంకయ్యనాయుడిని కొనసాగిస్తారనో, తమిళి సైని తెస్తారనో కొందరు అంచనావేశారు. కానీ, పూర్తి భిన్నంగా బీజేపీ వీరభక్త రాజస్థానీని ఉపరాష్ట్రపతి చేయబోతున్నారు. పూర్వావతారంలో ద్రౌపది బీజేపీ విధేయతల మాట అటుంచితే, ఇప్పుడు రాజ్యసభలో ఓ తండ్రిలాగా అందరినీ కలుపుకొనిపోతూ రాజ్యాంగ విలువలనూ, పార్లమెంటరీ సంప్రదాయాలనూ పరిరక్షించాల్సిన ధన్ కర్, సమీపగతంలోనే ఓ బీజేపీ కార్యకర్తకంటే ఎక్కువగా నిబద్ధతను కనబరిచినవారు. తృణమూల్ అధినేత్రి మమతతో ఆయన చేసిన పోరాటం, బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా కూడా చేసి ఉండరు. రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటినుంచి ఎన్నికల అనంతర హింసలో గాయపడిన బీజేపీ కార్యకర్తల పరామర్శవరకూ ప్రతీదశలోనూ ఆయన నిర్వహించినపాత్రకీ, అక్కడ బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించడంలో అందించిన సహకారానికీ ప్రతిఫలంగా ఈ ఉన్నతస్థానం దక్కి ఉండవచ్చు. ఈ ‘కిసాన్ పుత్ర’ ఎంపిక వెనుక బలమైన జాట్ ఓటుబ్యాంకు లెక్కలు ఎలాగూ ఉన్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలున్న రాజస్థాన్ మాత్రమే కాదు, కొత్త వ్యవసాయచట్టాలపై పోరుతో శత్రువులుగా మారిన ఆ విస్తారమైన, బలమైన వర్గాన్ని మచ్చికచేసుకోవచ్చు. రాజ్యసభలో విపక్షనేతలు నియమావళిని తిరగేస్తుంటే, ఈ న్యాయకోవిదుడు తమకు న్యాయం చేకూర్చుతాడన్న నమ్మకంతో బీజేపీ నాయకులు ఇక నిశ్చితంగా ఉండవచ్చును. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్డీయే అభ్యర్థుల విజయం ఖాయమనీ, విపక్షాలు రెండు సందర్భాల్లోనూ తప్పటడుగులు వేశాయని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. 

Updated Date - 2022-07-19T06:18:03+05:30 IST