ఆర్మీలోకి వెళ్తాడనుకుంటే జైలు కెళ్లాడు..

ABN , First Publish Date - 2022-06-28T16:23:35+05:30 IST

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మల్కాజిగిరిలో నిర్వహించిన శాంతి సత్యాగ్రహ దీక్షలో ఓ మాతృమూర్తి కన్నీరుమున్నీరైంది

ఆర్మీలోకి వెళ్తాడనుకుంటే జైలు కెళ్లాడు..

విలపించిన మాతృమూర్తి 

హైదరాబాద్/మల్కాజిగిరి: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మల్కాజిగిరిలో నిర్వహించిన శాంతి సత్యాగ్రహ దీక్షలో ఓ మాతృమూర్తి కన్నీరుమున్నీరైంది. టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరైన కార్యక్రమంలో ఇటీవల సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో జైలుకు వెళ్లిన ఓ యువకుడి తల్లి బోరున విలపించారు. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌కు చెందిన రాజానరేంద్రకుమార్‌ తల్లి వరలక్ష్మి సభకు హజరయ్యారు. సభలో ఆమె రేవంత్‌ను కలిసి తన కుమారుడు రెండేళ్లు సైనిక శిక్షణ పొంది,  అన్ని సెలక్షన్లలో పాసై ఉద్యోగానికి వెళ్తాడనుకుంటే.. ఇటీవల జరిగిన అగ్నిపథ్‌ ఆందోళనలో తన కుమారుడిని జైలుకు పంపారంటూ బోరున విలపించింది. తన కుమారుడికి ఆందోళనలో సంబంధం లేదని, తన కుమారుడిని రక్షించాలని వెక్కివెక్కి ఏడ్చింది. రేవంత్‌ ఆమెను ఓదార్చారు. 


జైలులో కుటుంబసభ్యుల ములాఖత్‌

సైదాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసం కేసులో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ములాఖత్‌లో కలిసేందుకు కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కుటుంబసభ్యులు తెల్లవారుజాము నుంచే జైలు వద్ద పడిగాపులు కాశారు. ఈ విధ్వంసంలో తమ పిల్లలకు సంబంధం లేకపోయినా అరెస్ట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-06-28T16:23:35+05:30 IST