Violence after Friday Prayers : పశువును బాదినట్లు బాదారు : ఓ తల్లి ఆవేదన

ABN , First Publish Date - 2022-06-16T22:23:08+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జూన్ 10న శుక్రవారం ప్రార్థనల అనంతరం

Violence after Friday Prayers : పశువును బాదినట్లు బాదారు : ఓ తల్లి ఆవేదన

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జూన్ 10న శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాకాండలో ఓ నిందితుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. చెయ్యి విరిగిపోయిందని చెప్పినప్పటికీ పోలీసులు వదిలిపెట్టలేదని చెప్పారు. బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ హింసాకాండ జరిగింది. 


పందొమ్మిదేళ్ళ మహమ్మద్ అలీ సహరాన్‌పూర్‌ (Saharanpur)లోని పీర్ గలీలో ఉంటున్నారు. ఆయనను ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు కొట్టినట్లు కనిపిస్తున్న వీడియోను చూస్తూ  ఆయన తల్లి ఆష్మా ఖాటూన్ తీవ్రంగా విలపించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, పోలీసులు తన కుమారుడిని తీవ్రంగా కొట్టారని చెప్పారు. చెయ్యి విరిగిపోయిందని చెప్పినప్పటికీ వినకుండా పశువును బాదినట్లు బాదారని తెలిపారు. అయితే ఈ వీడియో ఈ ప్రాంతానికి చెందినది కాదని పోలీసులు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జూన్ 10న శుక్రవారం ప్రార్థనల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో అరెస్టయిన 84 మందిలో అలీ ఒకరు. కొందరిని పోలీస్ స్టేషన్‌లో తీవ్రంగా కొడుతున్నట్లు కనిపిస్తున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఈ ప్రాంతంలో చిత్రీకరించినది కాదని పోలీసు అధికారులు తెలిపారు. 


ఇదిలావుండగా, ఈ కేసులో అరెస్టయిన నిందితుల బంధువులు తమ ఇళ్ళను కూల్చేస్తారేమోనని భయపడుతున్నారు. ఆష్మా మాట్లాడుతూ, తాను తన కుమారునికి బెయిలు కోసం ప్రయత్నిస్తుండగా, ఖాకీ దుస్తులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తమ ఆస్తుల గురించి వాకబు చేశారని చెప్పారు. 


మరో నిందితుడి బంధువు జావేద్ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు తమ ఇంటికి వచ్చారని, తమ ఇంటి విద్యుత్తు కనెక్షన్, ఆస్తి వివరాలను అడిగారని చెప్పారు. తాము నగర నిగమ్ (పురపాలక సంఘం) నుంచి వచ్చామని చెప్పారని తెలిపారు.  వారు తమ ఇంటిని కూల్చేస్తారేమోనని భయంగా ఉందన్నారు. 


వార్డు కార్పొరేటర్ మన్సూర్ బదర్ మాట్లాడుతూ, సహరాన్‌పూర్‌లో వేలాది ఇళ్ళను అక్రమంగా నిర్మించారని, కేవలం ఈ కేసులో నిందితులకు చెందిన ఇళ్ళను మాత్రమే పరిశీలిస్తున్నారని, ఇది లక్షిత దాడి అని చెప్పారు. 


సహరాన్‌పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ వీసీ ఆశిష్ కుమార్ మాట్లాడుతూ, అల్లర్ల కేసులో నిందితుల ఇళ్ళను గుర్తించామని, ఇదంతా మామూలుగా జరిగే ప్రక్రియలో భాగమేనని తెలిపారు. 


ఇదిలావుండగా, తమ పిల్లలు అమాయకులైనప్పటికీ పోలీసులు అరెస్టు చేశారని కొందరు మహిళలు తెలిపారు. 


Updated Date - 2022-06-16T22:23:08+05:30 IST