ఇంటర్నెట్ డెస్క్: నవమాసాలు కడుపులో పెరిగి.. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డకు ఓ మాతృమూర్తి వెల కట్టింది. రూ. 1500కు బేరం కుదుర్చుకుని.. 9 నెలల చిన్నారిని వేరొక మహిళ చేతిలో పెట్టింది. ఈ విషయం గురించి తెలుసుకున్న మరో మహిళ.. ‘అరెరె రూ.1500 కే నీ బిడ్డను వేరే ఆవిడకు ఇచ్చేశావా.. నేనైతే రూ.20వేలు ఇచ్చేదాన్ని’ అని అనడంతో.. డబ్బుపై ఆశతో బిడ్డ కోసం ఆ తల్లి పరుగులు పెట్టిన ఘటన బిహార్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మనోజ్ పాశ్వన్ అతని భార్య రీనా దేవీ భగ్వాన్పుర పోలీస్ స్టేషల్ పరిధిలోని మధేపురా వార్డ్ నెంబర్ 4లో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులిద్దరూ తొమ్మిది నెలల క్రితం పాపకు జన్మనిచ్చారు. కాగా.. కొద్ది రోజులుగా రీనా దేవీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. ఆ దంపతులు తమ కుమార్తెను అమ్మెందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న.. రామ్ పరీ దేవీ అనే మహిళ.. ఆ దంపతులను సంప్రదించింది. రూ.1500లకు దంపతులకు దగ్గర నుంచి పాపను కొనుక్కుంది. ఇది జరిగి కొన్ని రోజులు గడిచిపోయాక.. మరో మహిళ పాప కోసం మనోజ్ పాశ్వన్ దంపతులను సంప్రదించింది.
చిన్నారిని వేరే మహిళ కొనుక్కుందనే విషయం తెలుసుకుని.. ‘నేనైతే.. రూ. 20వేలు ఇచ్చేదాన్ని’ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇది విన్న రీనా దేవీ.. కీలక నిర్ణయం తీసుకుంది. పాపను పరీ దేవీ నుంచి తీసుకుని.. 20వేలకు అమ్ముకోవాలని డిసైడ్ అయింది. ఈ క్రమంలోనే పరీ దేవిని సంప్రదించింది. తన పాపను తనకు ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. అయితే అందుకు పరీ దేవీ అంగీకరించలేదు. కొన్ని రోజులుగా ఈ వాగ్వాదం జరగుతుండగా.. తాజాగా ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకుని.. స్థానికుల ద్వారా విషయం మొత్తాన్ని కూపీ లాగారు. అనంతరం ఈ పంచాయితీని ఎటూ తేల్చకుండానే.. తిరిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా.. ప్రస్తుతం ఆ 9 నెలల చిన్నారి.. ప్రస్తుతం పరీ దేవీ వద్దే ఉండగా.. ఈ కేసుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం స్థానికంగా ఆసక్తికరంగా మారింది.