నిరాడంబరంగా శబరి స్మృతి యాత్ర

ABN , First Publish Date - 2020-11-01T07:02:41+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శబరి స్మృతి యాత్ర శనివారం నిరాడంబరంగా ఆలయ వైదిక, పరిపాలన సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు

నిరాడంబరంగా శబరి స్మృతి యాత్ర

భద్రాచలం, అక్టోబరు 31: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శబరి స్మృతి యాత్ర శనివారం నిరాడంబరంగా ఆలయ వైదిక, పరిపాలన సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో ఈసారి యాత్రకు గిరిజనులను ఆహ్వానించకుండానే సంప్రదాయబద్ధంగా జరిగే పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శబరిమాత రామునికి పండ్లు తినిపిస్తున్న చిత్రపటంతో రామాలయం నుంచి మేళతాళాలతో బయలుదేరిన అర్చక, పరిపాలన సిబ్బంది ముందుగా వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విస్తా కాంప్లెక్సు ఆవరణలో ఉన్న తూము లక్ష్మీనరసింహదాసు విగ్రహంకు, ఉత్తర ద్వారం వద్ద ఉన్న భక్తరామదాసు విగ్రహానికి, హరిత హోటల్‌ వద్ద ఉన్న శబరిమాత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన వస్త్రాలు సమర్పించారు. 


అనంతరం రామాలయానికి చేరుకొని సేకరించిన అటవీ ఫలాలు, వివిధ ఫల పుష్పాలతో స్వామి వారికి నైవేద్యం సమర్పించారు.  నిత్యకల్యాణ మండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారికి నిత్య కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా గిరిజనులకు సంప్రదాయబద్ధంగా అందజేసే సారెను ఆలయంలో విధులు నిర్వహించే  సిబ్బంది కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రావణ్‌కుమార్‌, ఆలయ పర్యవేక్షకులు కత్తి శ్రీనివాసు, లింగాల సాయిబాబా, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, దేవస్థానం ఆస్థాన పారాయణదారులు ఎస్టీజీ అంతర్వేది కృష్ణమాచార్యులు, అమరవాది విజయరాఘవన్‌, వైదిక పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-01T07:02:41+05:30 IST