న్యూఢిల్లీ : వృద్ధాప్యం రావడాన్ని ఆలస్యం చేసే మందు మరో ఇరవయ్యేళ్ళలో రాబోతోందని పరిశోధకులు చెప్తున్నారు. ముసలితనం పలకరింపును ఆలస్యం చేయడంలో మైటోకాండ్రియా కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. వృద్ధాప్యం రావడానికి ముఖ్యంగా రెండు లోపాలు కారణమవుతున్నాయని, ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో వాటి జీవిత కాలం 24 శాతం పెరిగిందని చెప్తున్నారు.
బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లో మెడిసిన్-ఎండోక్రినాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజగోపాల్ విశ్వనాథ్ శేఖర్ మాట్లాడుతూ, ముసలితనం రావడాన్ని ఆలస్యం చేయడంలో మైటోకాండ్రియా ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. ఆయన ఎలుకల జీవిత కాలాన్ని 24 శాతం పెంచడానికి దోహదపడిన యాంటీ ఏజింగ్ సప్లిమెంట్‌కు సంబంధించిన అధ్యయనం సీనియర్ ఆథర్.
ముఖ్యంగా మన శరీరంలోని మైటోకాండ్రియల్ సక్రమంగా పని చేయకపోవడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల మానవులు వృద్ధులవుతున్నారని డాక్టర్ శేఖర్ చెప్పారు. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల శరీరంలోని మైటోకాండ్రియల్తోపాటు మన సెల్స్‌లోని ఇతర భాగాలకు హాని జరుగుతుందని చెప్పారు. తమ బృందం నిర్వహించిన పరీక్షల్లో ఉపయోగించిన యాంటీ ఏజింగ్ సప్లిమెంట్ ఈ సమస్యలను తగ్గించేందుకు దోహదపడిందని తెలిపారు. గ్లుటాథియోన్లోని వ్యాధిని నయం చేయడం ద్వారా ఈ సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడిందన్నారు. గ్లుటాథియోన్ అనేది సెల్స్‌లో కనిపించే సహజ యాంటీయాక్సిడెంట్ అని తెలిపారు. ఇది మన శరీరాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి పరిరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. అదేవిధంగా మెర్క్యురీ, ఇతర టాక్సిక్ మెటల్స్ నుంచి కూడా ఇది కాపాడుతుందని వివరించారు.
మన వయసు పెరుగుతున్నకొద్దీ మన శరీరాల్లోని గ్లుటాథియోన్ స్థాయులు తగ్గుతాయన్నారు. ఫలితంగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుందని, మైటోకాండ్రియల్ పని చేసే సామర్థ్యం తగ్గుతుందని తెలిపారు. వీటన్నిటి వల్ల కండరాల బలం తగ్గుతుందని, మన మెటాబొలిజంలో లోపాలు ఏర్పడతాయని చెప్పారు. మన శరీరానికి ముసలితనం రావడానికి ముఖ్యమైన గుర్తుగా వీటిలో ప్రతి ఒక్క సమస్యనూ పరిగణిస్తారన్నారు.
GlyNAC అనే సప్లిమెంట్‌ను వాడటం వల్ల ఎలుకల జీవిత కాలాన్ని పెంచగలిగినట్లు తెలిపారు. గ్లుటాథియోన్ లోపాన్ని సరిదిద్దడం ద్వారా దీనిని సాధించామని చెప్పారు. ఆక్సిడేట్ స్ట్రెస్‌ను తగ్గించడానికి, చాలా ముఖ్యమైన మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ను తగ్గించడానికి ఇది దోహదపడిందన్నారు. అయితే వృద్ధాప్యం రావడం ఆలస్యమయ్యే విధంగా చేయడంలో GlyNAC ఉపయోగపడుతుందని చెప్పడానికి ఇంకా అనేక పరీక్షలు, పరిశోధనలు జరగవలసి ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి