Delhi Encounter : దోపిడీ ముఠాలో ఓ వ్యక్తి మృతి... ముగ్గురి అరెస్ట్...

ABN , First Publish Date - 2022-07-09T19:26:58+05:30 IST

రాజధాని నగరం ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ఏరియాలో ఓ దోపిడీ

Delhi Encounter : దోపిడీ ముఠాలో ఓ వ్యక్తి మృతి... ముగ్గురి అరెస్ట్...

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పూర్ ఏరియాలో ఓ దోపిడీ ముఠా, పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆ ముఠాకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. ఈశాన్య ఢిల్లీ డీసీపీ సంజయ్ కుమార్ సెయిన్ శనివారం ఈ వివరాలను తెలిపారు. 


సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో యమున కడర్ ప్రాంతంలో గాయపడిన ఓ వ్యక్తిని పోలీసు బృందం గుర్తించిందని తెలిపారు. తన పేరు తుషార్ అని, తనపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసి, తన మొబైల్ ఫోన్‌ను లాక్కుని, తనను కత్తితో పొడిచి, గాయపరిచారని స్టేట్‌మెంట్ ఇచ్చారని చెప్పారు. వెంటనే తమ పోలీసు బృందం కడర్ ప్రాంతానికి వెళ్ళి, గాలింపు జరిపిందన్నారు. అక్కడే ఉన్న అటవీ ప్రాంతంలో ఎనిమిది మంది అనుమానితులను గుర్తించినట్లు తెలిపారు. వారిని ఆపేందుకు ప్రయత్నించినపుడు, వారిలో ఒకరు పోలీసులపైకి కాల్పులు జరిపాడని చెప్పారు. వారిని లొంగిపోవాలని పోలీసులు కోరినప్పటికీ, వారు కాల్పులను కొనసాగించారని, దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని చెప్పారు.  ఈ సంఘటనలో ఆకాశ్ వురపు ఇల్లు ప్రాణాలు కోల్పోయాడని, విశాల్ నేగి (25), మోను (20), నిఖిల్ దత్ (19)లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరణించిన ఆకాశ్ ఏడు దోపిడీ కేసుల్లో నిందితుడని చెప్పారు. జూన్ 6న ఆయన బెయిలుపై విడుదలైనట్లు తెలిపారు. 


అరెస్టయిన ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించినపుడు మోను, నిఖిల్ యువతుల మాదిరిగా ఆకర్షణీయమైన దుస్తులను ధరించి, యమున కడర్ ప్రాంతంలో నిల్చుని, ఆ దారిలో వెళ్ళేవారిని ఆకర్షిస్తూ ఉండేవారని తెలిసిందన్నారు. వారితో మాట్లాడేవారి వద్ద ఉన్న సొమ్ము, వస్తువులను దోచుకునేవారని వెల్లడైందన్నారు. రెండు రోజుల క్రితం సుమారు తొమ్మిది మంది కలిసి పోలీసు గస్తీ బృందంపై దాడి చేశారన్నారు. వారిపై కేసును నమోదు చేశామన్నారు. దోపిడీలు, దొంగతనాలను నిరోధించాలనే లక్ష్యంతో ఇటువంటి సంఘటనల తీరును విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-07-09T19:26:58+05:30 IST