మద్యం తాగి డ్యూటీకి రావద్దన్నందుకు బైక్‌తో ఢీ కొట్టాడు!

ABN , First Publish Date - 2020-05-27T14:34:47+05:30 IST

మద్యం తాగి విధులకు రావద్దన్నందుకు తోటి ఉద్యోగిని

మద్యం తాగి డ్యూటీకి రావద్దన్నందుకు బైక్‌తో ఢీ కొట్టాడు!

హైదరాబాద్/మెహిదీపట్నం : మద్యం తాగి విధులకు రావద్దన్నందుకు తోటి ఉద్యోగిని బైక్‌తో వెనుక నుంచి ఢీ కొట్టి బండరాయితో మోదాడు. దీంతో ఉద్యోగి కాళ్లు, చేతులు విరిగాయి. వివరాల్లోకి వెళితే... గండిపేట మండలం కోకాపేట్‌కు చెందిన లంబోలమ్‌ వెంకటేశ్‌ యాదవ్‌ (44) 15 ఏళ్లుగా విద్యుత్‌ శాఖ గ్రేడ్‌ - 2 ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. తోటి ఉద్యోగి (మొఘల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన) పృథ్వీ  అప్పుడప్పుడు మద్యం తాగి విధులకు వస్తున్నాడు. ఈ నెల 22న వెంకటేశం యాదవ్‌కు ఏడీఈ (పై అధికారి) ఫోన్‌ చేసి కార్యాలయానికి ఎవరెవరు వచ్చారనే సమాచారం సేకరించారు. ఆ సమయంలో పృథ్వీ లేకపోవడంతో ఆయన విఽధులకు హాజరు కాలేదని తెలిపారు. పృధ్వీకి ఏడీఈ ఫోన్‌ చేసి విధులకు ఎందుకు వెళ్లలేదని మందలించారు.


పరిసర ప్రాంతాల్లోనే ఉన్న పృధ్వీ హుటాహుటిన కార్యాలయానికి వెళ్లాడు. వెంకటేశం యాదవ్‌ను దుర్భాషలాడాడు. దీంతో లంగర్‌హౌజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నడుచుకుంటూ వెళ్తున్న వెంకటేశ్‌ యాదవ్‌ను  మద్యం మత్తులో ఉన్న పృథ్వీ వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లి ఢీకొట్టాడు. అతడిపై బండరాయితో మోదాడు. ఈ దాడిలో వెంకటేశ్‌ కాళ్లు, చేయి విరిగాయి. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దీనిపై వెంకటేశం యాదవ్‌ తండ్రి కృష్ణ యాదవ్‌ లంగర్‌హౌజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పృథ్వీ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. తనపై దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని బాధితుడు వెంకటేశ్‌ యాదవ్‌ కోరారు. 

Updated Date - 2020-05-27T14:34:47+05:30 IST