ప్రమాణ స్వీకారానికి బైడెన్ రెడీ అవుతున్న వేళ.. అమెరికాలో అలజడి!

ABN , First Publish Date - 2021-01-18T01:40:57+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అవుతున్న వేళ.. తుపాకీ, 500 రౌండ్ల బులెట్లతో ఓ వ్యక్తి పట్టుబడ్డ ఘటన అగ్రరాజ్యంలో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3న జ

ప్రమాణ స్వీకారానికి బైడెన్ రెడీ అవుతున్న వేళ.. అమెరికాలో అలజడి!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం అవుతున్న వేళ.. తుపాకీ, 500 రౌండ్ల బులెట్లతో ఓ వ్యక్తి పట్టుబడ్డ ఘటన అగ్రరాజ్యంలో కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించారు. ఆయన గెలుపును యూఎస్ కాంగ్రెస్ కూడా ధ్రువీకరించింది. ఈ క్రమంలో అగ్రరాజ్య 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఈనెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాగా.. బైడెన్ బాధ్యతలు స్వీకరించే తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో.. ట్రంప్ మద్దతుదారలు మరోసారి అల్లర్లకు తెగబడే అవకాశం ఉన్నట్టు ఎఫ్‌బీఐకి ఇప్పటికే సమాచారం అందింది. 



ఈ క్రమంలో దేశ రాజధాని వాషింగ్టన్‌ను భద్రతా బలగాలు పూర్తిగా దిగ్భందించాయి. వాషింగ్టన్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజధాని సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్ వద్ద.. ఓ వ్యక్తి తుపాకీ, 500రౌండ్ల బులెట్లతో పట్టుపడ్డాడు. దీంతో అధికారులు అతన్ని అదపులోకి తీసుకున్నారు. కాగా.. పట్టబడ్డ వ్యక్తిని.. వర్జీనియా రాష్ట్రానికి చెందిన వెస్లీ బీలర్‌గా అధికారులు గుర్తించారు. భద్రతాధికారుల కళ్లు గప్పి బైడెన్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు ఇతను ఓ నకిలీ పాసును కూడా సృష్టించుకున్నట్టు అధికారులు గుర్తించారు. బైడెన్ ప్రమాణ స్వీకారాన్ని సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఈ ఘటన అమెరికాలో కలకలం రేపింది. ఇదిలా ఉంటే.. బైడెన్ గెలుపును ప్రశ్నిస్తూ ఈనెల 6న కేపిటల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారులు అల్లర్లు చేసిన విషయం తెలిసిందే.


Updated Date - 2021-01-18T01:40:57+05:30 IST