ఖాకీ ముసుగులో కామ పిశాచి?

ABN , First Publish Date - 2022-07-10T10:00:20+05:30 IST

హైదరాబాద్‌ మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) ఇన్‌స్పెక్టర్‌ కోరట్ల నాగేశ్వరరావు (45) తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురంనకు చెందిన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది.

ఖాకీ ముసుగులో కామ పిశాచి?

  • మహిళపై మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ అత్యాచార ఆరోపణ
  • కణతపై తుపాకీ పెట్టి బెదిరించి రాత్రివేళ ఘాతుకం
  • పోలీస్‌స్టేషన్‌లో శనివారం వివాహిత ఫిర్యాదు 
  • క్రెడిట్‌ కార్డు మోసం కేసు నిందితుడి భార్యపై సీఐ కన్ను
  • మూడేళ్లుగా వేధింపులు.. భర్త లేడని గుర్తించి ఇంట్లోకి
  • తలుపు తోసుకువచ్చి సీఐని చితకబాదిన మహిళ భర్త
  • తుపాకీతో భర్తను కొట్టిన పోలీస్‌ అధికారి
  • చెబితే చంపేస్తానని 5 గంటలపాటు వేధింపులు
  • సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కిరాతకం ఆలస్యంగా వెలుగులోకి
  • పరారీలో సీఐ.. సస్పెండ్‌ చేసిన కమిషనర్‌ సీవీ ఆనంద్‌


హైదరాబాద్‌ సిటీ/వనస్థలిపురం, జూలై 9(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మారేడ్‌పల్లి ఠాణా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో) ఇన్‌స్పెక్టర్‌ కోరట్ల నాగేశ్వరరావు (45) తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వనస్థలిపురంనకు చెందిన ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. తనను, భర్తను రివాల్వర్‌తో బెదిరించారని.. వేధింపులకు గురిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులోని అంశాల ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌పై అత్యాచారం, హత్యాయత్నం, అపహరణ కేసులను పోలీసులు నమోదు చేశారు. అనంతరం ఇన్‌స్పెక్టర్‌ కోరట్ల నాగేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. మహిళ ఫిర్యాదులోని అంశాలతో పాటు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండకు చెందిన యువకుడు (35) కొన్నేళ్ల క్రితం భార్యాపిల్లలతో నగరానికి వచ్చాడు. వనస్థలిపురంలో ఉంటూ క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన సంస్థలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో 2018లో కార్డు క్లోనింగ్‌పై ఓ కేసు నమోదైంది. అప్పటి టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావు దీనిని పర్యవేక్షించారు. పరిశోధనలో భాగంగా దేవరకొండ యువకుడిని నిందితుడిగా విచారించారు. అనంతరం అతడిని తన ఫామ్‌హౌజ్‌, పొలంలో పనికి పెట్టుకున్నారు. గతేడాది మార్చిలో ఇన్‌స్పెక్టర్‌ ఫోన్‌ చేసినా యువకుడు స్పందించలేదు. దీంతో   అతడి ఇంటికి వెళ్లి భార్యను ఆరా తీశారు. ఆమెపై కన్నేసి.. ‘‘నీ భర్త ఎక్కడున్నాడో చూద్దాం’’ అంటూ కారు ఎక్కించుకుని ఫామ్‌హౌజ్‌కు తీసుకెళ్లారు. సీఐ దురుద్దేశాన్ని గుర్తించిన మహిళ భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. దీంతో యువకుడు.. ఇన్‌స్పెక్టర్‌ను ఫోన్‌లో నిలదీశాడు. ‘‘ఈ విషయం నీ భార్య, పిల్లలకు చెప్తా’’ అని హెచ్చరించాడు. దీంతో దంపతులకు పోలీస్‌ క్షమాపణ చెప్పారు.


కార్యాలయానికి పిలిచి చిత్రహింసలు

తనకు అవమానం జరిగిందని భావించిన నాగేశ్వరరావు ఆ మరుసటి రోజు సిబ్బందిని పంపి టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి రప్పించారు. ‘‘నా దగ్గర పనిచేసేవాడివి. నాతోనే గొడవపడ పడతావా..?’’ అంటూ భార్య కళ్లముం దే భర్తను విపరీతంగా కొట్టించారు. గంజాయి ప్యాకెట్లు చేతిలో పెట్టి ఫొటోలు, వీడియోలు తీయించారు. ఇంతకుముందటి ఘటనను ఎక్కడైనా చెబితే గంజాయి కేసులో అరెస్టు చేసిజైల్లో వేస్తానని, నీ భార్యను వ్యభిచారం కేసు లో జైలుకు పంపుతానని బెదిరించారు. కాగితంపై రాయించుకుని సంతకం చేయించుకుని వదిలేశారు.


ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేస్తూ..

ఈ వివాదమంతా సద్దుమణిగినా.. యువకుడి భార్యపై కన్నేసిన సీఐ అంతటితో వదలిపెట్టలేదు. మహిళ భర్త ఫోన్‌ సిగ్నల్స్‌ను ట్రేస్‌ చేయడం ప్రారంభించారు. అతడు ఇంట్లో లేని సమయంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న మహిళ భర్త ఫోన్‌ సిగ్నల్స్‌ వేరే జిల్లాలో ఉన్నట్లు, ఆమె సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ హైదరాబాద్‌లోని ఇంట్లోనే ఉన్నట్లు చూపించాయి. దీంతో ఇన్‌స్పెక్టర్‌ వాట్సాప్‌ కాల్‌ చేసి తనతో గడపాలని కోరారు. బాధితురాలు భర్తకు విషయం చెప్పింది.అతడి సూచనతో వనస్థలిపురంలోనే ఉంటున్న వరుసకు సోదరి ఇంటికి వెళ్లిపోయింది. ఇదిలా ఉండగా.. మహిళకు 4 రోజుల క్రితం కరోనా వచ్చింది. పిల్లలకు ఇబ్బంది అవుతుందని ఆమె భర్త వారిని ఊరిలో వదిలేసి రావడానికి వెళ్లాడు. వారి కాలక్షేపానికి తన ఫోన్‌ ఇచ్చాడు. భార్యను ఇన్‌స్పెక్టర్‌ వేధించిన విషయం తెలిసి గురువారం ఉదయం వనస్థలిపురం వచ్చాడు. అయితే, మహిళ భర్త ఫోన్‌ సిగ్నల్స్‌ ఊరిలోనే ఉన్నట్లు చూపిస్తుండటంతో.. ఇదే అవకాశంగా ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు గురువారం రాత్రి 9:30కు కారులో వారి ఇంటికి వెళ్లారు.


రాత్రంతా మోకాళ్లపై కూర్చోబెట్టి

ఇన్‌స్పెక్టర్‌ వచ్చిన ఆ సమయంలో.. మహిళ భర్త టిఫిన్‌ తెచ్చేందుకు బయటకు వెళ్లాడు. దౌర్జన్యంగా ఇంట్లోకి వెళ్లిన ఇన్‌స్పెక్టర్‌ అరవొద్దంటూ తుపాకీ తీసి బెదిరించారు. కణతపై గురిపెట్టారు. ఆ తర్వాత అత్యాచారం చేశారు. ఇంతలోనే మహిళ భర్త ఇంటికి వచ్చాడు. సీఐ కారును గుర్తించాడు. తలుపులు కొడితే భార్య తీయలేదు. దీంతో కాలితో తలుపును తన్నితీశాడు. కోపంతో రగిలిపోతూ కర్రతో ఇన్‌స్పెక్టర్‌ను కొట్టాడు. అయితే, ఇన్‌స్పెక్టర్‌ ప్రతిఘటించి తుపాకీతో తలపై మోదారు. భార్యాభర్తలను రాత్రి 10:30 నుంచి తెల్లవారుజామున 3:30 వరకు 5 గంటలపాటు మోకాళ్లమీద కూర్చోబెట్టి హింసించారు. వెంటనే హైదరాబాద్‌ వదిలేసి ఊరికి వెళ్లిపోవాలని, తిరిగి రావొద్దని బెదిరించారు. ఈ విషయం బయటపెడితే గంజాయి ప్యాకెట్లతో తీసిన ఫొటోలు, వీడియోల ఆధారంగా జైలుకు పంపుతానని, నీ భార్యను వ్యభిచారిగా చిత్రీకరించి జైలుకు పంపుతానని యువకుడిని హెచ్చరించారు. పక్కింటివాళ్లు ఏమైందని అడగడానికి వస్తే ట్రంకు పెట్టె కిందపడిందని చెప్పించారు.


తుపాకీ గురిపెట్టి కారును తోలించి

ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు తెల్లవారుజామున భార్యభర్తలను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. యువకుడిని డ్రైవింగ్‌ చేయమని తాను పక్కన కూర్చుని గన్‌తో బెదిరిస్తూనే కారును దేవరకొండ వైపు తీసుకెళ్లాలని సూచించారు. యువకుడు కోపంతో వేగంగా పోనిచ్చాడు. ఇబ్రహీంపట్నం చెరువుకట్ట వద్దకు వెళ్లగానే కారు టైర్‌ పేలి పల్టీలు కొట్టి ఆగిపోయింది. యువకుడు, ఇన్‌స్పెక్టర్‌ బయటపడ్డారు. మహిళ వెనుక సీట్లో ఉండిపోయింది. డోర్‌లు లాక్‌ అయ్యాయి. ఇన్‌స్పెక్టర్‌ దూరంగా వెళ్లి కల్వర్టుపై కూర్చోగా.. యువకుడు కారులోంచి భార్యను బయటకు తీశాడు. కారు సీటు కిందపడిన ఇన్‌స్పెక్టర్‌ రెండు ఫోన్‌లను తీసుకొని, భార్యతో చెరువుకట్ట ఎక్కి పరుగు తీశాడు. ఇంతలో    ఆర్టీసీ సిటీ బస్సు రావడంతో ఆపి ఎక్కారు. వనస్థలిపురం వచ్చాక బంధువుల ఇంటికి వెళ్లి చెప్పారు. వారి సలహాతో వనస్థలిపురం పోలీసుల కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ విషయాన్ని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు నాగేశ్వరరావుపై అత్యాచారం, కిడ్నాప్‌, హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నాగేశ్వరరావు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం. బాధిత మహిళకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. నిజంగానే ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు ఈ దారుణానికి ఒడిగట్టాడా..? లేక పథకం ప్రకారం ఇరికించారా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు.


ప్రతిచోటా దందాలే.. ఎమ్మెల్యేలూ బేఖాతరు

ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు పనిచేసిన ప్రతిచోట భూ దందాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయి. మీడియా ప్రతినిధులతో కలిసి దందాలు చేస్తారని ఆరోపణలున్నాయి. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు కోసం రాత్రికి రాత్రి రాడిసన్‌ బ్లూ పబ్‌  మీద రైడింగ్‌కు వెళ్లారు.పై రైడ్‌ చేసి పేరు తెచ్చుకున్నారు. 3 నెలల క్రితం ఆ పోస్ట్‌ సాధించారు. భారీ మొత్తంలో డబ్బు తీసుకుని ఫినిక్స్‌ అనే సంస్థకు మేలు చేకూర్చారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 60 మందిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేలను ఖాతరు చేయలేదు. ఉన్నతాఽధికారుల ఆగ్రహానికి కూడా గురయ్యారు. దీంతో మారేడ్‌పల్లికి బదిలీ అయ్యారు. 12 రోజుల కిందట బాధ్యతలు తీసుకున్నారు. తాజాగా మహిళపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదుతో నాగేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


ఆ కారు ఆయనదే.. ఇబ్రహీంపట్నంలో కేసు

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం చెరువు కట్ట కింద రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున ఓ కారు టైర్‌ పేలి ప్రమాదానికి గురైనట్లు ఠాణాలో సుమోటో కేసు నమోదైంది. ఆర్టీసీ డ్రైవర్‌ ఒకరు.. కారు రోడ్డుకు అడ్డంగా ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కారులో ఎవరూ లేకపోగా ప్రమాదం జరిగిన చోటే వదిలేసి వెళ్లారు. కాగా ఈ కారు (స్విఫ్ట్‌ డిజైర్‌, టీఎ్‌స09ఈఏ0633)ను మారేడ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావుగా గుర్తించారు.

Updated Date - 2022-07-10T10:00:20+05:30 IST