స్త్రీలలో పొంచి ఉన్న థైరాయిడ్‌ క్యాన్సర్‌ ముప్పు

ABN , First Publish Date - 2022-09-20T20:32:16+05:30 IST

పురుషులతో పోలిస్తే, థైరాయిడ్‌ క్యాన్సర్‌ మహిళల్లో మూడు రెట్లు ఎక్కువ. అయితే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే

స్త్రీలలో పొంచి ఉన్న థైరాయిడ్‌ క్యాన్సర్‌ ముప్పు

పురుషులతో పోలిస్తే, థైరాయిడ్‌ క్యాన్సర్‌ మహిళల్లో మూడు రెట్లు ఎక్కువ. అయితే ఈ క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే తేలికగా నయం చేయవచ్చు. థైరాక్సిన్‌ హార్మోన్‌ను విడుదల చేసే థైరాయిడ్‌ గ్రంథి, మెడ దిగువ భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. శరీర జీవక్రియలలో కీలక పాత్ర పోషించే ఈ గ్రంథి హార్మోన్లను విడుదల చేసే పెద్ద గ్రంథి. టి3, టి4, టిఎస్‌హెచ్‌ పరీక్షల ద్వారా థైరాయిడ్‌ హార్మోన్‌ హెచ్చుతగ్గులను కనిపెట్టవచ్చు. 


హార్మోన్‌ హెచ్చుతగ్గులను తెలిపే లక్షణాలు

  • బరువు పెరగడం
  • బరువు బాగా తగ్గడం
  • వెంట్రుకలు రాలడం
  • అవాంఛిత రోమాల పెరుగుదల
  • గుండె దడ
  • నెలసరిలో అవకతవకలు
  • కళ్లు బయటకు వచ్చినట్టు ఉండడం
  • మానసిక స్థితిలో మార్పులు కనిపించడం


థైరాయిడ్‌ క్యాన్సర్‌ కారణాలు

థైరాయిడ్‌ గ్రంథి మీద గడ్డ లేదా కణితి అపరిమితంగా పెరగడమే థైరాయిడ్‌ క్యాన్సర్‌. ఎక్కువ మందిలో వయసు పెరిగేకొద్దీ కనిపించే కణుతుల్లో 95 శాతం వరకూ క్యాన్సర్‌ కాని కణుతులే ఉంటాయి. సాధారణంగా జన్యుపరమైన ఉత్పరివర్తనాలు, రేడియేషన్‌కు ఎక్కువగా గురవడం, న్యూక్లియర్‌ పవర్‌ప్లాంట్స్‌కు దగ్గరగా ఉండడం, కుటుంబ చరిత్రలో గాయిటర్‌ (థైరాయిడ్‌ గ్రంథి వాపు) తదితర సమస్యలు థైరాయిడ్‌ క్యాన్సర్‌కు దారి తీసే అవకాశాలుంటాయి.


ఎక్కువ మందిలో కనిపించే థైరాయిడ్‌ క్యాన్సర్‌

ధైరాయిడ్‌ క్యాన్సర్‌ ఐదు రకాలు. వీటిలో పాపిలరీ క్యాన్సర్‌ ఒకటి. థైరాయిడ్‌ క్యాన్సర్లలో 80 శాతం కనిపించేవి ఈ క్యాన్సర్లే! తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళ తీర ప్రాంత ప్రజల్లో ఈ రకం క్యాన్సర్‌ ఎక్కువ. పిల్లలు రేడియేషన్‌కు గురైనప్పుడు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది. రెండవది ఫాలిక్యులర్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌. మూడవది బెడ్యులరీ థైరాయిడ్‌ క్యాన్సర్‌. నాల్గవది ఎనోప్లాసిక్టక్‌ థైరాయిడ్‌ క్యాన్సర్‌. ఇదెంతో తీవ్రమైన, అరుదైన క్యాన్సర్‌. ఐదవది థైరాయిడ్‌ లింఫోమా.


లక్షణాలు

  • గొంతు బొంగురుపోవడం
  • మెడ భాగంలో గడ్డ ఏర్పడడం
  • మింగడంలో ఇబ్బంది తలెత్తడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • లింఫ్‌ నాళాల్లో నొప్పి, వాపు


ఈ పరీక్షలతో కనిపెట్టవచ్చు

అల్ట్రాసౌండ్‌, నీడిల్‌ బయాప్సీ, న్యూక్లియర్‌ స్కాన్‌, సిటి స్కాన్‌, ఎమ్మారై, థైరాయిడ్‌ ఇమేజింగ్‌ పరీక్షల ద్వారా థైరాయిడ్‌ క్యాన్సర్‌ను నిర్ధారించడంతో పాటు వ్యాధి దశ, ఎంతవరకూ వ్యాపించిందనే విషయాలను తెలుసుకోవచ్చు.


వ్యాధి తీవ్రత ఆధారంగా చికిత్సా పద్ధతులు

థైరాయిడ్‌ క్యాన్సర్‌ రకం, దశల ఆధారంగా చికిత్స అందించవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కణితి లేదా పూర్తి గ్రంథిని తొలగించవలసి రావచ్చు. తర్వాత రేడియో యాక్టివ్‌ అయొడిన్‌, హార్మోన్‌ ట్రీట్మెంట్‌, రేడియేషన్‌ చికిత్సలు అవసరమవుతాయి. మెడ దగ్గరి చిన్న గడ్డలను కీహోల్‌ సర్జరీతో తొలగించవచ్చు. సర్జరీ తర్వాత జీవితాంతం థైరాయిడ్‌ హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ తీసుకోవలసి ఉంటుంది. మొదట్లో కొంత కాలం పాటు థెరపీ అందించి, తిరిగి హార్మోన్‌ స్థాయిలు పరీక్షించి, సరైన మోతాదును నిర్థారించవలసి ఉంటుంది. చికిత్స పూర్తయిన తర్వాత కూడా క్యాన్సర్‌ తిరగబెట్టకుండా వైద్యుల పర్యవేక్షణలో నడుచుకోవాలి. థైరాయిడ్‌ క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ, సక్సెస్‌ రేటు, రోగి జీవితకాలం లాంటి అంశాలు, వ్యాధి తీవ్రత, గుర్తించిన దశల మీదే ఆధారపడి ఉంటాయి. రేడియేషన్‌, పవర్‌ప్లాంట్స్‌కు దూరంగా ఉండడం ద్వారా ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.


-డాక్టర్ సి.హెచ్ మోహన వంశీ,

చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పటల్స్, హైదరాబాద్. ఫోన్ నెంబర్: 98490 22121




Updated Date - 2022-09-20T20:32:16+05:30 IST