జోరుగా బెల్టు

ABN , First Publish Date - 2022-07-04T06:37:37+05:30 IST

జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల జోరు కనిపిస్తోంది. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో బెల్ట్‌షాప్‌లు విచ్చలవిడిగా వెలువడంతో ఇష్టారీతిన అమ్మకాలు చేస్తున్నారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామాభివృద్ధి కమిటీలతో ఒప్పందం చేసుకుని బెల్ట్‌షాప్‌ల ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారు.

జోరుగా బెల్టు

గ్రామాల్లో యథేచ్ఛగా మద్యం అక్రమ విక్రయాలు

బెల్ట్‌షాపుల్లో విచ్చలవిడిగా అమ్మకాలు

ఆల్ర్పాజోలం, డైజొఫాం రవాణాపై కానరాని చర్యలు

జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలపై పట్టించుకోని అధికారులు

నిజామాబాద్‌, జూలై 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపుల జోరు కనిపిస్తోంది. గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో బెల్ట్‌షాప్‌లు విచ్చలవిడిగా వెలువడంతో ఇష్టారీతిన అమ్మకాలు చేస్తున్నారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో ఎక్కడ చూసినా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామాభివృద్ధి కమిటీలతో ఒప్పందం చేసుకుని బెల్ట్‌షాప్‌ల ద్వారా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం గ్రామానికి లక్షల్లో డబ్బులు ఇస్తూ మద్యం రేట్లను పెంచి అమ్ముతున్నారు. టార్గెట్‌లపై దృష్టిపెట్టిన అధికారులు అక్రమ విక్రయాలపై పట్టించుకోవడంలేదు. నెలవారి టార్గెట్‌లు పూర్తిచేయాల్సి ఉండడంతో మద్యం అమ్మకాలపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు. మహారాష్ట్ర మద్యం కూడా సరిహద్దుల ద్వారా జిల్లాకు వస్తుండడంతో నజర్‌పెట్టి పట్టుకుంటున్నారు.

ఏటా కోట్ల రూపాయల టర్నోవర్‌

జిల్లాలో 600 పైగా బెల్ట్‌షాప్‌లు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల పరిధిలో పలు దుకాణాల్లోనే ఈ మద్యం అమ్మకాలను చేస్తున్నారు. జిల్లాలో సాలీన భారీగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కోట్లల్లో మద్యం షాప్‌లకు టర్నోవర్‌ ఉంది. జిల్లాలో మద్యం అమ్మకాలపై టార్గెట్‌ ఉండడంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. మద్యం రేట్లు పెంచినప్పటి నుంచి జిల్లా టార్గెట్‌ను కూడా 80 కోట్లనుంచి 120 కోట్లకు పెంచడంతో ప్రతినెలా అమ్మకాలపైనే శాఖ అధికారులు దృష్టిపెడుతున్నారు. ఆయా మద్యం షాప్‌ల పరిధిలో ఎక్కువ అమ్మకాలు జరిగేవిధంగా చూస్తున్నారు. జిల్లాలో బెల్ట్‌షాప్‌లలో ధరలు పెంచి అమ్మకాలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నా కొన్నిచోట్ల కేసులు పెడుతున్న మిగతా చోట్ల టార్గెట్‌లు ఉండడంతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. టార్గెట్‌పైనే దృష్టిపెట్టి అమ్మకాలు జరిగేవిధంగా చూస్తున్నారు. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తుండడంతో గ్రామాల పరిధిలో జోరుగా ఈ మద్యం అమ్మకాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచినప్పటి నుంచి మహారాష్ట్ర మద్యంపై జిల్లావాసులు దృష్టిపెట్టారు. సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల వారు వివిధ ప్రాంతాల నుంచి మద్యాన్ని తెచ్చుకుని అమ్మకాలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మహారాష్ట్ర మద్యం వినియోగం పెరగడంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఆ ప్రాంతాల పైన దృష్టిపెట్టి చర్యలు చేపడుతున్నారు. మహారాష్ట్ర మద్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. సరిహద్దు దాటి రాకుండా టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని నియమించి ఎక్సైజ్‌శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

జిల్లాలో 102 మద్యం షాప్‌లు

జిల్లాలో 102 మద్యం షాప్‌లు ఉన్నాయి. వీటితో పాటు 13 వరకు బార్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి ప్రతినెలా రూ.160 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. జిల్లాలో అధికారికంగా మద్యంషాప్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు అనుమతులు ఉన్నా వీటికి మించి బెల్ట్‌షాప్‌లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఈ బెల్ట్‌షాప్‌లు ఉన్నాయి. ఆయా మద్యంషాప్‌ల యజమానులే వీటిని కొనసాగేవిధంగా చూస్తున్నారు. ఈ బెల్ట్‌షాప్‌లలో కూడా మద్యంషాప్‌కి వచ్చే మద్యం తరలిస్తూ అమ్మకాలు చేస్తున్నారు. 


కల్లు  విక్రయాలపై పట్టింపు కరువు

జిల్లాలో మద్యంతో పాటు కల్లు విక్రయాలపై కూడా శాఖ అధికారులు నజర్‌ పెట్టడంలేదు. జిల్లాలో అసలు కల్లుతో పాటు కొన్ని ప్రాంతాల్లో కల్తీ కల్లు అమ్మకాలు జరుగుతున్నా పట్టించుకోవడంలేదు. ఆల్ర్పాజోలం డైజోఫాం అక్రమ రవాణా చేస్తూ కల్లు తయారు చేసి అమ్మకాలు చేస్తున్నా కొన్నిచోట్ల అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరకు ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసి పలుచోట్ల ఈ ఆల్ర్పాజోలం, డైజోఫాంను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. రెండురోజుల క్రితం ఎడపల్లి మండలం కుర్ణపల్లిలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన కిలోకు పైగా ఆల్ర్పాజోలంను ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. కేసులు నమోదు చేశారు. మహారాష్ట్రతో పాటు ఇతరప్రాంతాల నుంచి జిల్లాకు ఈ కల్తీకల్లుకు ఉపయోగపడే ఈ రసాయణాలను రాకుండా అరికడితే కల్తీకల్లు తయారు చేసే అవకాశం ఉండదు. ఈ కల్లు తాగినవారు వివిధ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఆసుపత్రుల పాలవుతున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు పూర్తిస్థాయిలో నజర్‌పెడితే భారీగా నిల్వలు పట్టుబడే అవకాశం ఉంది. జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలపై చర్యలు చేపట్టామని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి తెలిపారు. బెల్ట్‌షాప్‌లపై నజర్‌పెట్టి పలుచోట్ల కేసులు నమోదు చేశామన్నారు. కల్తీ కల్లుకు ఉపయోగపడే డైజోఫాంను దొరకకుండా చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-07-04T06:37:37+05:30 IST